BRS ముఖ్య నాయకుల అనుచరుల ఘాతుకం

ABN , First Publish Date - 2023-01-27T10:57:54+05:30 IST

ఆర్డర్‌ ఇచ్చిన స్వీటును అరువు(ఉద్దెర)గా ఇవ్వనందుకు ఆ షాపు నిర్వాహకుడిపైనే

BRS ముఖ్య నాయకుల అనుచరుల ఘాతుకం

హైదరాబాద్/ ఏఎస్‎రావునగర్‌: ఆర్డర్‌ ఇచ్చిన స్వీటును అరువు(ఉద్దెర)గా ఇవ్వనందుకు ఆ షాపు నిర్వాహకుడిపైనే అధికారపార్టీ నాయకులు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కుషాయిగూడ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని చర్లపల్లిలో చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, బాధితులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మున్సిపాలిటీ శిల్పానగర్‌కు చెందిన సునీల్‌ కచ్వా చర్లపల్లి రైల్వేకాలనీలో కొంతకాలంగా ఓ స్వీట్‌ షాపు నిర్వహిస్తున్నాడు. పెద్దచర్లపల్లికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు కేవీఎల్‌ఎన్‌ రావు ఈనెల 24న మధ్యాహ్నం సునీల్‌ కచ్వాల్‌కు స్వీట్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. సాయంత్రం 7 గంటల సమయంలో సదరు నేత తన అనుచరులైన బీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం నాయకుడు ఎన్‌.వంశీరాజ్‌, మధు, అభిషేక్‌లతో కలిసి వచ్చి ఆర్డర్‌ ఇచ్చిన స్వీటు ఇవ్వాలని అడిగారు. డబ్బులు ఇచ్చి తీసుకువెళ్లమని స్వీటుషాపు నిర్వాహకుడు కోరారు. తాము లోకల్‌ అని, డబ్బులు తర్వాత ఇస్తాం.. స్వీట్‌ ఇవ్వాలని బెదిరించారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది.

ఇంతలో విషయం తెలుసుకున్న సునీల్‌కు వరుసకు సోదరుడయ్యే మహావీర్‌ కచ్వాల్‌(23) దుకాణం వద్దకు చేరుకున్నాడు. గతంలో కూడా ఇలానే పలుమార్లు స్వీటు, లడ్డూలు తీసుకువెళ్లి డబ్బులు ఇవ్వలేదని, ఇప్పుడు ఉద్దెర ఇవ్వలేమని మహావీర్‌ చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన బీఆర్‌ఎస్‌ నాయకులు మొదట దుకాణం సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అనంతరం మహావీర్‌ను రోడ్డుపైకి లాక్కెళ్లి దాడి చేశారు. దీంతో అతను తీవ్ర గాయాలతో స్పృహతప్పి పడిపోయాడు. అయినా అలానే దాడి చేయడంతో అరుపులు, కేకలు విన్న దుకాణం బిల్డింగ్‌ యజమాని వివేక్‌ వచ్చి అడ్డగించే ప్రయ త్నం చేశాడు. గతంలో మాదిరిగానే మరోసారి నీ బిల్డింగ్‌ కూల్చివేయిస్తామని అతడిని సైతం బెదిరించారు. ఈ లోగా సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా అప్పటికే నిందితులంతా పారిపోయారు.

పోలీసులు మహావీర్‌ కచ్వాల్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఈసీఐఎల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. కొందరు తీసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సునీల్‌ కచ్వాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీలు, వీడియోలు సేకరించామని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు. నిందితులపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అధికార పార్టీ నాయకులు కావడంతో సదరు బాధితులతో రాజీకి యత్నిస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2023-01-27T10:57:56+05:30 IST