లీక్‌లో మరో నలుగురు!

ABN , First Publish Date - 2023-03-26T01:50:03+05:30 IST

టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.

లీక్‌లో మరో నలుగురు!

ఇప్పటికే సిట్‌ అదుపులో ఈజీఎస్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ ప్రశాంత్‌

నవాబుపేట, షాద్‌నగర్‌కు చెందిన ముగ్గురు యువకుల విచారణ!

అరెస్టుకు రంగం సిద్ధం.. ప్రధాన నిందితులకు మరో 3 రోజుల కస్టడీ

ఉద్యోగుల కస్టడీ పిటిషన్‌పై నిర్ణయం రేపటికి వాయిదా

విచారణకు హాజరుకండి.. సంజయ్‌కు సిట్‌ మళ్లీ నోటీసులు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. సిట్‌ అరెస్టు చేసిన నిందితులను విచారిస్తుండడంతో అక్రమాల డొంక కదులుతోంది. ఇప్పటికే 12 మందిని కటకటాల్లోకి పంపిన సిట్‌ అధికారులు తాజాగా మరో నలుగురు అక్రమార్కులను గుర్తించినట్లు తెలిసింది. ఏఈ ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన పాత్ర పోషించిన వారి నుంచి ఈ నలుగురు ఆ పేపర్‌ను పొందినట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకం విభాగంలో ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న ప్రశాంత్‌.. లీకైన ప్రశ్నపత్రాన్ని సంపాదించి ఈనెల 5న జరిగిన ఏఈ పరీక్ష రాసినట్లుగా సిట్‌ గుర్తించినట్లు తెలిసింది. ఈ మేరకు నవాబ్‌పేటలో ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకున్న సిట్‌ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకూ అతణ్ని విచారించారు. ఈ క్రమంలో ప్రశాంత్‌ నుంచి అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు ప్రశ్నపత్రాన్ని పొంది ఏఈ పరీక్ష రాసినట్లు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో అతణ్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు.. షాద్‌నగర్‌కు చెందిన మరో ఇద్దరు యువకులు కూడా ఏఈ పరీక్ష రాసినట్లు గుర్తించారు. వెంటనే వారిని సైతం అదుపులోకి తీసుకొని.. మొత్తం నలుగురిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. నేడో రేపో వారిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాల్‌డేటా ఆధారంగా ప్రశాంత్‌ పేరు..

ప్రశ్నపత్రాల లీకేజీలో ప్రధాన నిందితులైన రేణుక, ఢాక్యానాయక్‌, ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించిన సిట్‌ అధికారులు.. మరోవైపు వారి కాల్‌డేటాపైనా దృష్టి సారించారు. కాల్‌డేటా ఆధారంగా ఏఈ పరీక్ష సమయంలో రేణుక, ఢాక్యానాయక్‌తో టచ్‌లో ఉండి, పరీక్ష రాసిన వారిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్‌ పేరు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. విచారణలో ఢాక్యానాయక్‌, ప్రశాంత్‌ ఇద్దరూ ఒకే డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్నట్లు తేలింది. ఢాక్యానాయక్‌ డీఆర్‌డీఏ వికారాబాద్‌ కార్యాలయంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తుండగా, ప్రశాంత్‌.. నవాబ్‌పేట మండల కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో ఈసీ (ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌)గా పనిచేస్తున్నట్లు సిట్‌ అధికారులు తేల్చారు. ఉపాధి హామీ పథకం విభాగం డీఆర్‌డీఏ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. అయితే ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారు కావడం, ఒకే డిపార్టుమెంట్‌లో పనిచేస్తుండడంతో ఢాక్యానాయక్‌తో ప్రశాంత్‌కు మంచి సంబంధాలున్నట్లుగా తేలినట్లు సమాచారం.

ప్రధాన నిందితులకు 3 రోజుల కస్టడీ..

