ముందు బుజ్జగింపులు..ఆ తర్వాతే ఆత్మీయ భేటీలు

ABN , First Publish Date - 2023-03-31T03:34:48+05:30 IST

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ కార్యకర్తల్లోకి వెళ్లాలనుకున్న బీఆర్‌ఎ్‌సకు.. ఊహించని విధంగా వాటిల్లో అసంతృప్తి గళాలు వినిపిస్తుండడంతో ఈ సమస్యను అధిగమించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ముందు బుజ్జగింపులు..ఆ తర్వాతే ఆత్మీయ భేటీలు

పార్టీ శ్రేణుల్లో ఏకాభిప్రాయం కోసం కసరత్తులు

సమ్మేళనాలకు ఎమ్మెల్యేలు కుటుంబసమేతంగా

హాజరు కావాలని దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆత్మీయ సమ్మేళనాలతో పార్టీ కార్యకర్తల్లోకి వెళ్లాలనుకున్న బీఆర్‌ఎ్‌సకు.. ఊహించని విధంగా వాటిల్లో అసంతృప్తి గళాలు వినిపిస్తుండడంతో ఈ సమస్యను అధిగమించే దిశగా నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తి ఏమిటో తెలుసుకుని.. వారిని బుజ్జగించి.. సమస్యలన్నీ పరిష్కరించుకుని.. ఆ తర్వాతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలనే నిర్ణయానికి పార్టీ అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోనూ ఆత్మీయ సమ్మేళనాల ముగింపు గడువును ఏప్రిల్‌ 27 నుంచి మే నెలాఖరు దాకా పొడిగించింది. ఈ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు నిర్వహించుకోవచ్చని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడుకె.తారక రామారావు పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఇటీవలికాలంలో అనేక జిల్లాల్లో ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వాటిలో.. హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, వనపర్తి తదితర జిల్లాల్లో కార్యకర్తలు, కిందిస్థాయి నేతలు నిర్మొహమాటంగా తమ అసంతృప్తిని వెలిబుచ్చారు.

‘‘అధికారంలోకి వచ్చి పదేళ్లవుతున్నా.. పార్టీని నమ్ముకున్న కిందిస్థాయి నాయకులకు, కార్యకర్తలకు ఏం న్యాయం చేశారు. ఉద్యమ కాలం నుంచి జెండాలు మోశాం.. పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాం.. మమ్మల్ని పట్టించుకున్నారా. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే మళ్లీ గుర్తొచ్చామా!’’ అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేలపైన, ఇతర నేతలపైన ఫిర్యాదులు చేశారు దీనికితోడు.. కాంగ్రెస్‌, ఇతర పార్టీల్లో గెలిచి, ఆ తర్వాత బీఆర్‌ఎ్‌సలో చేరిన ప్రజాప్రతినిధులు.. ముందు నుంచి పార్టీకి సేవలందించిన తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ అసంతృప్తి జ్వాలలతో బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం అప్రమత్తమైంది. అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలను తొలుత బుజ్జగించి.. ఆ తర్వాతే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటే బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చింది. ఈ మేరకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఈ నెల 10న జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు దిశానిర్దేశం చేశారు. సమావేశాలను పటిష్ఠంగా నిర్వహించేందుకు అన్ని జిల్లాలకూ పార్టీ తరఫున ఇన్‌చార్జిలను నియమించారు. ఈ ప్రయత్నం పలు నియోజకవర్గాల్లో సత్ఫలితాలనిస్తోంది.

కుటుంబసమేతంగా..

ఆత్మీయ సమ్మేళనాలంటే ఏదో ఎమ్మెల్యే ఒక్కరే వెళ్తే కాదని...ఆయన తన కుటుంబంతో సహా వె ళ్లాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ఈ భేటీలను మొక్కుబడిగా కాక.. ఒకరి కష్టసుఖాలు మరొకరు తెలుసుకునేలా, ఒక కుటుంబ బంధం అందరి మధ్య ఉండేలా చేసే ఉద్దేశంతోనే ఆయన ఈ సూచన చేసినట్లు సమాచారం. ఈ బంధం బలపడితే ఎక్కడైనా అసంతృప్తులున్నా తగ్గుముఖం పడతాయని, కాబట్టి అటువంటి స్నేహపూరిత వాతావరణం కల్పించాలని ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న పార్టీ నేతలకు కూడా సూచించారు. స్థానిక విభేదాలను ఆత్మీయ సమావేశాల్లో ముందుకు తెచ్చి రసాభాస జరగకుండా చూడాలని కూడా ఆయన నిర్దేశించినట్లు తెలిసింది.

Updated Date - 2023-03-31T03:34:48+05:30 IST