ధరణి ధారుణాలు!
ABN , First Publish Date - 2023-06-08T03:52:26+05:30 IST
గ్రామాలతో సంబంధం తెగిపోతే ఏమవుతుంది!? గ్రామాల్లో ఏం జరుగుతోందో తెలియకపోతే ఏమవుతుంది!? ఒకరిద్దరు అధికారులు చెప్పిందే నిజమని నమ్మితే ఏమవుతుంది!? వారు చెప్పిందే నిజమనిపిస్తుంది! తమ పాలన అద్భుతం అనిపిస్తుంది!
రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో బాధితులు.. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ చక్కర్లు
ప్రజావాణిల్లో 90 శాతం ఫిర్యాదులు ఇవే.. చేతులెత్తేస్తున్న అధికారులు.. స్పందించని సీసీఎల్‌ఏ
అయినా, ధరణి అద్భుతమంటున్న సీఎం.. బాధితుల ఆక్రందనలను చెవికెక్కించుకోని కేసీఆర్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): గ్రామాలతో సంబంధం తెగిపోతే ఏమవుతుంది!? గ్రామాల్లో ఏం జరుగుతోందో తెలియకపోతే ఏమవుతుంది!? ఒకరిద్దరు అధికారులు చెప్పిందే నిజమని నమ్మితే ఏమవుతుంది!? వారు చెప్పిందే నిజమనిపిస్తుంది! తమ పాలన అద్భుతం అనిపిస్తుంది! ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఇదే జరుగుతోంది! ధరణి పోర్టల్‌లో పట్టా భూమి ప్రభుత్వ భూమిగా, దేవాదాయ, సీలింగ్, అటవీ, అసైన్డ భూమిగా నమోదైంది. అసలు యజమానికి బదులు ఇతరుల పేర్లు నమోదు చేశారు. సర్వే నంబరు, ఖాతా నంబరు, విస్తీర్ణం తదితర సమాచారాన్ని తప్పుగా నమోదు చేశారు. వ్యవసాయ భూమిని నాలా భూమిగా పేర్కొన్నారు. కొన్నవారి పేరును నమోదు చేయాల్సింది పోయి అమ్మిన వారి పేరునే ఆనలైనలో ఎక్కించేశారు. ఒకటా.. రెండా.. ఇటువంటి తప్పులు ఎన్నెన్నో! రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు! ఒక్క తాజా హక్కుదారుల పేర్లు గల్లంతైన బాధితులే 1.20 లక్షల మంది ఉంటారని అంచనా. ఈ సమస్యలు పరిష్కరించాలంటూ రైతులు కాళ్లరిగేలా తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు! ఆత్మహత్యా యత్నాలు చేస్తున్నారు! ప్రతి జిల్లాలోనూ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ధరణికి సంబంధించినవే. ఎన్నిసార్లు విన్నవించుకున్నా అక్కడ పరిష్కారం కావడం లేదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టుభూత్కూర్ గ్రామానికి చెందిన భూమల్ల నాంపల్లి అనే రైతు తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలంటూ పలుమార్లు తహసీల్దార్ నుంచి కలెక్టర్ వరకు వినతి పత్రాలు సమర్పించి విసిగి వేసారిపోయాడు. 15 రోజుల కిందట ప్రజావాణి కార్యక్రమానికి ఇప్పటి వరకు అధికారులకు ఇచ్చిన వినతి పత్రాల జిరాక్సు ప్రతులను మెడలో వేసుకొని వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. దీంతో వెంటనే ఆయన సమస్యను పరిష్కరించాలని అధికారులను అసిస్టెంట్ కలెక్టర్ ఆదేశించారు. అయినా పరిష్కారం కాకపోవడంతో గత సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి పురుగుల మందు డబ్బాతో హాజరై ఆత్మహత్య యత్నానికి పాల్పడేందుకు చూస్తుండగా పోలీసులు ఆయనను గమనించి పురుగుల మందు డబ్బాను తీసుకొని బయటకు పంపించారు. ‘‘నా తండ్రి పేరుతో వ్యవసాయ భూమి పట్టా ఉంది. ఆయన మరణించాడు.