పేపర్‌ లీకేజీలో ప్రదాన పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్న నలుగురు ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి, ఽఢాక్యానాయక్‌, రాజేశ్వర్‌ను మరోసారి పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని సిట్‌ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల పిటిషన్‌ను శనివారం విచారించిన న్యాయస్థానం మరో 3 రోజులు కస్టడీకి అనుమతించింది. ఇప్పటికే వారిని మొదటి విడత 6 రోజులు కస్టడీకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని పొంది ఎగ్జామ్‌లో అధిక మార్కులు సంపాదించినట్లు తేలిన ఇద్దరు టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులు షమీమ్‌, రమేశ్‌ను, మాజీ ఉద్యోగి సురే్‌షను సిట్‌ అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. వారిని లోతుగా విచారించి మరింత సమాచారం రాబట్టడానికి వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని సిట్‌ కస్టడీ పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

అంగడి సరుకులా ప్రశ్నపత్రాల విక్రయం?

టీఎ్‌సపీఎస్సీలో పనిచేస్తున్న ప్రవీణ్‌కుమార్‌తో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకొని రేణుక, ఆమె భర్త ఽఢాక్యానాయక్‌, తమ్ముడు రాజేశ్వర్‌లు భారీ స్థాయిలోనే పబ్లిక్‌ పరీక్షల ప్రశ్నపత్రాల కుంభకోణానికి పాల్పడినట్లు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. రూ.10 లక్షలకు ప్రవీణ్‌తో బేరం కుదుర్చుకొని ఏఈ ప్రశ్నపత్రాలను కొనుగోలు చేసిన నిందితులు.. వాటిని అంగట్లో సరుకులా అడ్డగోలుగా విక్రయించినట్లు తెలుస్తోంది. వీటి విక్రయంలో ఢాక్యానాయక్‌, అతని బావమరిది కేతావత్‌ రాజేశ్వర్‌ కీలక పాత్ర పోషించినట్లు సిట్‌ అధికారులకు ఆధారాలు లభించాయి. నీలేశ్‌నాయక్‌, గోపాల్‌ నాయక్‌కు రూ.14.50 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు.. తాజాగా నవాబ్‌పేటకు చెందిన ప్రశాంత్‌రెడ్డికి, అతని ద్వారా మరో ముగ్గురికి రూ.7.50 లక్షలకు విక్రయించినట్లు గుర్తించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు బయట పడుతుండడంతో పదుల సంఖ్యలో ఏఈ పేపర్‌ చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. వారందరి వివరాలు తెలుసుకునే పనిలో సిట్‌ అధికారులు నిమగ్నమయ్యారు.

ఇద్దరి పేర్లు ఒక్కటే కావడంతో కన్ఫ్యూజన్‌..

ప్రశ్నపత్రాల లీకేజీలో ఏ2 నిందితుడిగా ఉన్న రాజశేఖర్‌రెడ్డి బావ పేరు ప్రశాంత్‌రెడ్డి కావడం, తాజాగా నవాబ్‌పేటకు చెందిన మరో ప్రశాంత్‌ పేరు తెరపైకి రావడంతో కొంత కన్ఫ్యూజన్‌ నెలకొంది. న్యూజిలాండ్‌లో ఉంటున్న ప్రశాంత్‌రెడ్డికి రాజశేఖర్‌రెడ్డి గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని వాట్సా్‌పలో పంపినట్లు, ఈ మేరకు అతడు ఇక్కడికి వచ్చి గ్రూప్‌-1 పరీక్ష రాసి, తిరిగి న్యూజిలాండ్‌ వెళ్లినట్లు సిట్‌ నిగ్గు తేల్చిన విషయం తెలిసిందే. కాగా, శుక్రవారం రాత్రి నవాబ్‌పేటలో ప్రశాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలియడంతో ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌రెడ్డి సిట్‌ అధికారులకు పట్టుబడ్డాడనే వార్తలు వచ్చాయి. ఈ విషయమై శనివారం సిట్‌ అధికారులను సంప్రదించగా ఇద్దరూ వేర్వేరు వ్యక్తులని తెలిపారు. ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌రెడ్డి గ్రూప్‌-1 పరీక్ష రాయగా, నవాబ్‌పేట ప్రశాంత్‌ ఏఈ పరీక్ష రాశాడని వెల్లడించారు.

Updated Date - 2023-03-26T01:50:03+05:30 IST