విద్యుత్తు డిమాండ్‌ భగభగ

ABN , First Publish Date - 2023-03-31T03:19:55+05:30 IST

రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. యాసంగి పంటలు కీలక దశకు చేరుకుంటుండటం..

విద్యుత్తు డిమాండ్‌ భగభగ

ఒక్కరోజే 15,497 మెగావాట్లుగా రికార్డు

రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే అత్యధికం

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. యాసంగి పంటలు కీలక దశకు చేరుకుంటుండటం.. ఉష్ణోగ్రతల పెరుగుదలతో గృహ, వాణిజ్య వినియోగం కూడా పెరగడంతో విద్యుత్తుకు అత్యధిక డిమాండ్‌ ఏర్పడింది. గురువారం ఉదయం 11:01 గంటల సమయంలో తెలంగాణ రాష్ట్ర గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 15,497 మెగావాట్లుగా రికార్డయింది. తెలంగాణ ఏర్పడ్డాక ఇదే అత్యధిక డిమాండ్‌. రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ రెండు నెలలుగా రోజుకు 13 వేల మెగావాట్లపైనే నమోదవుతున్న విషయం విదితమే. జనవరి 18వ తేదీ నుంచి 13 వేల మెగావాట్లకు తగ్గకుండా డిమాండ్‌ ఉండగా.. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 14 వేల మెగావాట్లపైనే నమోదవుతోంది. వ్యవసాయ వినియోగానికి పగటిపూట త్రీఫేజ్‌ వినియోగంపై ఆంక్షలు ఎత్తివేయడం, ఉష్ణోగ్రతల పెరుగుదలే డిమాండ్‌ పెరగడానికి కారణమని విద్యుత్తు శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈనెల 14వ తేదీన 15,254 మెగావాట్ల డిమాండ్‌ నమోదు కాగా.. ఆ తర్వాత గురువారం నమోదైన డిమాండ్‌ అత్యధికం. వినియోగం కూడా 290 మిలియన్‌ యూనిట్ల దాకా ఉంటుంది. ఈ మేరకు జెన్‌కో థర్మల్‌/హైడల్‌ నుంచి 77 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అందుతుండగా.. 27 మిలియన్‌ యూనిట్లను సింగరేణి థర్మల్‌/సోలార్‌ నుంచి తీసుకుంటున్నారు. ఇక 145 మిలియన్‌ యూనిట్ల దాకా కేంద్ర విద్యుత్తు సంస్థలు/బహిరంగ విపణి నుంచి తీసుకుంటున్నారు. సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 36 యూనిట్ల దాకా ఉండటం గమనార్హం. ఇక విద్యుత్తు వినియోగంలో 30 శాతానికి పైగా వ్యవసాయ రంగం వాటా ఉండగా.. పారిశ్రామిక వినియోగం 20ు ఉంది. మిగిలినదంతా గృహ, వాణిజ్య అవసరాల కోసం విద్యుత్తు వినియోగించుకుంటున్నారు. గత ఏడాది ఇదే రోజున(ఈనెల 30) రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్‌ 13,880 మెగావాట్లుగా ఉండగా.. ఈసారి దాదాపు 15ు దాకా పెరగడం గమనార్హం.

Updated Date - 2023-03-31T03:19:55+05:30 IST