హైదరాబాద్‌లో ‘స్టేట్‌ స్ట్రీట్‌’ కార్యకలాపాల విస్తరణ

ABN , First Publish Date - 2023-05-24T04:54:01+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ‘స్టేట్‌ స్ట్రీట్‌’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది.

హైదరాబాద్‌లో ‘స్టేట్‌ స్ట్రీట్‌’ కార్యకలాపాల విస్తరణ

కొత్తగా 5 వేల మందికి ఉపాధి అవకాశం

హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ‘స్టేట్‌ స్ట్రీట్‌’ హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించనుంది. దీంతో కొత్తగా 5వేల మందికి ఉపాధి లభించనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనాలసిస్‌, అకౌంటింగ్‌, మానవ వనరులు తదితర రంగాల్లో ఈ ఉద్యోగాలు ఉండనున్నాయి. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.. స్టేట్‌ స్ట్రీట్‌ బృందంతో బోస్టన్‌లో సమావేశం అయిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో సేవలందించే స్టేట్‌ స్ట్రీట్‌ 2017 నుంచి హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అప్పట్లో వెయ్యి మంది వరకు ఉపాధి అవకాశాలు ఉంటాయని పేర్కొంది. తాజా విస్తరణతో ఆ సంఖ్య ఆరువేలకు చేరనుంది. దాంతో బోస్టన్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయం తర్వాత ఎక్కువ మంది ఉద్యోగులు హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఇది, గర్వించాల్సిన విషయమని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. స్టేట్‌ స్ట్రీట్‌ బృందంతో జరిగిన సమావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఇతర అధికారులు కేటీఆర్‌ వెంట ఉన్నారు.

Updated Date - 2023-05-24T04:54:01+05:30 IST