Naveen Mittal: ‘ఆంధ్రజ్యోతి’తో రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్
ABN , First Publish Date - 2023-02-27T03:34:58+05:30 IST
రెవెన్యూ శాఖ అనగానే గుర్తుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టలే! అలాగే ధరణి పేరు చెప్పగానే..
20 రోజుల్లో పరిష్కరిస్తాం!
సీసీఎల్‌ఏలో 2 వేల పెండింగ్ దరఖాస్తులు
వీటిలో రోజుకు 500 క్లియర్ చేస్తున్నాం
జీవో 58 కింద 19 వేల మందికి పట్టాలు
త్వరలోనే జిల్లా స్థాయిలోనూ ఈ ప్రక్రియ
మృతుల భూ సమస్యలపై కొత్త మాడ్యూల్
‘ఆంధ్రజ్యోతి’తో రెవెన్యూ శాఖ
ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ అనగానే గుర్తుకొచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టలే! అలాగే ధరణి పేరు చెప్పగానే.. గుర్తుకొచ్చేవి రైతుల సమస్యలే! ధరణిని తీసుకొచ్చి రెండున్నరేళ్లు అవుతుండగా.. ఇప్పటికీ అపరిష్కృత సమస్యలు అనేకం ఉన్నాయి! వేలాది మంది రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఒకరి భూమి.. మరొకరి పేరుపై ఉండడం, ఉన్న భూమికంటే ఎక్కువ, తక్కువలు నమోదు కావడం, తండ్రి చనిపోతే వారసుల పేరిట మారకపోవడం, యజమానుల పేర్లు, సర్వే నంబర్లలో తప్పులు నమోదు కావడం ఇలా ధరణి సమస్యల వలయంగా మారింది. మరోవైపు జీవో నంబరు 58 కింద పేదలకు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, సాదా బైనామా భూములకు హక్కుపత్రాలు, రెవెన్యూ శాఖలోని ఇతర అంశాలపై ఆ శాఖ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నవీన్ మిత్తల్ మాట్లాడారు. ఇటీవలే కొత్త బాధ్యతలు చేపట్టిన ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. నిర్దిష్ట సమయంలోపే ధరణి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఇతర అంశాలపైనా దృష్టిపెట్టామని.. రెవెన్యూ శాఖను సమస్యల రహితంగా చేసి, ప్రజలకు అందుబాటులో ఉండే విభాగంగా మారుస్తామని చెప్పారు.
ధరణి సమస్యలను ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?
ధరణి పోర్టల్ అద్భుతమైన వ్యవస్థ. రెవెన్యూ రికార్డులు మాన్యువల్ నుంచి పూర్తిగా డిజిటల్‌కు మారిపోయాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ధరణిని రూపొందించడంతో ప్రస్తుత, భవిష్యత్ తరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలను పరిష్కరించాం. ఇక ధరణిలో నెలకొన్న అన్ని సమస్యలనూ 20 రోజుల్లో పరిష్కరిస్తాం.
టీఎం-33 కింద భారీగా దరఖాస్తులు సీసీఎల్‌ఏలో పెండింగ్‌లో ఉన్నాయి కదా?
ఇప్పటికే చాలా దరఖాస్తులను పరిష్కరించాం. టీఎం-33 మాడ్యూల్‌కు సంబంధించిన అర్జీలు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాం. రోజుకు 500 వరకు పరిష్కరించి భూ యజమానులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం. ప్రస్తుతానికి దాదాపు 2వేల వరకు దరఖాస్తులు ఉన్నాయి. వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తాం.
పట్టా భూములు పీవోబీలో నమోదు చేశారు. వాటి పరిష్కారం ఎలా?
పీవోబీ జాబితాలో నమోదైన పట్టా భూములను తొలగించేందుకు ధరణిలో ఆప్షన్ ఇచ్చాం. పట్టా భూములను పీవోబీ నుంచి తొలగించేందుకు కలెక్టర్లకు అధికారం ఇచ్చాం. కోర్టు కేసులు, ప్రభుత్వానికి, పట్టాదారులకు వివాదాలు ఉంటే మాత్రమే పీవోబీలో నమోదై ఉన్నాయి. క్లియర్ పట్టా భూమిని పీవోబీ నుంచి తొలగించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు.
‘సాదాబైనామా’ అర్జీలను ఎప్పుడు పరిష్కరిస్తారు?
సాదాబైనామా కింద అర్జీలను స్వీకరించాం. కొందరు కోర్టును ఆశ్రయించారు. అది క్లియర్ కాగానే సమస్యను పరిష్కరిస్తాం.
ధరణి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పరిగి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసిన దాదాపు 10 వేల డాక్యుమెంట్లు ధరణిలో, రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్(కార్డ్)లోనూ కనిపించడం లేదు?
పరిగి నుంచి సంబంధిత వివరాలు తెప్పించుకొంటాం. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.
ధరణి పోర్టల్‌లో భూములు కొన్న వారి పేర్లు కాకుండా అమ్మిన వారి పేర్లు రావడంతో వారు వారి వారసులకు సక్సెషన్ చేశారు. మరి కొందరు ఇతరులకు విక్రయించారు. దీంతో అసలు యజమానులకు ప్రస్తుతం మ్యుటేషన్ చేసుకునే అవకాశం లేదు. దీనికి పరిష్కారం ఏమిటి?
ఈ అంశం ప్రభుత్వం దృష్టికీ వచ్చింది. ఇలాంటి భూ సమస్యలపై ఇప్పటికే కేబినెట్ సబ్‌కమిటీలో చర్చించాం. వీటి కోసం త్వరలో ధరణి పోర్టల్‌లో కొత్తగా మాడ్యూల్ తెచ్చేందుకు చర్యలు తీసుకుంటాం.
రెవెన్యూ శాఖలో పదోన్నతులు ఎప్పుడు?
పదోన్నతుల కోసం కమిటీ (డీపీసీ)ని ఏర్పాటు చేశాం. త్వరలోనే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.
రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ సర్వే ఎప్పుడు చేస్తారు?
డిజిటల్ సర్వే అనేది బృహత్తర ప్రణాళిక. దీని అమలుపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. ఈ అంశాన్ని సర్కారు దృష్టికి తీసుకెళ్తా.
వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారు?
వీఆర్‌ఏలకు ఇచ్చిన హామీలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా.
జీవో 58 కింద వచ్చిన దరఖాస్తులను ఎప్పుడు పరిష్కరిస్తారు?
ఉచిత క్రమబద్ధీకరణ కోసం జీవో నంబరు 58 కింద వచ్చిన దరఖాస్తులను జిల్లాల వారీగా పరిశీలించారు. అర్హులైన 19 వేల మంది పేదలను గుర్తించాం. వారికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, కలెక్టర్, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో త్వరలోనే పట్టాలను పంపిణీ చేస్తాం. 59 జీవో కింద అర్హులను గుర్తించి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ చేసే ప్రక్రియ జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో 15 మందికి స్థలాలను క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పించాం.