గురుతులు గాయబ్‌!

ABN , First Publish Date - 2023-06-02T02:39:22+05:30 IST

తెలంగాణ ఉద్యమం అనగానే మీకెవరు గుర్తుకొస్తారు!? ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌! శాంతియుతంగా, అద్భుత సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌

గురుతులు గాయబ్‌!

అప్పటి ఉద్యమకారులంతా శంకరగిరి మాన్యాలు

విద్యార్థులు వీరోచితంగా పోరాడారు! నిరుద్యోగులు లాఠీ దెబ్బలు తిన్నారు! ఉద్యోగులు ఉద్యమించారు! మహిళలు వంటా వార్పు చేశారు! జర్నలిస్టులు కలాలు ఝళిపించారు! ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అంటూ సబ్బండ వర్గాలూ నినదించాయి!

అన్ని పార్టీలు, వర్గాల పోరాటంతో రాష్ట్రం సిద్ధించింది! నేటితో తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి! పదో ఏడాదిలో తెలంగాణ అడుగు పెడుతోంది! ఇప్పుడు తెలంగాణ వెలిగిపోతోందని ప్రభుత్వం అంటోంది! ‘తెలంగాణ దశాబ్ది’ పేరిట ఉత్సవాలు నిర్వహిస్తోంది!

నిజానికి, ఎవరైనా పదేళ్లు పూర్తయిన తర్వాత ఉత్సవాలు నిర్వహిస్తారు! పదో ఏట అడుగు పెట్టినప్పుడు ఉత్సవాలకు శ్రీకారం చుట్టినా.. పదేళ్లు పూర్తయిన తర్వాత మాత్రమే ఘనంగా నిర్వహిస్తారు! భారత అమృతోత్సవాలు అయినా.. పీవీ శత జయంతి అయినా ఇదే బాటన సాగాయి.

కానీ, ఇది ఎన్నికల సంవత్సరం కదా! ఆరు నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి! రాజకీయ కోణమే ప్రభుత్వ పెద్దలకు ముఖ్యం! అందుకే, ‘నవాబ్ది’లోనే దశాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. తొమ్మిదేళ్లలో..

సబ్బండ వర్గాలకు అందిన ఫలాలు ఏమిటి!?

ఆశించిన ప్రత్యేక రాష్ట్రం సాకారమైందా!? తొమ్మిదేళ్ల ప్రస్థానంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలు..

కోదండరామ్‌, రఘు, ఈటల తదితరులకు వేధింపులు

జయశంకర్‌, కేశవరావ్‌ జాదవ్‌, శ్రీకాంతాచారి గుర్తింపునకు నో

అందెశ్రీ, సిధారెడ్డి, ప్రజా సంఘాలన్నీ దూరం దూరం

ఉద్యమాలతో ఏర్పడిన రాష్ట్రంలో పోరాటమే నిషిద్ధాక్షరి

ఉద్యమాల ధర్నాచౌక్‌కు ఉరి వేయాలనే సర్కారు కుట్ర

ఉద్యమకారులనే విధ్వంసకారులుగా చూపించిన ఉద్యమ సర్కార్‌

ఇచ్చింది తీసుకోవడం తప్పితే పోరాటం అంటే పాతరే

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమం అనగానే మీకెవరు గుర్తుకొస్తారు!? ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌! శాంతియుతంగా, అద్భుత సమన్వయంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌! విద్యుత్తు రంగంలోని లోపాలను ఎత్తిచూపిన విద్యుత్తు జేఏసీ చైర్మన్‌ రఘు! జయ జయహే తెలంగాణ అంటూ నినదించిన అందెశ్రీ! నాన్‌ ముల్కీ నుంచి తెలంగాణ సాధన వరకూ కీలక పాత్ర పోషించిన కేశవరావ్‌ జాదవ్‌! తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసిన శ్రీకాంతాచారి! ప్రతిరోజూ తెలంగాణ ఉద్యమ నినాదాలతో దద్దరిల్లిన ధర్నా చౌక్‌, ఉస్మానియా యూనివర్సిటీ! ప్రత్యేక రాష్ట్ర నినాదానికి ఊపిరిలూదిన ప్రజా సంఘాలు! మరి, ఈ పేర్లు ఇప్పుడు ఎక్కడైనా వినిపిస్తున్నాయా!? ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ గురుతులు కనిపిస్తున్నాయా!? ఇప్పుడు ఉద్యమాల్లేవ్‌! ఉద్యమకారుల్లేరు! రాజకీయ పార్టీగా మారిన ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ (బీటీ) పేరిట ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడమే

