BRS Govt NO Schemes: తక్షణమంటే ఎన్నాళ్లు?

ABN , First Publish Date - 2023-04-18T03:16:33+05:30 IST

నిరుపేదలకు లబ్ధి చేకూర్చే పలు సంక్షేమ పథకాల అమలు విషయంలో రాష్ట్ర సర్కారు సాచివేత ధోరణి అవలంబిస్తోంది. పోడు భూములకు పట్టాల పంపిణీ, దళిత బంధు, గొర్రెల పథకం, స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు.. ఇలా పలు పథకాల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, సత్వరమే విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్వహించే సమీక్షా సమావేశాల్లో అధికారులకు ఆదేశాలిస్తుంటారు.

BRS Govt NO Schemes: తక్షణమంటే ఎన్నాళ్లు?

సత్వరమే పథకాల అమలంటూ హామీలు.. నెలలు గడుస్తున్నా మార్గదర్శకాలేవి?

ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు, గొర్రెల పథకం

పోడు పట్టాలు, దళితబంధుపై సర్కారు సాచివేత

తక్షణమే మార్గదర్శకాలు జారీచేస్తామంటూ

ఆరు నెలలుగా చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

లబ్ధిదారుల్లో చాలా మందికి దక్కని ప్రయోజనం

తక్షణమే.. అంటే అర్థమేమిటి? సాధారణ పరిభాషలోనైతే.. ‘వెంటనే’ అని అర్థం.

ఏదైనా పని తక్షణమే చేస్తామని చెబితే వెంటనే చేస్తాం. మహా అయితే.. ఒక గంట తర్వాతో, ఆ పూటో, ఆరోజో, మరీ ఆలస్యమైతే మర్నాడో చేస్తాం.

సర్కారు దృష్టిలో మాత్రం ‘సత్వరమే’, ‘తక్షణమే’ అనే మాటలకు కచ్చితమైన నిర్వచనమేదీ లేదు. నిర్దిష్టమైన కాలావధీ లేదు! పలు సంక్షేమ పథకాలకు సంబంధించి సీఎం కేసీఆర్‌ నుంచి మంత్రుల దాకా.. ఆ రెండు పదాలనూ పదేపదే వాడుతుంటారు. వారి దృష్టిలో ‘సత్వరమే’, ‘తక్షణమే’ అంటే.. అది ఒక వారం కావచ్చు, నెల.. రెండు నెలలు.. ఆరు నెలలు కూడా కావచ్చు! అప్పటికీ పని కాకపోనూవచ్చు!!

‘‘ఖాళీ జాగాలు ఎవరికి ఉన్నయొ వారికి రూ.3 లక్షలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తం. రాబోయే 10, 15 రోజుల్లో శాసనసభ్యుల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా నియోజకవర్గానికి 1000 ఇండ్ల చొప్పున అదనంగా మంజూరు చేస్తాం. దళితబంధును కూడా అమలు చేసుకోవాలె.. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సెలక్షన్‌ చేయమన్నాం’’

- 2022, డిసెంబర్‌ 4న మహబూబ్‌నగర్‌ జిల్లాలో కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవంలో సీఎం కేసీఆర్‌

‘‘1.3 లక్షల కుటుంబాలకు రెండో విడత దళితబంధు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలి. సొంతజాగా ఉన్నవారికి ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం కింద రూ.3 లక్షలు అందించాలి. పోడు హక్కు పట్టాల పంపిణీని వెంటనే ప్రారంభించాలి’’

- మార్చి 9న నిర్వహించిన క్యాబినెట్‌ భేటీలో కేసీఆర్‌ చేసిన ప్రకటన

‘‘పోడు భూములకు హక్కు పట్టాల పంపిణీ తేదీని త్వరలోనే ప్రకటిస్తాం. ఖాళీ జాగాలున్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం అందించే రూ.3 లక్షల సాయం అమలుకు విధివిధానాలను రూపొందించి జారీ చేయాలి. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలి’’

- మార్చి 28న నిర్వహించిన సమీక్షలో కేసీఆర్‌ అధికారులకు ఇచ్చిన ఆదేశాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు లబ్ధి చేకూర్చే పలు సంక్షేమ పథకాల అమలు విషయంలో రాష్ట్ర సర్కారు సాచివేత ధోరణి అవలంబిస్తోంది. పోడు భూములకు పట్టాల పంపిణీ, దళిత బంధు, గొర్రెల పథకం, స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు.. ఇలా పలు పథకాల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, సత్వరమే విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించాలని సీఎం కేసీఆర్‌ నిర్వహించే సమీక్షా సమావేశాల్లో అధికారులకు ఆదేశాలిస్తుంటారు. సమీక్ష జరిగినా, క్యాబినెట్‌ భేటీ అయినా కేసీఆర్‌ నోటి వెంట వచ్చే మాటలు ఈ రెండే. కానీ ఆయన మాటల్లో కనపడుతున్న ‘వేగం’.. అమల్లో కనపడట్లేదు. పలు సంక్షేమ పథకాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయాయి. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల సాయం, పోడు హక్కు పట్టాల పంపిణీ పథకాలను సీఎం కేసీఆర్‌ 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనే ప్రకటించారు. ఐదేళ్ల పదవీకాలం ముగిసే సమయం ఆసన్నమై మళ్లీ ఎన్నికలు వస్తున్నా.. ఇప్పటికీ ఇవి అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.