ఆ భూమిని నాపేరుపై మార్చాలని దరఖాస్తు చేసుకున్నాను. నెలల తరబడి తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మరికొందరు కోర్టు మెట్లెక్కుతున్నారు! చివరికి, హైకోర్టు కూడా 20 సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలని సర్కారును ఆదేశించింది! అయినా, బాధితుల ఆక్రంధనలు ముఖ్యమంత్రి కేసీఆర్ చెవికెక్కడం లేదు. ధరణి అద్భుతం అంటూ పాత పాటనే పదే పదే పాడుతున్నారు. తప్పితే.. నిజంగా సమస్య ఉందా! ఉంటే, దానిని ఎలా పరిష్కరించాలి!? అని లేశమాత్రం కూడా ఆలోచించడం లేదు. లక్షలాదిమంది భూ యజమానుల ఇబ్బందులను పట్టించుకోవట్లేదు. భూముల సమస్యలన్నీ పరిష్కరిస్తామని, సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని గతంలో అసెంబ్లీలో ఎన్నోసార్లు బల్లగుద్ది చెప్పిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవడం లేదు. సమగ్ర భూ సర్వే ఒక్కటే ప్రస్తుత ధరణి సమస్యలకు పరిష్కారమని నిపుణులు చెబుతున్నా స్పందించడం లేదు. గతంలో భూములకు సంబంధించి ఎన్నో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, భూ యజమానికి తెలియకుండానే పేర్లు మార్చేసేవారని, ఇప్పుడు అటువంటి అవకాశం ఇవ్వకుండా ధరణిని మొత్తం లాక్ చేసేశామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా చెబుతున్నారు. కానీ, గతంలో ఉన్న లోటుపాట్లను ఏమాత్రం సవరించకుండా.. అదనంగా కొత్త సమస్యలను సృష్టించి రెవెన్యూ రికార్డులను ధరణిలోకి ఎక్కించేశారు. వాటిని సవరించడానికి ఎవరికీ అవకాశం లేకుండా చేసేశారు. ధరణిని లాక్ చేయడంతో ఇప్పుడు సమస్యలన్నీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. వాటిని పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. ధరణిని లాక్ చేశామని ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. కానీ, నిజానికి సమస్యలను, వివాదాలను లాక్ చేసేశారు. అందుకే, రాష్ట్రవ్యాప్తంగా ఇంత గగ్గోలు రేగుతోంది. మరోవైపు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహా వివిధ జిల్లాల్లో విలువైన భూములను, వివాదాస్పద భూములను బినామీల పేరిట ధరణిలో పేర్లు మార్చేశారని, తర్వాత ఆ వివరాలు బయటకు రాకుండా లాక్ చేసేశారని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ధరణిలో ఆ వివరాలు బయటకు వస్తే.. వందల కోట్ల కుంభకోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని విమర్శిస్తున్నాయి.
ఎన్వోసీలతో తంటా
ధరణి పోర్టల్‌లో కొన్ని పట్టా భూములను ఎండోమెంట్ (పీఓబీ) ఖాతాలో నమోదు చేశారు. వాటిని తొలగించే అధికారం కేవలం కలెక్టర్లకు మాత్రమే ఉంది. కానీ, అన్ని రెవెన్యూ డాక్యుమెంట్లతోపాటు ఎండోమెంట్ జారీచేసిన ఎనఓసీ ఉంటేనే పీఓబీ జాబితాలో నుంచి పట్టా భూములను తొలగించేందుకు కలెక్టర్‌కు సిఫార్సు చేస్తామని ఆయా మండలాల రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. బాధితులు ఇదే విషయాన్ని దేవాదాయశాఖ అధికారులకు చెబితే ఎండోమెంట్ భూముల వివరాలు ఇస్తామని, అంతే తప్పితే, ఎన్వోసీ ఇచ్చేది లేదని చెబుతున్నారు. దీంతో వేలాది మంది బాధితులు నెలల తరబడి రెవెన్యూ, ఎండోమెంట్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్వోసీ కోసం ఉమ్మడి జిల్లాలవారీగా రంగారెడ్డి నుంచి 3,500, మెదక్ నుంచి 5,200, మహబూబ్‌నగర్-4,075, వరంగల్- 5 వేలకుపైగా, కరీంనగర్ జిల్లా దాదాపు 6,600; నిజామాబాద్ జిల్లా నుంచి 4,200 దరఖాస్తులు వచ్చాయి. మిగతా జిల్లాల నుంచి కూడా ఎనఓసీ కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి.