ఇందుకు కారణం! ఉద్యమాలతో పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఇప్పుడు ‘నిషిద్ధాక్షరి’గా మారింది. ఉద్యమకారుడు అనే పదం ఒకప్పుడు భుజకీర్తులుగా వెలుగొందితే.. ఇప్పుడు భారంగా పరిణమించింది. ‘అయితే నాతో ఉండు. లేదా, నా శత్రువువే’ అన్నదే ఇప్పుడు ఉద్యమ నినాదమైంది. అందుకే, గళమెత్తే.. గళమెత్తుతారని భావించిన నాయకులు, అధికారులను శంకరగిరి మాన్యాలు పట్టిస్తోంది. ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని బీటీ నాయకులే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతున్నారు.

పాపం.. కోదండరామ్‌!

మిలియన్‌ మార్చ్‌, సకల జనుల సమ్మె సహా ఉద్యమాన్ని శాంతియుతంగా నడిపించడంలో కోదండరామ్‌దే కీలక పాత్ర. 2009 డిసెంబరు తర్వాత ఉద్యమమంతా ఆయన నేతృత్వంలోనితెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలోనే జరిగింది. ఆయన నాయకత్వాన్ని అన్ని రాజకీ య పక్షాలే కాకుండా విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు విశ్వసించాయి. ఆయన ముందుండి ఒక్క పి లుపునిస్తే.. వందలు, వేలు, లక్షల సంఖ్యలో పోరాటంలో పాల్గొన్నారు. ఎంతమంది రెచ్చగొట్టినా ఏ మాత్రం సహనం కోల్పోకుండా శాంతియుత పోరాటం జరిగింది కోదండరామ్‌ నేతృత్వంలోనే. కానీ, తెలంగాణ ఆవిర్భావం తొలిరోజు నుంచే ఆయనను పక్కనబెట్టేశారు. ఆయన పేరు వినిపించకుండా చేసేశారు. చివరికి, ఆయన పార్టీని పెట్టుకుంటే తీవ్రంగా వేధించారు. ఆయన చుట్టూ ఉన్న మందీ మార్బలాన్ని లాగేసుకుని.. ఉద్యమంలో అసలు ఆయన పాత్రే లేదన్నట్లు వ్యవహరించారు. కోదండరామ్‌ తర్వాత.. ఆ తరహాలో ఆయన కు మద్దతు ఇచ్చినందుకు తీవ్ర వేధింపులు ఎదుర్కొన్న మరొక ఉద్యమకారుడు విద్యుత్తు అధికారి రఘు! ఆయన ఇచ్చిన సమాచారమే ప్రామాణికంగా అప్పట్లో ఉద్యమ పార్టీలు, నాయకులు పోరాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అన్యాయాన్ని ప్రశ్నించడమే ఆయన పాలిట శాపమైంది. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆయన్ను తొలుత వరంగల్‌కు బదిలీ చేశారు. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా.. అనివార్యం గా అందరు ఉద్యోగులతోపాటే ఆయనకు చీఫ్‌ ఇంజనీర్‌గా పదోన్నతి ఇవ్వగా.. ఆ తర్వాత సుప్రీం కోర్టు తీర్పు వంకతో రాష్ట్రంలో మరే ఉద్యోగికి లేని విధంగా సర్వీసు సీనియారిటీని సిద్ధం చేయాలనే కారణం చూపించి.. ఏకంగా రెండు క్యాడర్ల పదోన్నతులను ఆయన నుంచి లాక్కున్నారు. అచ్చు ఇదే తరహాలో.. ఉద్యమానికి ఊపిరిలూదిన ఈటల రాజేందర్‌ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గళమెత్తారు. ‘గులాబీ జెండాకు యజమానులం మేమే’ అని వ్యాఖ్యానించారు. అంతే.. పార్టీలోనే ఆయనకు పొగబెట్టారు. ప్రభుత్వం నుంచి సాగనంపారు. ఆ తర్వాత కూడా ఆయన వ్యాపారాలపై రకరకాల దాడులతో వేధించారు.