ఇక దళితబంధు పరిస్థితీ ఇదే రీతిలో ఉన్నది. రెండో విడత దళితబంధు పథకం అమలుపై విధివిధానల రూపకల్పనకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినా.. అందుకు ఒక్క అడుగూ ముందుకు పడట్లేదు. మరో వైపు రెండో విడత గొర్రెల పంపిణీ పథకం కూడా అమలుకు ఆమడదూరాన ఉంటోంది. గొర్రెల పంపిణీకి ఎన్‌సీడీసీ రుణం ఇచ్చేందుకు సంసిద్ధతత వ్యక్తం చేసినా.. ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తోందో అర్థం కాని పరిస్థితి. 2019 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌.. మంత్రులతో క్యాబినెట్‌ భేటీ, ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించినపుడల్లా ‘ఈ పథకాల అమలుకు సత్వరమే చర్యలు తీసుకోండి’ అంటూ ఆదేశాలివ్వడం, అధికారులూ సరే అనడం పరిపాటిగా మారింది. తప్పితే అమలు మాత్రం జరగడంలేదు. 2022 డిసెంబర్‌ నుంచి చూసుకున్నా.. ఈ ఐదు నెలల్లోనే ఈ నాలుగు పథకాలపై దాదాపు 20 నుంచి 30 సార్లు చర్చించగా, ఒక్క మార్చిలోనే అటు సీఎం, ఇటు ఉన్నతాధికారులు దాదాపు 10 సార్లు రివ్యూ చేసినట్టు తెలుస్తోంది. వెరసి.. ఏళ్లు గడుస్తున్నా సర్కారు మాత్రం ఈ నాలుగు పథకాల అమలును ఎటూ తేల్చడం లేదు. ఈ పథకాల కోసం లక్షలమంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

పథకాల పరిస్థితి ఇదీ!

పోడు హక్కు పట్టాల పంపిణీ అంశంపై గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌.. ‘వచ్చే నెలలో’ గిరిజనులకు పట్టాలు అందిస్తాం అని డిసెంబరు నుంచి ప్రకటిస్తూ వస్తున్నారే తప్ప అమలుకు చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు పట్టాల కోసం 4.14 లక్షల మంది నుంచి 12.46 లక్షల ఎకరాలకు దరఖాస్తులు వచ్చాయి.వీటిలో మొదటి ఫేజ్‌ కింద 1,55,393 మందికి అందిస్తామని, ఇందుకు అవసరమైన పట్టాల ముద్రణ కూడా పూర్తయిందని అధికారులు సీఎంకు మార్చి 9 నాటి సమీక్షలో తెలిపారు. అయినా పట్టాలు పంపిణీకి నోచుకోవడంలేదు.

సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల సాయంపైనా సర్కారు సాచివేత వైఖరిని అవలంబిస్తోంది. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ పథకంలో సాయం రూ.5 - 6 లక్షల నుంచి రూ.3 లక్షలకు కుదించుకుపోయింది. ఆ సాయాన్ని కూడా ఇప్పటికీ అందించట్లేదు.

2022 డిసెంబరులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ఈ పథకాన్ని 15 రోజుల్లోనే అందిస్తామని ప్రకటించారు. అది ఇంతవరకూ అమలుకు నోచుకోలేదు. మార్చి 9న జరిగిన క్యాబినెట్‌ భేటీలోనూ దీనిపై చర్చించగా.. నియోజవర్గానికి 3వేల మంది చొప్పున 119 నియోజకవర్గాల్లో 4 లక్షల మందికి సాయం చేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. నెల దాటినా.. కార్యరూపం దాల్చలేదు.

డబుల్‌ బెడ్రూం ఇండ్లపైనా సర్కారు ఎటూ తేల్చట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా డబుల్‌ ఇళ్ల కోసం 12,61,736 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఒక్క హైదరాబాద్‌లోనే సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్కారు 2,91,057 ఇళ్లను మంజూరు చేయగా, ఇప్పటివరకూ నిర్మించింది కేవలం 1.18 లక్షల ఇళ్లు మాత్రమే. వీటిలో 69 వేల ఇళ్లు మాత్రమే 90 శాతం పూర్తయ్యాయి. కాగా జిల్లాల్లో డబుల్‌ బెడ్రూంల కోసం తీస్తున్న లాటరీల్లో అవతవకలు జరుగుతున్నాయని, ఎమ్మెల్యేల అనుయాయులకే ఇళ్లను కేటాయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.

దళితబంధు పథకాన్ని కొనసాగించాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ మార్చి 28న ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలోనూ సూచించారు. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు మార్గదర్శకాలను రూపొందించిన నివేదికను సీఎం వద్దకు పంపగా.. అక్కడే పెండింగ్‌లో ఉందని సమాచారం.

గొర్రెలను పంపిణీపై సర్కారు నాలుగైదేళ్లుగా జాప్యం చేస్తోంది. రెండో విడతలో 3.75 లక్షల మంది లబ్ధిదారులకు యూనిట్లను అందించాలని సర్కారు లక్ష్యంగా విధించుకుంది. ఇందుకోసం 2017లో ఫైనల్‌ చేసిన జాబితాను ఫైనల్‌ చేసింది. వీటిలో ఇప్పటివరకు లిస్ట్‌-ఏ ను ఫస్ట్‌ ఫేజ్‌లో అమలుచేశారు. లిస్ట్‌-బిలో ఉన్న లబ్ధిదారులకు ఇప్పటికీ యూనిట్లను అందించలేదు. ఇక రెండో విడత అమలుకు అవసరమైన నిధులను నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌సీడీసీ) నుంచి తీసుకోవాలని భావించగా, ఆ సంస్థ సైతం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయినా ఎందుకు జాప్యం జరుగుతోందో అంతుబట్టట్లేదు.

Updated Date - 2023-04-18T03:16:35+05:30 IST