TS GOVT BC: బీసీలకు సర్కారీ మోసం
ABN , First Publish Date - 2023-06-07T04:01:51+05:30 IST
వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల వారిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది.
స్వయం ఉపాధి కోసం వచ్చిన 9లక్షల రుణ దరఖాస్తులు రద్దు
కులవృత్తులకు రూ.లక్ష సాయం పథకానికి
కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని వెల్లడి
కానీ అందుకు కేవలం 15 రోజులే అవకాశం
కుల ధ్రువీకరణ పరత్రం రావడానికే నెల రోజులు
ఆదాయ ధ్రువీకరణపత్రం రావాలంటే10రోజులు
కుల వృత్తులకు రూ.లక్ష పథకం 9న షురూ
విడతలవారీ సాయం.. తొలి విడత 200 కోట్లు
హైదరాబాద్, జూన 6 (ఆంధ్రజ్యోతి): వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాల వారిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి మోసం చేసింది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు (2014-15 నుంచి 2022-23) స్వయం ఉపాధి రుణాల కోసం వారు చేసుకున్న దరఖాస్తుల్లో పరిష్కారం కానివాటన్నింటినీ రద్దు చేసింది. తాజాగా కులవృత్తులకు రూ.లక్ష సాయం పేరుతో కొత్త పథకాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. జూన 9న ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద సాయం కోసం మంగళవారం నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శాఖ అధికారులతో కలిసి సచివాలయంలో దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. కాగా.. ఈ పథకం వివరాలను తెలుపుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవోఆర్టీ 764లో.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారినే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. దీంతో స్వయం ఉపాధి రుణాల కోసం ఇప్పటివరకు బీసీ శాఖకు వచ్చిన 9 లక్షల దరఖాస్తులకు మంగళం పాడినట్లయింది. 2014-15లో స్వయం ఉపాధి రుణాల కోసం 3.6 లక్షల దరఖాస్తులు రాగా.. 2018 నాటికి కేవలం 40 వేల మందికి రూ.50 వేల చొప్పున మాత్రమే ప్రభుత్వం సాయాన్ని అందించింది. ఆ తరువాత మళ్లీ ఇప్పటివరకు ఉపాధి రుణాల ఊసే ఎత్తలేదు. 2018 ఎన్నికల తర్వాత కూడా రుణాల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. పాతవి, కొత్తవి అన్నీ కలిపి 9 లక్షల దాకా దరఖాస్తులు ఉంటాయని అంచనా. వాటి సంగతి తేల్చకుండానే ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు కుల వృత్తులకు రూ.లక్ష సాయం అంటూ కొత్త పథకాన్ని ప్రకటించి.. కొత్తగా దరఖాస్తు చేసుకోమనడంపై బీసీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా.. కుల వృత్తులకు రూ.లక్ష సాయం పథకం విధివిధానాలపై పథకం కోసం ఏర్పడిన కేబినేట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలేమిటో ఇంతవరకూ వెల్లడించలేదు. దరఖాస్తు తేదీ, అమలు తేదీ, అర్హత వివరాలను మాత్రమే జీవోలో తెలపడం గమనార్హం. అలాగే, ఎంతమందికి ఈ పథకాన్ని అందించనున్నారు, పథకం అమలుకోసం ఎన్ని నిధులు వెచ్చించనున్నారనే అంశాలను ఇప్పటివరకు కేబినేట్ సబ్ కమిటీ వెల్లడించకపోవడం గమనార్హం.
జూన 20 వరకే..
