శరవేగంగా ‘ఎయిర్‌పోర్టు మెట్రో’

ABN , First Publish Date - 2023-01-15T00:42:52+05:30 IST

ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన 31 కి.మీ. పనుల్లో భాగంగా అధికారులు ఎలివేటెడ్‌ మార్గాన్ని నిర్మించేందుకు సర్వే చేపడుతున్నారు.

శరవేగంగా ‘ఎయిర్‌పోర్టు మెట్రో’

జోరుగా సర్వే పనులు

ఇప్పటివరకు 21 కిలోమీటర్ల మేర సర్వే పూర్తి

హైదరాబాద్‌ సిటీ, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ (హెచ్‌ఏఎంఎల్‌) ఆధ్వర్యంలో చేపట్టిన 31 కి.మీ. పనుల్లో భాగంగా అధికారులు ఎలివేటెడ్‌ మార్గాన్ని నిర్మించేందుకు సర్వే చేపడుతున్నారు. జనరల్‌ కన్సల్టెంట్‌ (జీసీ) కోసం బిడ్ల సమర్పణకు ఈనెల 20 వరకు చివరి తేదీ ఉండగా, నిపుణులైన కన్సల్టెంట్లను వచ్చే నెల మొదటివారంలోగా నియమించనున్నారు. అప్పటిలోగా రాయదుర్గం రహేజా మైండ్‌స్పేస్‌ నుంచి శంషాబాద్‌ వరకు మెట్రో అలైన్‌మెంట్‌ను సరిదిద్దేందుకు, స్టేషన్ల స్థానాలను నిర్ణయించేందుకు సర్వే పనులు చేపడుతున్నారు. శాటిలైట్‌ ఆధారిత డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజీషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌), ఎలక్ర్టానిక్‌ టోటల్‌ స్టేషన్‌ పద్ధతులు ఉపయోగించి కచ్చితమైన కోఆర్డినేట్లను తెలుసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాంల సాయంతో సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు శంషాబాద్‌ పట్టణానికి సమీపంలోని ఫోర్ట్‌ గ్రాండ్‌ అండర్‌పాస్‌ వరకు 21 కిలోమీటర్ల మేరకు సర్వే పూర్తయిందని, ఈనెలాఖరులోగా మొత్తం పూర్తికానుందని హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ట్రాఫిక్‌ సర్వేలో స్థానిక ట్రాఫిక్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లను భాగస్వాములను చేయడంతో స్టేషన్‌ స్థానాలను సులభతరంగా గుర్తించే అవకాశం ఏర్పడిందని ఎండీ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-15T00:42:53+05:30 IST