రేపట్నుంచే ఇంధన సర్దు‘పోటు’!

ABN , First Publish Date - 2023-03-31T03:15:11+05:30 IST

రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీలు అమల్లోకి రానున్నాయి.

రేపట్నుంచే ఇంధన సర్దు‘పోటు’!

యూనిట్‌కు 30 పైసలకు మించకుండా చార్జీలు

ఏప్రిల్‌ 1 నుంచి అమలు.. జూలై బిల్లులో మోత!

నియంత్రించడానికి వీల్లేని కారణాలతో అదనపు..

వ్యయమైతే వినియోగదారులకు సర్దుబాటు

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంధన సర్దుబాటు చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ చార్జీల పేరిట నెలనెలా డిస్కమ్‌లు వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి (టీఎ్‌సఈఆర్‌సీ) ఇప్పటికే అనుమతినిచ్చింది. ఈ నిర్ణయం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి అమల్లోకి రానుంది. ప్రతి నెలా వినియోగదారుల నుంచి యూనిట్‌కు 30 పైసలు మించకుండా సర్దుబాటు చార్జీలు వసూలు చేసుకోవడానికి ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. అయితే చార్జీల వసూలుకు నియంత్రించడానికి వీల్లేని కారణాలను చూపాల్సి ఉంటుంది. అత్యవసర సమయంలో డిమాండ్‌కు తగ్గట్లుగా స్వల్పకాలిక ఒప్పందాలు లేదా బహిరంగ విపణిలో కరెంట్‌ కొనుగోళ్లకు అయ్యే వ్యయాన్ని వెంటనే రాబట్టుకోవడానికి డిస్కమ్‌లకు వీలు కలగనుంది. ఉదాహరణకు ఏప్రిల్‌లో అదనంగా (నియంత్రించడానికి వీల్లేని కారణాలతో) రూ.100 కోట్లు ఖర్చయితే మేలో లెక్కలు తీసి.. జూన్‌ నెల వినియోగంలో కలిపి (జూలై తొలివారంలో జారీ చేసే బిల్లులో) చూపించి.. వసూలు చేసుకోనున్నారు. దీనికోసం ప్రస్తుతం డిస్కమ్‌లు ఏడాది పాటు వేచిచూడాల్సి వచ్చేది. ఈఆర్‌సీ ఆమోదించిన వ్యయం కన్నా అయిన వాస్తవిక వ్యయం (ట్రూ-అప్‌) పిటిషన్లు దాఖలు చేసి, తగిన అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. దాంతో వినియోగదారుల నుంచి వాస్తవిక వ్యయం రాబట్టుకోవాలని, ఏ నెలలో అయ్యే అధిక వ్యయాన్ని ఆ మరుసటి నెలలోనే వసూలు చేసుకోవడానికి డిస్కమ్‌లకు వీలు కల్పించాలని 2021 అక్టోబరు 22న కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశాలు జారీ చేసింది. దాన్ని అనుసరించి ఈఆర్‌సీ నియమాల్లో మార్పులు చేసింది. దీని ప్రకారం ఇంధన సర్‌చార్జి సర్దుబాటు ఫార్మూలాను అనుసరించి చార్జీలు వసూలు చేసుకోవచ్చు. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కలను ఈఆర్‌సీకి సమర్పించాల్సి ఉంటుంది. ఏడాది ముగిసిన తర్వాత లెక్కలను కూడా ఈఆర్‌సీకి అందించాలి. అంతేగాక నియంత్రించడానికి వీల్లేని కారణాలతో ఏ మేరకు భారం పడిందో డిస్కమ్‌లు తమ అధికారిక వెబ్‌సైట్లలో ప్రతి నెలా 15వతేదీన వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. దీంతో ఏప్రిల్‌లో అధిక ధరలతో కరెంట్‌ కొనుగోలు చేస్తే.. వినియోగదారుల నుంచి సర్దుబాటు చార్జీల పేరిట జూలై బిల్లుల ద్వారా వసూలు చేసుకోనున్నారు.

Updated Date - 2023-03-31T03:15:11+05:30 IST