పంచాయతీల ఖాతాల్లోకే నిధులు

ABN , First Publish Date - 2023-02-07T04:40:16+05:30 IST

నిధులున్నా వాడుకోలేని దుస్థితి.. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాకపోవడం, చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడం..

పంచాయతీల ఖాతాల్లోకే నిధులు

స్వతంత్రంగా వినియోగించుకునే చాన్స్‌

తాజా బడ్జెట్‌లో సర్పంచ్‌లకు శుభవార్త

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): నిధులున్నా వాడుకోలేని దుస్థితి.. సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రాకపోవడం, చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడం.. వంటి పరిణామాలతో సర్పంచ్‌లు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కోకొల్లలు. తాజా బడ్జెట్‌లో సర్పంచులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సర్పంచ్‌లు స్వతంత్రంగా నిధులు వాడుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ మేరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వం విడుదల చేసే పల్లె ప్రగతి నిధులు నేరుగా పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. అంతే కాకుండా.. గ్రామాల్లో తాత్కాలిక మరమ్మతులు, ఇతరత్రా పనుల కోసం ప్రత్యేకంగా రూ.2వేల కోట్లు కేటాయించింది. ఈ సారి పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.31,426కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి రూ.2వేల కోట్లు అదనంగా పెరిగాయి. ఇందులో ఆసరా పింఛన్‌ పథకం అమలుకు రూ.12వేల కోట్లు కేటాయించింది. గత ఏడాది పల్లె ప్రగతికి రూ.3,330 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈ సారి రూ.3,360కోట్లు ప్రతిపాదించింది. రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు రూ. 2,587 కోట్లు, మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.1600కోట్లు, పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.300కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది.

Updated Date - 2023-02-07T04:40:16+05:30 IST