తాజా హక్కుదారుల పేర్లు గల్లంతు
తాజా హక్కుదారుల పేర్లు గల్లంతైనవారు రాష్ట్రవ్యాప్తంగా 1.20 లక్షల మంది బాధితులు ఉన్నారు. ధరణి పోర్టల్‌కు ముందే కొందరు రైతులు క్రయ విక్రయాలు జరిపారు. రిజిస్ట్రేషన కార్యాలయంలో పక్కాగా రిజిస్ట్రేషన చేసుకొన్నారు. కొనుగోలు చేసిన వారికి రెవెన్యూ అధికారులు ప్రొసీడింగ్ ఆర్డర్, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. కానీ, ధరణి వచ్చిన తర్వాత పోర్టల్‌లో తాజా హక్కుదారుల పేర్లు గల్లంతయ్యాయి. తాజా యజమానుల పేర్లకు బదులు గతంలో అమ్మిన వారి పేర్లు నమోదయ్యాయి. దీంతో అమ్మినవారే వారసులకు విరాసత (సక్సెషన) చేశారు. మరికొందరు ఫీల్డ్‌లో భూమి లేకపోయినా రికార్డుల్లో ఉన్న భూమిని విక్రయించారు. భూమిని కొనుగోలు చేసిన అసలు యజమానులకు హక్కులు లేకుండా పోయాయి. గల్లంతైన తాజా హక్కుదారుల పేర్లను తిరిగి ధరణిలో నమోదు చేసే కీలకమైన మాడ్యూల్ లేకపోవడంతో బాధితులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమస్యలతో వేలాది మంది రెవెన్యూ అధికారులు, సీసీఎల్‌ఏ చుట్టూ తిరుగుతున్నారు.
దరఖాస్తులకే చేతి చమురు వదులుతోంది
పాస్‌బుక్ డాటా కరెక్షన పరిష్కారానికి అందుబాటులోకి తెచ్చిన టీఎం 33 మాడ్యూల్‌లో దరఖాస్తుల పరిష్కారానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లా కేంద్రాల నుంచి వచ్చిన అర్జీలు సీసీఎల్‌ఏలో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. దరఖాస్తు చేసినప్పుడు డాక్యుమెంట్లు, తహసీల్దార్ రిపోర్టులన్నీ సక్రమంగా ఉంటేనే సంబంధిత అప్లికేషన నెంబరును అప్రూవ్ చేస్తారు. ఒక్కటి తేడా ఉన్నా రిజెక్ట్ చేస్తున్నారు. అప్రూవ్ చేస్తే సదరు నంబరు నేరుగా సీసీఎల్‌ఏ లాగినలోకి వెళ్తోంది. సీసీఎల్‌ఎలో దానిని అప్రూవ్ చేస్తేనే బాధితుని సమస్య పరిష్కారం అవుతుంది. కాదని రిజెక్ట్ కొడితే మళ్లీ మొదటికి వస్తోంది. ఒక్కొక్కసారి దరఖాస్తు చేసుకున్నందుకు రూ.1200 వరకూ ఖర్చవుతోంది.
రిజెక్టెడ్.. రిజెక్టెడ్.. రిజెక్టెడ్..
