Tamilisai: ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ..

ABN , First Publish Date - 2023-08-06T13:33:24+05:30 IST

హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, ఆర్ఎంలు హాజరయ్యారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు.

Tamilisai: ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్ భేటీ..

హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC) విలీనంపై గవర్నర్ తమిళిసై (Governor Taminisai) రాజ్‌భవన్‌ (Raj Bhavan)లో ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్ (Munishekhar), ఆర్ఎం (RM)లు హాజరయ్యారు. ఆర్టీసీ అప్పులు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. విలీనం పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ (PRC), డిఏ (DA), సీపీఎస్ (CPS) బకాయిల వివరాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. కాగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ (Sajjanar) తిరుమలలో ఉండడంతో సమావేశానికి రాలేకపోయారు.

ఆర్టీసీ విలీన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఏమన్నరంటే.. ఈ బిల్లుపై తనకు కొన్ని విషయాలపై క్లారిటీ కావాలని, అందుకే ఆదివారం ఆర్టీసీ ఉన్నతాధికారులను తన వద్దకు పిలిపించుకున్నానని, బిల్లుపై సమగ్ర రిపోర్ట్ తీసుకుంటానని స్పష్టం చేశారు. కాగా ఈరోజుతో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి.

కాగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై పీటముడి పడింది. వెంటనే ఆమోదించడం లేదని సర్కారు ఆరోపిస్తుండగా.. ఉద్యోగుల కోసమే కొన్ని అంశాల్లో స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నానని గవర్నర్‌ తమిళిసై పేర్కొన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్‌ అలాగే ఉంటుందని, ఉద్యోగులు మాత్రమే విలీనం అవుతారని బిల్లులో ప్రభుత్వం చెబితే.. సంస్థ ఆస్తుల సంగతేమిటని గవర్నర్‌ ప్రశ్నించారు. మరి కేంద్ర ప్రభుత్వం వాటా 30 శాతం ఉంది కదా? వారి అనుమతి తీసుకున్నారా? అని ఆరా తీశారు. విలీనం తర్వాత శాశ్వత ఉద్యోగులు ఎంత మంది? కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ వారు ఎందరుంటారు? అంటూ గవర్నర్‌ మరో కీలక విషయాన్ని ప్రస్తావించారు. ఆర్టీసీలో కంటే.. మరింత ప్రయోజనాలు కల్పిస్తామని, రిటైర్మెంట్‌ ప్రయోజనాలపై పూర్తిగా చర్చించి నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రభుత్వం వివరించింది. ఆమె 6 ప్రశ్నలు అడగ్గా ప్రభుత్వం సమాధానాలు పంపింది. వెరసి.. ఈ బిల్లు గవర్నర్‌- రాష్ట్ర ప్రభుత్వం నడుమ వాదోపవాదాలకు కేంద్రంగా మారింది. రెండు రోజులుగా జరుగుతున్న ఈ సమాచార మార్పిడి ఆసక్తికరంగా మారింది. ఈ మధ్యలో ఆర్టీసీ యూనియన్‌ నేత ఒకరు.. ‘‘బస్సుల బంద్‌తో మాకు సంబంధం లేదు. ప్రభుత్వం బెదిరించి చేయించింది. ధర్నా వెనుక ఎమ్మెల్యేలు, మంత్రి ఉన్నారు. రాజ్‌భవన్‌ ముట్టడికి ఒత్తిడి తెచ్చారు. మహిళా ఉద్యోగులనూ వదిలిపెట్టలేదు’’ అంటూ గవర్నర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పారని రాజ్‌భవన్‌ తెలిపింది. ఆర్టీసీ బిల్లును ఈ నెల 2న ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు పంపింది. దానిని పరిశీలించిన గవర్నర్‌ శుక్ర, శనివారాల్లో రెండు దఫాలుగా ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.

Updated Date - 2023-08-06T13:33:24+05:30 IST