కేంద్రంపై హరీశ్‌ నిప్పులు

ABN , First Publish Date - 2023-02-07T03:56:27+05:30 IST

తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పదే పదే ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌ ప్రసంగంలో.. ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది.

కేంద్రంపై హరీశ్‌ నిప్పులు

బడ్జెట్‌ ప్రసంగంలో తీవ్ర విమర్శలు

19 సార్లు కేంద్రం చర్యల ప్రస్తావన

తెలంగాణ అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ

గవర్నర్‌ ప్రసంగానికి భిన్నమైన వైఖరి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్ర‌జ్యోతి): తెలంగాణ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని పదే పదే ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్‌ ప్రసంగంలో.. ఆరోపణల తీవ్రతను మరింత పెంచింది. కేంద్రం నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను, సహాయ నిరాకరణను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగింది. బడ్జెట్‌కు సంబంధించి ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ చేసిన ప్రసంగంలో కేంద్రంపై ఎటువంటి ప్రస్తావన చేయకపోవడంతో.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు వల్లే కేంద్రంతో రాజీ ధోరణి అనుసరిస్తున్నారా? అంటూ మిత్రపక్షమైన మజ్లిస్‌ విమర్శలు కూడా చేసింది. కానీ, సోమవారం బడ్జెట్‌ ప్రసంగంలో మాత్రం కేంద్రం తీరుపై నిప్పులు చెరిగింది. దీంతో ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌తో ప్రసంగం చేయించడం వల్ల.. ఆమె సూచనలతోనే కేంద్రంపై విమర్శలకు తావులేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుందని తెలుస్తోంది. కానీ, తాజా బడ్జెట్‌ ప్రసంగంలో తొలి పేజీలన్నీ కేంద్రంపై విమర్శలతోనే నిండిపోయాయి. దాదాపు 19 చోట్ల కేంద్రంపై విమర్శలు చేయడం గమనార్హం.

ఆ అంశాలు...

కేంద్రం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయి.

2022-23లో ఆర్థిక సామర్థ్యం మేరకు రుణ పరిమితిని రూ.53,970 కోట్లుగా బడ్జెట్‌లో పెట్టి, సభలో ఆమోదం తీసుకున్నాం. కానీ, కేంద్రం ఏకపక్షంగా రూ.15,033కోట్లు కోత విధించింది.

దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంక్షేమ పథకాలను ‘రేవడీ’ అని అవహేళన చేస్తున్నాయి. ఉచితాలు అంటూ అనుచితంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

చేనేత పరిశ్రమను నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కేంద్రం అందుకు భిన్నంగా చేనేతరంగాన్ని దెబ్బతీస్తూ 5శాతం జీఎస్టీ విధించింది.

తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్రం తోడ్పాటు అందించకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటా నిర్ధారణకు ట్రైబ్యునల్‌ వేయకుండా ఇబ్బందులు పెడుతోంది. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయహోదా కల్పించాలని కోరుతున్నా పట్టించుకోవట్లేదు. యూపీ, కర్ణాటక ప్రాజెక్టులకు హోదా కల్పించి, పక్షపాతాన్ని చాటుకుంది.

గత యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేయకుండా కేంద్రం ఉద్దేశపూర్వకంగా సమస్యను సృష్టించింది. పైగా నూకలు బుక్కడం అలవాటు చేసుకోవాలన్న కేంద్ర మంత్రి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల హృదయాలను తీవ్రంగా గాయపరిచాయి.

మోటార్లకు మీటర్లు పెట్టడంలేదని రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కేంద్రం కోతలు పెట్టింది.

కేంద్రం సహకారం లేకపోయినా ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ గణనీయమైన వృద్ధి సాధించింది.

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం ఆమోదించిన అనేక అంశాలను కేంద్రం అమలు చేయలేదు.

తెలంగాణ ఏర్పడిన కొత్తలో కేంద్ర పథకాల కింద ఇవ్వాల్సిన రూ.495 కోట్లను కేంద్ర మంత్రిత్వ శాఖలు బాధ్యతారహితంగా ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేశాయి.

విద్యుత్తు వినియోగానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ నుంచి రూ.17,828కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో తెలంగాణకు కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకుండా పోయింది.

పైగా,విద్యుత్తు సరఫరాకు సంబంధించి రూ.3441.78 కోట్లు, వడ్డీ కింద రూ.3315 కోట్లు కలిపి ఏపీ జెన్‌కోకు 30 రోజుల్లోగా చెల్లించాలని కేంద్రం ఆదేశించింది.

కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి, డిండి పథకాలకు కేంద్రం ఆటంకాలు సృష్టిస్తోంది.

నదీజలాలచట్టంలోని సెక్షన్‌-3ని అనుసరించి.. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు సూచించాల్సి ఉండగా.. కేంద్రం కాలయాపన చేస్తోంది.

కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ ప్లాంట్‌, గిరిజవర్సిటీ ఏర్పాటు హామీలు నెరవేర్చలేదు. పైగా ఐటీఐఆర్‌ ప్రాజెక్టును రాష్ట్రానికి రాకుండా చేసింది.

విభజన తర్వాత పదేళ్లపాటు సుస్థిర అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని చట్టంలోని 13వ షెడ్యూల్‌ చెప్పినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదు.

వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఏటా రూ.450కోట్లు ఇవ్వాలి. కానీ, మూడేళ్లపాటు 1350కోట్లు ఇవ్వలేదు.

విభజన చట్టంలోని సెక్షన్‌-94(1) ప్రకారం రెండు రాష్ట్రాల్లో కేంద్రపన్నుల్లో రాయితీలు ప్రకటించి, పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. నామమాత్రపు రాయితీలతో సరిపెట్టింది.

ఆర్థిక సంఘం సిఫారసులను యథాతథంగా అమలు చేసే సంప్రదాయానికి తిలోదకాలిచ్చింది. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఆర్థిక సంఘం సిఫారసులను ఇలా బేఖాతరు చేయలేదు.

Updated Date - 2023-02-07T03:56:28+05:30 IST