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు పామ్ వెంకట్ రెడ్డి ధరణి కారణంగా 70 ఏళ్ల వయసులో అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఆయన పేరున ఉండాల్సిన భూమి మరొకరి పేరు మీదకు వెళ్లడమే ఇందుకు కారణం. కొండారెడ్డిపల్లి గ్రామ శివారులో తొమ్మిది సర్వే నంబర్లలో ఆయనకు 12 ఎకరాల 5 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ధరణిలో ఖాతా నంబర్ 388తో ఆయన ఫొటో, టి05120110183తో పాస్ పుస్తకాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ భూమిని ఆయన బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించిన తరువాత తనఖా నుంచి విడిపించుకోవడం కోసం స్లాట్ బుక్ చేయడానికి మీసేవ కేంద్రానికి వెళ్లాడు. అక్కడ ఆయన ఆధార్ నంబర్ నమోదు చేస్తే ధరణిలో భూమి వివరాలు రాలేదు. సర్వే నంబర్ల ద్వారాట్రాకింగ్ చేస్తే కనిపించాయి. కానీ, ఆయన ఆధార్ నంబర్‌కు బదులుగా గుర్తు తెలియని వ్యక్తి ఆధార్ నంబర్ నమోదైంది. ఫొటో కూడా మారిపోయింది. సమస్యను తహసీల్దార్ కార్యాలయ అధికారికి చెబితే తాము చేసేది ఏమీ లేదని కలెక్టర్ ద్వారా మాత్రమే ధరణిలో మార్పులకు అవకాశం ఉంటుందని చెప్పారు. మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి సూచన మేరకు మీసేవలో మాడ్యూల్ 33లో ఆరుసార్లు దరఖాస్తు చేసుకుంటే ప్రతిసారీ కలెక్టర్ కార్యాలయం నుంచి రిజెక్టెడ్ అని వస్తోంది.
కలెక్టరేట్ పేరే ఎక్కించేశారు
ఈమె పేరు పార్వతిదేవి. గద్వాల జిల్లా కేంద్రం. కలెక్టరేట్ సమీపంలో సర్వే నంబర్ 780/ఎ2లో ఆమెకు 1.22 గుంటల భూమి ఉంది. దీనిని ఏకంగా కలెక్టరేట్ పేరుపై రికార్డుల్లో ఎక్కించేశారు. ల్యాండ్ రికార్డు అప్డేషన ప్రోగ్రాంలో రెవెన్యూ అధికారుల తప్పిదంతో ఇలా జరిగింది. దీనిపై 2017 నుంచి కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 2018లో ప్రీ లిటిగేషన కేసు వేశారు. కలెక్టరేట్ పేరును తొలగించి తమ పేరు ఎక్కించాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. విజిలెన్సకు కూడా ఫిర్యాదు చేశారు. సీసీఎల్‌ఏ నుంచి ఈమె పేరు ఇంప్లిమెంటేషన చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. అయినా, ధరణిలో ఆప్షన లేదంటూ సమస్యను పరిష్కరించడం లేదు. ఇప్పుడు కొత్తగా ఆప్షన వచ్చినా కలెక్టర్ తన పేరును సరిచేయడంలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా వాణికి 14 సార్లు
ఈ చిత్రంలోని రైతు పేరు పిన్నింటి గాల్‌రెడ్డి. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరాంచర్ల గ్రామానికి చెందిన ఈయన భూ సమస్య పరిష్కరించాలని కోరుతూ ఇప్పటి వరకు కలెక్టరేట్‌లో ప్రజావాణికి 14 సార్లు వచ్చారు. చిన్నరాంచర్ల గ్రామంలో తన అల్లుడు పేరు మీద ఎకరం 30 గుంటల భూమి ఉంది. పాస్‌బుక్కులో మాత్రం ఎకరం 10 గుంటల భూమి మాత్రమే నమోదైంది. ఇంకా 20 గుంటల భూమిని ధరణిలో ఎక్కించాలని కోరుతూ ఇప్పటికీ 14 సార్లు కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు.
అంజిలయ్యకు ఎంత కష్టం!?
మహబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండలం గ్యాధిరాల్ గ్రామానికి చెందిన సండ్రాస్ హనుమయ్య కొడుకు అంజిలయ్యకు సర్వే నంబర్ 186లో 2.20 ఎకరాలుంది. కుటుంబ వారసత్వంగా అంజిలయ్యకు ఈ భూమి సంక్రమించింది. ధరణి పోర్టల్‌కు ముందు వరకు అంజిలయ్యకు పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ ఉన్నాయి. ధరణి పోర్టల్‌లో మాత్రం ఆ భూమిని సండ్రాస్ అంజిలయ్య తండ్రి నరసయ్య పేరున నమోదు చేశారు. ఆధార్ నెంబర్, ఫొటో కూడా నరసయ్య కొడుకు అంజిలయ్యవే వాడారు. విషయం తెలుసుకున్న అసలు భూ యజమాని అంజిలయ్య అధికారులకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయడంతో రైతుబంధు మాత్రం నిలిపివేశారు. పట్టా నమోదులో లోపాన్ని ఇప్పటికీ సరి చేయలేదు. తమ పరిధిలో లేని అంశమని అధికారులు అంటున్నారు.
