ఫాంట్స్ రూపశిల్పి శ్రీకంఠం శ్రీధర మూర్తి ఇకలేరు!
ABN , First Publish Date - 2023-03-21T03:29:47+05:30 IST
ప్రముఖ టైపోగ్రఫీ ఆర్టిస్టు (ఫాంట్స్ రూపశిల్పి) శ్రీకంఠం శ్రీధర మూర్తి (60) కన్నుమూశారు.
స్వగృహంలో కార్డియాక్ అరెస్టుతో హఠాన్మరణం
‘ఆంధ్రజ్యోతి’ సహా అన్ని తెలుగు పత్రికలకు ప్రత్యేక ఫాంట్స్ రూపొందించిన శ్రీధర మూర్తి
హైదరాబాద్ సిటీ, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ టైపోగ్రఫీ ఆర్టిస్టు (ఫాంట్స్ రూపశిల్పి) శ్రీకంఠం శ్రీధర మూర్తి (60) కన్నుమూశారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్‌లోని స్వగృహంలో కార్డియాక్ అరెస్టుతో శ్రీధర మూర్తి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు భార్య జ్యోతి కుమారి, కూతురు మధుమాల, కుమారుడు కార్తికేయ ఉన్నారు. శ్రీధర్ మూర్తి స్వస్థలం ఖమ్మం. ఆయన 1988లో హైదరాబాద్‌లోని జేఎన్టీయూ ఫైన్‌ఆర్ట్స్‌లో బీఎ్‌ఫఏ, బరోడా వర్సిటీలో ఎంఎ్‌ఫఏ గ్రాఫిక్స్ అభ్యసించారు. ‘ఆంధ్రజ్యోతి’తో పాటు తెలుగునాట అన్నీ పత్రికలు సహా కన్నడ, మలయాళ దిన పత్రికల్లోని కొన్నింటికి ప్రత్యేక ఫాంట్స్ రూపొందించారు. ఆయన మృతిపట్ల ఆచార్య జయధీర్ తిరుమల రావు సంతాపం వ్యక్తం చేశారు. కాలీగ్రఫీ, టైపోగ్రఫీల్లో శ్రీధర మూర్తిది అందెవేసిన చేయి అని అన్నారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయంలోని గిరిజన, ఆదివాసీ అధ్యయన అనువాద విభాగం ఆధ్వర్యంలో ఆదివాసీ గోండులిపి ఫాంట్లను శ్రీధర్ మూర్తి వెలుగులోకి తెచ్చారని యల్లపు కళాసాగర్ చెప్పారు. నిఫ్ట్, ఐఐటీ హైదరాబాద్, జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్ తదితర విద్యాలయాల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా శ్రీధర మూర్తి సేవలందించారు. ఐర్లాండ్‌లోని అసోసియేషన్ ఆఫ్ టైపోగ్రఫీ ఇంటర్నేషనల్ సదస్సులో లిపి ముద్రణ, ఫాంట్స్‌లో లోపాల కారణంగా భారతీయులు సొంత భాషకు ఎలా దూరం అవుతున్నారో విశ్లేషిస్తూ ప్రసంగించారు. ఉద్యోగ రీత్యా కుమారుడు కార్తికేయ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయన మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు రానున్నట్లు సమాచారం. ఆనంద్‌నగర్ కాలనీలోని స్వగృహంలో బంధుమిత్రుల సందర్శనార్థం మంగళవారం 11 గంటల వరకు శ్రీధర మూర్తి భౌతిక కాయాన్ని ఉంచనున్నారు. ఎర్రగడ్డ ఈఎ్‌సఐ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.