కనుమరుగైన ఉద్యమకారులు

ప్రత్యేక రాష్ట్రం రావడానికి కారణమైన ప్రొఫెసర్‌ జయశంకర్‌కు కూడా తెలంగాణలో తగిన గుర్తింపు రాలేదనే ఆవేదన ఉద్యమకారుల్లో నెలకొంది. వ్యవసాయ వర్సిటీకి, ఓ జిల్లాకు పేరు తప్పితే సిద్ధాంతకర్తకు తగిన గుర్తింపు దక్కలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గుర్తింపు లేకుండాపోయిన ఉద్యమకారుల్లో కేశవరావు జాదవ్‌ ఒకరు. ఓయూ పూర్వ అధ్యాపకుడైన జాదవ్‌ 1952లో నాన్‌ ముల్కీ గో బ్యాక్‌ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పో షించారు. 1956లో ప్రత్యేక హైదరాబాద్‌ రాష్ట్రం కోసమే పోరాటం చేయడమే కాకుండా 1975 ఎమర్జెన్సీ కా లం లో జైలు జీవితం కూడా గడిపారు. ఆ తర్వాత 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2001లో టీఆర్‌ఎస్‌ ఏర్పాటు క్రమంలో పార్టీ అధినేతకు దిశానిర్దేశం చేశారు. వయసు ఏమాత్రం సహకరించకపోయినా 2009 నుంచి 2013 దాకా జరిగిన ఉ ద్యమంలోనూ క్రియాశీలంగా వ్యవహరించారు. 2018లో చనిపోయిన ఆయన స్మారకార్థం ఒక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం చేపట్టలేదు. ఇక, తెలంగాణ ఏర్పాటులో 2009 డిసెంబరులో రాష్ట్రం కోసం ఆత్మార్పణ చేసిన కాసోజు శ్రీకాంతాచారి పాత్ర అత్యంత కీలకం.

తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేళ్లకు కనుమరుగైన ఎల్బీ నగర్‌ చౌరస్తాకు ఆయన పేరు పెట్టారు తప్పితే అంతకు మించి గుర్తింపు దక్కలేదు. ప్ర త్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన తల్లి శంకరమ్మ పేరును పరోక్ష ఎన్నికల్లో కానీ, నామినేటెడ్‌ పదవులకు కానీ అసలు పరిగణనలోకే తీసుకోలేదు. అలాగే, ఉద్యమంలో మంజీరా రచయితల సంఘానిది కీలక పాత్ర. ఆ సంఘానికి నేతృత్వం వహించే నందిని సిధారెడ్డి తెలంగాణ వచ్చాక సాహిత్య అకాడమీ బాధ్యతలు చూశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో క్రమంగా దూరమయ్యారు. ఇక, ఉద్యమ సమయంలోనే కాదు.. ఇప్పుడు కూడా తెలంగాణ పల్లె పల్లెనా వినిపించే జయ జయహే తెలంగాణ గేయ రూపకర్త అందెశ్రీకి కూడా తగిన గుర్తింపు దక్కలేదు. విమలక్క, గాదె ఇన్నయ్య తదితర ఉద్యమకారులది ఇదే పరిస్థితి. ఇక, ఉద్యమానికి చేయూతనిచ్చిన ప్రజా సంఘాలదీ ఇదే పరిస్థితి. ప్రజాసంఘాలపైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. మంత్రులు జిల్లాల పర్యటనకు వెళితే తొలి వేటు పడేది ప్రజా సంఘాల నేతలపైనే. వారినే ముందస్తు అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. ఏకంగా, 16 ప్రజా సంఘాలను నిషేధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆ ఫలాలు తమకు అందాయని ఆశించి.. ఆ తర్వాత కనుమరుగైన ఉద్యమకారులు ఎందరో!

