ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత..నీలంరాజు కన్నుమూత

ABN , First Publish Date - 2023-03-09T03:49:04+05:30 IST

ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ (96) కన్నుమూశారు.

ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత..నీలంరాజు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టర్‌గా 1986లో పదవీ విరమణ

హైదరాబాద్‌ సిటీ, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ (96) కన్నుమూశారు. విజయనగర్‌ కాలనీలోని స్వగృహంలో మంగళవారం సాయంత్రం 7 గంటలకు ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లక్ష్మీప్రసాద్‌ తండ్రి నీలంరాజు వేంకట శేషయ్య.. టంగుటూరు ప్రకాశం పంతులు వ్యక్తిగత కార్యదర్శిగా, ఆంధ్రప్రభ ఎడిటర్‌గా సేవలందించారు. మద్రా్‌సలో ఎంఏ ఆర్థికశాస్త్రం అభ్యసించిన లక్ష్మీప్రసాద్‌.. ఉమ్మడి ఏపీ ఆర్థిక, గణాంక శాఖ డైరెక్టరుగా 1986లో పదవీ విరమణ చేశారు. జిడ్డు కృష్ణమూర్తిని పలు సందర్భాల్లో కలిసి పత్రికా ఇంటర్వ్యూలు చేసి.. తెలుగు పాఠకులకు ఆయన తాత్వికతను పరిచయం చేసిన ఘనత నీలంరాజు లక్ష్మీప్రసాద్‌ సొంతం. జిడ్డు కృష్ణమూర్తితోపాటు రమణ మహర్షి, నిసర్గదత్త మహరాజ్‌, రజనీష్‌, సూఫీజెన్‌ గురువుల ప్రభావంతో ఆయన.. ‘ఆలోకన’, ‘సత్కథా సంపుటి’, ‘పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?’, ‘గరుడయానం’, ‘దివ్యానుభవమూర్తులు’ తదితర 45కుపైగా ఆధ్యాత్మిక పుస్తకాలు రచించారు. ఆకాశవాణిలో ‘భావన’ పేరుతో ప్రసంగాలు చేశారు.

కొద్దిరోజులుగా ఆయన ‘ఈ మది నెమ్మదించేనా?’ అనే పుస్తకం రాస్తున్నారు. తుదిశ్వాస విడవడానికి కొద్దిసేపటి ముందు కూడా ఆయన ఆ పుస్తక రచనలో నిమగ్నమైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. లక్ష్మీప్రసాద్‌ భార్య దమయంతి పదేళ్ల క్రితం కన్నుమూశారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. చిన్నమ్మాయి పద్మప్రియ ప్రస్తుతం జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన రిషివ్యాలీ స్కూలు ప్రిన్సిపల్‌గా ఉన్నారు. అమెరికాలో స్థిరపడిన రెండవ కుమార్తె నిరుపమ గురువారం రాత్రికి నగరానికి చేరుకోనున్నట్లు సమాచారం. ఆమె వచ్చాక.. శుక్రవారం లక్ష్మీప్రసాద్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పెద్దకుమార్తె యశోధర తెలిపారు.

Updated Date - 2023-03-09T03:49:17+05:30 IST