ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటు

ABN , First Publish Date - 2023-03-26T02:24:37+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిని ఎవరు ప్రశ్నించినా వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసి లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

ప్రశ్నించినందుకే రాహుల్‌పై వేటు

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, శంషాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, అవినీతిని ఎవరు ప్రశ్నించినా వారిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దాడులు చేసి లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు భారత్‌ జోడో యాత్ర చేసి కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను, అవినీతిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం బీజేపీ నాయకులకు కంటగింపయిందన్నారు. కర్నాటక నుంచి ఢిల్లీ వెళుతున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను శనివారం శంషాబాద్‌ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సహా పార్టీ ముఖ్యనాయకులు కలిశారు. ఖర్గే వెంట కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కూడా ఉన్నారు. సుమారు గంట పాటు విమానాశ్రయం లాంజ్‌లో గడిపిన ఖర్గే.. రాష్ట్రంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ యాత్రలు జరుగుతున్న తీరును నాయకులను అడిగి తెలుసుకున్నారు. రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు నేపథ్యంలో బీజేపీ నియంత పాలన, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న తీరుపై క్షేత్రస్థాయి పోరాటాలు ఉధృతం చేయాలని నేతలకు ఖర్గే సూచించారు. గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో పార్టీ చేపట్టిన కార్యక్రమాలను ఖర్గేకు రేవంత్‌ వివరించారు. అనంతరం రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ రూ.లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అదానీ సంస్థలకు మోదీ ఎలా దోచి పెట్టారో రాహుల్‌ గాంధీ ప్రజలకు వివరించారన్నారు. దీనిపై ప్రశ్నించినందుకే కేంద్ర పాలకులు ఆయనపై పగపట్టి లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు. ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్‌ గాంఽధీ చేస్తున్న పోరాటానికి యావత్తు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఖర్గేను కలిసిన ముఖ్యనేతల్లో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్య, ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు హర్కార వేణుగోపాల్‌ తదితరులు ఉన్నారు.

గాంధీభవన్‌లో నేడు టీపీసీసీ దీక్ష

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దును నిరసిస్తూ ఆదివారం గాంధీభవన్‌లో గాంధీ విగ్రహం ముందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్‌ నేత, కార్యకర్త పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాహుల్‌పై అనర్హత వేటు నేపథ్యంలో కార్యాచరణపై చర్చించేందుకు టీపీసీసీ ముఖ్యనేతల సమావేశం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. ఇందులో రేవంత్‌తో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, ముఖ్య నాయకులు సంపత్‌ కుమార్‌, అంజన్‌ కుమార్‌ యాదవ్‌, అజారుద్దీన్‌, పొన్నాల లక్ష్మయ్య, వి. హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, కుసుమ కుమార్‌, టీపీసీసీ ఉపాధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ పై మోదీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. భారత్‌ జోడో యాత్రతో దేశ ప్రజలతో రాహుల్‌గాంధీ మమేకం కావడం, అదానీ అక్రమాలపై పార్లమెంటులో ఆయన గట్టిగా నిలదీయడాన్ని మోదీ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందన్నారు. అందుకే ఇలాంటి చర్యకు పాల్పడిందన్నారు. సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మధుయాష్కీగౌడ్‌ మాట్లాడుతూ రాహుల్‌ లోక్‌సభ సభ్యత్వం రద్దు నేపథ్యంలో దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఆదివారం గాంధీభవన్‌లో దీక్ష నిర్వహించాలని ముఖ్యనేతల సమావేశంలో నిర్ణయించామన్నారు. రాహుల్‌గాంధీపై పార్లమెంటులో బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తే.. కనీసం వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా స్పీకర్‌ ఇవ్వలేదన్నారు. అనర్హత వేటు అప్రజాస్వామికమన్నారు. వీహెచ్‌ మాట్లాడుతూ ఉరిశిక్ష పడిన వారికి కూడా ఆఖరు కోరికేంటని అడుగుతారని, రాహుల్‌కు ఆ అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-26T02:24:37+05:30 IST