111 Go : 111 జీవో ఏరియాలో జీవో 168 రూల్స్!
ABN , First Publish Date - 2023-05-23T02:53:40+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసిన నేపథ్యంలో దాని పరిధిలోని ఏరియాలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులన్నింటినీ ఇక జీవో 168 ప్రకారం జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నట్లుగానే
లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులు
ప్రత్యేకమైన నిబంధనలంటూ ఉండవు
గ్రీన్‌సిటీ పాలసీ ఆ ప్రాంతంలో లేనట్లే?
పక్కాగా అమలుకు సర్కారు ప్రణాళిక
ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు
హైదరాబాద్ సిటీ, మే 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసిన నేపథ్యంలో దాని పరిధిలోని ఏరియాలో భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులన్నింటినీ ఇక జీవో 168 ప్రకారం జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. 111 జీవో ఏరియాలో అనుమతులకు ప్రత్యేక నిబంధనలేమీ ఉండవని సమాచారం. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లన్నింటిపరిధిలో జీవో 168 ప్రకారమే భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు ఇస్తున్నారు. ఇక 111 జీవో ఏరియా పరిధిలోని 84 గ్రామాల్లోనూ భవన నిర్మాణాల అనుమతులకు దానినే వర్తింపజేయనున్నారు. దీంతో ఈ ప్రాంతంలో భవనాల ఎత్తుతోపాటు సెట్‌బ్యాక్ వంటి వాటిపై ఎలాంటి మార్పులు ఉండవు. హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతులకు ఎలాంటి నిబంధనలు వర్తిస్తున్నాయో.. పూర్తిగా 111 జీవో ఏరియాలో కూడా అవే వర్తించేవిధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. కాగా, భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులపై ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఏప్రిల్ 7న అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించి జీవో నెం.168ను జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాకా అదే జీవోను అమలు చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల విజ్ఞప్తుల ఆధారంగా ఈ జీవోకు సవరణలు చేస్తున్నారు. నదుల వెంట బఫర్‌జోన్ గతంలో 100 మీటర్ల వరకు ఉండగా, దానిని 50 మీటర్లకు కుదించారు. చెరువులు, కుంటల వెంట బఫర్‌జోన్ 30 మీటర్లు ఉంటే అందులో 12 అడుగుల వరకు సైకిల్ ట్రాక్ గానీ, వాకింగ్ ట్రాక్ గానీ నిర్మించుకోవడానికి అవకాశం కల్పిస్తూ, భవనాల చార్జీలను సవరిస్తూ 2016లో జీవో 7ను జారీ చేశారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణానికి గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మొదటి, రెండవ అంతస్తులను మాత్రమే తనఖా పెట్టేందుకు అవకాశం ఉండగా.. ఏ అంతస్తునైనా తనఖా పెట్టేందుకు అవకాశం కల్పించారు. అంతే కాకుండా.. లేఅవుట్లకు అప్రోచ్ రోడ్డు 100 అడుగులు చేశారు.

పెద్ద ఎత్తున ఫాంహౌస్‌లు..
111 జీవో ఏరియా ఇప్పటి వరకు ఆంక్షలతో కొనసాగింది. కేవలం 10 శాతం వరకు మాత్రమే వినియోగించడానికి అవకాశం ఉండేది. 90 శాతం మేర పూర్తిగా వ్యవసాయానికే వినియోగించాల్సి ఉండేది. దాంతో ఆ ఏరియా పరిధిలో పెద్దఎత్తున ఫాంహౌస్‌లు వెలిశాయి. ఐటీ కారిడార్‌ను ఆనుకొని ఉన్న 84 గ్రామాల్లో 1.32 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉండడం, ఇతర ప్రాంతాలతో పోలిస్తే ధరలు తక్కువగా ఉండడంతో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ పార్టీల నేతలు ఇక్కడ పెద్దఎత్తున భూములు కొనుగోలు చేశారు. మొయినాబాద్, శంషాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి ప్రాంతాల్లో ఫాంహౌస్‌లతోపాటు రిసార్టులు, వివిధ గేమ్ జోన్లు వెలిశాయి. జంట జలాశయాల సంరక్షణలో భాగంగా అమలు చేసిన ఆంక్షలన్నింటినీ ఇకపై తొలగిస్తున్నా.. ఆ ప్రాంతంలో ప్రత్యేక నిబంధనలంటూ ఏమీ ఉండవు. విదేశాల్లో, ఢిల్లీలో కూడా గ్రీన్ సిటీ పాలసీ అమలు చేస్తుండగా.. 111 జీవో ఏరియాలో మాత్రం అలాంటిదేదీ తీసుకురావడం లేదు. 84 గ్రామాల పరిధిలో ప్రణాళికా బద్ధమైన పచ్చని పట్టణాభివృద్ధి కోసం గ్రీన్ సిటీ పాలసీ అమలు చేస్తారని కొంతమంది అధికారులు, రియల్ ఎస్టేట్ వర్గాలు భావించాయి. కానీ, అందుకు భిన్నంగా జీవో 168 రూల్సే అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
ఇకపై వ్యవసాయ కన్జర్వేషన్ జోన్..
84 గ్రామాల్లో బయో కన్జర్వేషన్ జోన్ తొలగించడంతో.. ఆ ప్రాంతమంతా ఇకపై వ్యవసాయ కన్జర్వేషన్ జోన్‌లో కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఎవరైనా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ (సీఎల్‌యూ) అనుమతులు రాగానే భవన నిర్మాణ అనుమతుల కోసం గానీ, లేఅవుట్ అనుమతుల కోసం గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి జీవో 168 ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు ఇస్తారు. భవనాల ఎత్తుపైనా ఎలాంటి ఆంక్షలు ఉండవు. అయితే అక్కడి ప్రాంతం ఆధారంగా ఎయిర్‌పోర్టు అథారిటీ క్లియరెన్స్ ప్రకారమే అనుమతులు ఇస్తారు. 111 జీవో ఏరియాలో శంషాబాద్ కూడా ఉండడంతో ఈ ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు 18 మీటర్లకు మించితే ఎయిర్‌పోర్టు అథారిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీ కారిడార్‌లో ప్రస్తుతమున్న వంద అడుగుల రోడ్లు, లేఅవుట్‌లో ఉన్న 30 అడుగులు, 40 అడుగుల రోడ్లు వాహనాల రద్దీకి సరిపోవడం లేదు. ఈ పరిస్థితుల్లో హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో రోడ్లన్నీ వంద అడుగులు ఉండగా, 111 ఏరియాలో వంద అడుగులే ఉంటుందా? లేదంటే 200 అడుగులకు పెంచుతారా? అన్నది తేలాల్సి ఉంది.
మార్గదర్శకాల విడుదల ఎప్పుడు?
111 జీవో ఏరియా పరిధిలో అమలయ్యే నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాల విడుదల ఎప్పుడన్నది ప్రభుత్వం వెల్లడించడంలేదు. వీటి కోసం 84 గ్రామాల ప్రజలతోపాటు రియల్టర్లు, డెవలపర్లు, పర్యావరణవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 111 జీవోను తొలగిస్తూ జీవో 69ను జారీ చేసిన సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని సర్కారు ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలు సూచనలు చేస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఆ మేరకే మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువడుతాయని భావించినా.. అధికార వర్గాలు ఎటువంటి స్పష్టతనివ్వడంలేదు.