ఉస్మానియా వర్సిటీలో ‘ప్రత్యేక డ్రైవ్‌’లు

ఉస్మానియా యూనివర్సిటీ.. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమ కేంద్రం. ‘అట్టుడికిన ఉస్మానియా’ అనే శీర్షిక రాని పత్రికే లేదు. ఉద్యమం కాస్త నీరసపడినప్పుడల్లా విద్యార్థులు, నిరుద్యోగులు ఇక్కడి నుంచే పోరాటాన్ని ముందుకు నడిపించారు. ఇక్కడి పోరాటంతోనే ఎంతోమంది నేతలు ఉద్యమదారికి వచ్చారు. అటువంటి ఉద్యమ వర్సిటీని ఇప్పుడు పూర్తిస్థాయిలో నీరుగార్చేశారు. సీఎం కానీ, మంత్రులు కానీ తొమ్మిదేళ్లలో ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. సరికదా.. హాస్టళ్లలో అక్రమంగా ఉంటున్న విద్యార్థులను ఖాళీ చేయించడం పేరిట ‘ప్రత్యేక డ్రైవ్‌’లు నిర్వహించింది. దాంతో, విద్యార్థులు, నిరుద్యోగులంతా సైలెంటైపోయారు.

మీడియాపైనా అణచివేత

అప్పట్లో ఉద్యమానికి మీడియా సహకారం నభూతో..! రాష్ట్రం సిద్ధించే వరకూ ఉద్యమం వెంట నడిచింది! తెలంగాణ వచ్చిన తర్వాత కూడా రాష్ట్రం ప్రగతి పథంలో పయనించడానికి వీలుగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపింది! మంచి చెడులను విశ్లేషించింది. అంతే.. అటువంటి మీడియాపై ప్రభుత్వం కత్తికట్టింది. ‘ఏబీఎన్‌’ ప్రసారాలపై నిషేధం విధించింది. తద్వారా, మిగిలిన మీడియాలను తన దారికి తెచ్చుకుంది. ప్రభుత్వ విధానాలు, పథకాల్లోని లోపాలను ప్రశ్నిస్తే అణచివేతకు పాల్పడుతోంది. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్న ‘ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతి’పైనా కక్ష సాధింపులకు పాల్పడుతోంది. ఆర్థికంగా దెబ్బతీయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అలాగే, తమకు, తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే సోషల్‌ మీడియాపైనా అణచివేతకు పాల్పడుతోంది. అలా పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతోంది. అరెస్టులు చేస్తోంది.

ధర్నా చౌక్‌కు చరమగీతం

ధర్నా చౌక్‌.. ఽఉద్యమ సమయంలో తెలంగాణ గుండెకాయ. ‘జై తెలంగాణ’ అంటూ ఇక్కడ కొన్ని లక్షలు, కోట్ల సార్లు నినదించింది. ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు,, విద్యార్థి సంఘాలు.. ఆ సంఘం ఈ సంఘం అని లేదు.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ప్రతి సంఘం ఇక్కడ నినదించింది. ఇక్కడ నేతలు లాఠీదెబ్బలు తిన్నారు. కేసులు నమోదై పోలీసు స్టేషన్లకు వెళ్లారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిందే ధర్నా చౌక్‌! ఉద్యమాల ద్వారా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వమే అటువంటి ధర్నా చౌక్‌ ఊపిరి తీసింది. ఇక్కడ నిరసనలను నిషేధించింది. ఆందోళనలపై ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ శివార్లలోనే ఆందోళనలు చేసుకోవాలని నిర్దేశించింది. చివరకు, హైకోర్టు జోక్యంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

వాళ్లు విధ్వంసకారులట!