కొత్త పథకానికి దరఖాస్తులను మంగళవారం నుంచి జూన 20 వరకే వెబ్‌సైట్ ద్వారా స్వీకరించనున్నారు. అంటే కేవలం 15 రోజులు. లక్షల మందితో ముడిపడి ఉన్న ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఇంత తక్కువ సమయం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు కూడా ఈ కాస్త సమయంలో రావని ఆశావహులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఉదాహరణకు.. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు పూర్తి వివరాలతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ‘మీ సేవ’ ద్వారా తీసుకునే ఈ రెండు పత్రాలపై ఉన్న నంబరును కూడా దరఖాస్తులో పొందుపరచాలని పేర్కొన్నారు. ‘మీసేవ’ ద్వారా ఈ రెండు పత్రాలను పొందేందుకే చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆదాయ ధ్రువీకరణ పత్రం రావడానికి వారం రోజుల సమయం.. కుల ధ్రువీకరణ పత్రానికి దాదాపు నెలరోజులు పడుతోంది. కనుక కేబినేట్ సబ్ కమిటీ ఈ అంశాలపై పునఃపరిశీలన చేసి దరఖాస్తు గడువును పొడిగించాలని కోరుతున్నారు. కాగా.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన 9న మంచిర్యాల జిల్లాలో ప్రారంభంకానున్న ఈ పథకాన్ని ఒకేసారి కాకుండా విడతల వారీగా అమలుచేయాలని సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూ నిధుల సర్దుబాటు మేరకు పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో భాగంగా మొదటి విడత కోసం రూ.200 కోట్లను బీసీ శాఖకు కేటాయించాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా తెరపైకి తీసుకొచ్చిన కొత్త పథకాన్ని విడతల వారీగా అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో.. ఈ పథకమైనా అందరికీ అందుతుందో లేదోనని కులవృత్తుల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిదేళ్లలో బీసీలకు చేసిన ఖర్చు రూ.2,139 కోట్లే
అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ ద్వారా బీసీలకు వివిధ కేటగిరీల్లో ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించిన సర్కారు ఆమేరకు నిధులను కేటాయించలేదు. గత తొమ్మిదేళ్లలో కేటాయించింది కేవలం రూ.2,139 కోట్లు మాత్రమే. 80 శాతం సబ్సీడితో హెయిర్ సెలూన్‌లు, వాషింగ్ మెషిన్లు, స్వయం ఉపాధి యూనిట్లు, టెంట్ హౌస్, ఫ్యాన్సీ స్టోర్లు, ఆటో ట్రాలీలను అందించాలని, 100 శాతం రాయితీతో కూరగాయలు, పండ్ల విక్రయం, టైలరింగ్ తదితరాలకు రూ.50 వేలను అందజేయాలని, 60 శాతం రాయితీతో ట్రాక్టర్, కారు, తదితరాలకురూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అందివ్వాలని నిర్ణయించినా అమలుకు నోచుకోలేదు. ఈ పథకాల కోసం 2017-18, 2018-19 బడ్జెట్‌లో ఏడాదికి రూ.1000 కోట్లు చొప్పున కేటాయింపులు చేసినా.. రూ.351.50 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. 2019-20 లో రూ.5 కోట్లు, 2020-21 నుంచి 2022-23 వరకు రూ.1,300 కోట్లను కేటాయించినా.. ఈ నాలుగేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. 2014-15 నుంచి 2018-19 వరకు సమాఖ్యలకు రూ.448 కోట్లను విడుదల చేయగా, ఇందులో కేవలం రూ.230 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు. ఇక 2019-20 నుంచి ఫెడరేషన్లనకు సర్కారు ఒక్క రూపాయి కేటాయించలేదు.
పథకం వివరాలు.. నిబంధనలు
కుల వృత్తులకు రూ.లక్ష సాయం పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే.. 2023 జూన 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వయసు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలవారైతే వార్షిక ఆదాయం రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల్లోపు ఉండాలి. గతంలో లబ్ధి పొందిన వారు అనర్హులు. దరఖాస్తులను జూన 6 నుంచి 20 వరకు స్వీకరిస్తారు. దరఖాస్తులను ఎంపీడీవోలు, మునిసిపల్ కమిషనర్లు పరిశీలిస్తారు. వెరిఫికేషన జూన 20 నుంచి 26వరకు ఉంటుంది. ఎంపికను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పూర్తి చేస్తుంది. మంజూరు కోసం జూన 27 నుంచి జూలై 4 వరకు కలెక్టర్ మంత్రి ఆమోదం తీసుకుంటారు. ఎంపికైన వారి వివరాలను వెబ్‌సైట్‌తో పాటు, మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు. పథకాన్ని జూన 9న సీఎం ప్రారంభించిన తరువాత.. ప్రతి నెలా 15లోపు లబ్ధిదారులకు సాయాన్ని అందిస్తారు. పరికరాలు, పనిముట్ల కొనుగోలు నిర్ణయం పూర్తిగా లబ్ధిదారులదే. లబ్ధిదారులు ఏర్పాటుచేసుకున్న యూనిట్లను కలెక్టర్ నియమించిన అధికారి నెల రోజుల్లో పరిశీలించి, సంబంధిత యూనిట్ ఫొటోలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. ఏర్పాటైన యూనిట్లను రెండేళ్ల పాటు ఒక స్పెషల్ అధికారి ప్రతి మూడు నెలలకొకసారి వెళ్లి పరిశీలిస్తారు.