ఉమ్మడి ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమకారులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు ఏమిటో తెలుసా!? ‘విధ్వంసకారులు’! తెలంగాణలో ఉద్యమాలను అణచి వేయడానికి గతంలో తమ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాలనే తప్పుబట్టడం ఇక్కడ విశేషం. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఎవరికి తోచిన విధంగా వారు భాగస్వాములు అయ్యారు. శాంతియుత ఆందోళనల్లోనూ కొందరు విగ్రహాల విధ్వంసం వంటి హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ‘కొలువులకై కొట్లాట’ కార్యక్రమం చేపట్టేందుకు పోలీసుల అనుమతి కోరారు. అందుకు వారు నిరాకరించారు. దాంతో, జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అనుమతి నిరాకరించడానికి కారణాన్ని హైకోర్టుకు నివేదిక రూపంలో పోలీసులు వివరించారు. ఉద్యమ సమయంలో జేఏసీ ట్యాంక్‌ బండ్‌పై నిర్వహించిన కార్యక్రమంలో విగ్రహాలను ధ్వంసం చేసిందని, పోలీసులపై దాడి చేసిందని, వారి ఆందోళనలో ‘ఇతరులు’ భాగస్వాములయ్యారని పేర్కొన్నారు. పోలీస్‌ అనుమతి నిరాకరించడంపై హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలోనూ ప్రభుత్వం దాదాపుగా ఇవే అంశాల్ని ప్రస్తావిస్తూ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేయడం విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాట సమయంలో జరిగిన ఆందోళనలను సాకుగా చూపించి ప్రత్యేక రాష్ట్రంలో నిరసనలకు అనుమతి నిరాకరించడం గమనార్హం.

పోరాడితే.. పాతరే!

ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడం.. ధర్నా చౌక్‌పై నిషేధం విధించడం మాత్రమే కాదు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాటను వినడానికి కూడా ప్రభుత్వ పెద్దలు సుముఖంగా లేరు. అందుకే, ఎవరు ఏ చిన్న ఆందోళన చేపట్టినా సామ దాన భేద దండోపాయాలతో తమ దారికి తెచ్చుకుంటున్నారు. తాము ఇచ్చింది తీసుకోవడం తప్ప మరో మార్గం లేదన్న పరిస్థితి కల్పిస్తున్నారు. ఉదాహరణకు, రాష్ట్రం ఏర్పడిన తొలిదశలో తొలుత సీపీఎం అనుబంధ కార్మిక సంఘం సీఐటీయూకు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాలను తీవ్రస్థాయిలో దెబ్బకొట్టారు. తొలుత జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్య కార్మిక సంఘంపై.. ఆ తర్వాత అంగన్‌వాడీ సంఘంపై, అదే క్రమంలో ఆశా వర్కర్లపై ఉక్కుపాదం మోపింది. ఆర్టీసీలో వేతన సవరణతోపాటు సంస్థ పరిరక్షణ కోసం దీర్ఘకాల పోరాటం జరగ్గా.. కార్మిక సంఘాలను విచ్ఛిన్నం చేసింది. అసలు గుర్తింపు సంఘం ఎన్నికల్లేకుండా చేసింది. వేతన సవరణ కోసం ఇటీవలే సమ్మె చేసిన ఆర్టిజన్లను ఉద్యోగాల నుంచి తొలగించింది. సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతూ జేపీఎస్‌లపైనా ఇదే విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడేలా చేసింది. రాష్ట్రం ఏర్పడితే సామాజిక తెలంగాణను సాధిస్తామని ప్రకటించి.. ఉద్యమాన్ని భుజంమీద పెట్టుకొని నడిపించిన వారు కూడా తొమ్మిదేళ్లలో కాలగర్భంలో కలిసిపోయేలా చేయడంలో అధికార పార్టీది కీలక పాత్ర.

Updated Date - 2023-06-02T02:39:29+05:30 IST