భూ యజమానినే మార్చేశారు
పెద్దపెల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన ధ్యాగేటి జానయ్య పేరిట సర్వే నంబర్ 788/బిలో 21 గుంటల భూమి ఉంది. భూ ప్రక్షాళన అనంతరం 2019లో ఆయన పేరిట కొత్త పట్టాదారు పాస్‌బుక్‌ను ప్రభుత్వం జారీ చేసింది. కానీ, 2020లో అధికారికంగా ధరణి వెబ్‌సైట్‌ను ఓపెన చేసిన తర్వాత ఆ భూమి ఆయన పేరిట కాకుండా చొప్పరి శ్రీనివాస్ పేరిట ఉండడంతో జానయ్య కంగుతిన్నారు. ఆ భూమిని తన పేరిట మార్చాలని మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. రైతుబంధు, రైతు బీమా, ప్రధాని కిసాన సమ్మాన యోజన పథకంతోపాటు బ్యాంక్ రుణాలూ రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడంలేదని వాపోయారు.
6 ఎకరాల 20 గుంటలు గాయబ్
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం తుంపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య అదే గ్రామానికి చెందిన చిన్న నాగిరెడ్డి నుంచి 30 ఏళ్ల కిందట 13 ఎకరాల 24 గుంటల భూమిని సర్వే నంబర్ 117లో కొనుగోలు చేశాడు. మాన్యువల్‌గా రిజిస్ట్రేషన చేసుకున్నప్పుడు 13 ఎకరాల 24 గుంటల భూమికి పట్టాదార్ పాస్ బుక్ వచ్చింది. ధరణి వచ్చిన తర్వాత 117 సర్వే నంబర్‌లో 7 ఎకరాల 4 గుంటల భూమి మాత్రమే రిజిస్ట్రేషన చేసుకునేందుకు అనుకూలంగా ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్, తహసీల్దార్‌ను అడిగితే.. కాస్రాలో ఉన్నది అంతేనని చెబుతున్నారు. అది మాత్రమే రిజిస్ట్రేషన చేసుకోవడానికి వీలవుతుందని అంటున్నారు. తప్పితే సమస్యను పరిష్కరించడం లేదు.
ఇదేమి వాల్యుయేషన
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో చాలా ఇబ్బంది పడ్డాను. కష్టపడి ఉద్యోగం చేసి వచ్చిన డబ్బులతో భూమి కొందామని వెళితే వాల్యూవేషన ఇష్టానుసారంగా పడడంతో చాలా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. నేను కొనుగోలు చేసిన సర్వే నెంబర్ 501 బండౌతపురం గ్రామ శివారులోనిది. ఇంకా దాని వాల్యూవేషన అలానే రూ.25,40,000 చూపుతోంది. వేరే పక్కన ఉన్న సర్వే నంబర్ 448 నంబర్ రూ.2 లక్షలు ఎకరానికి చూపిస్తోంది. కలెక్టర్ సైతం ఏమీ చేయలేక సీసీఎల్‌ఏకు వెళ్లాలని సూచించడం బాధ కలిగింది. ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాకపోవడంపై ప్రభుత్వం, అధికారులే సమాధానం చెప్పాలి.
-జక్కుల కుమార్, ఆర్మీ జవాన, బండౌతపురం గ్రామం, వర్ధన్నపేట మండలం, వరంగల్ జిల్లా
పట్టాభూమి జీరో ఖాతాలో
నా పేరున పట్టా భూమి 1.18 ఎకరాలు నోషనల్ ఖాతా (జీరో ఖాతా)లో పడింది. ఏడాదిగా నా భర్తతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. భూమి విలువ కోటి రూపాయలకుపైగా ఉంటుంది. తహసీల్దార్, అధికారులను ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. సర్వే నెంబరు 222/ఉలో ఉన్న భూమిని 30 ఏళ్ల క్రితం నా భర్త నా పేరున పట్టా చేశాడు. రైతుబంధు కూడా వస్తోంది. ఏడాదిగా ఆ భూమి జీరో ఖాతాలో పడింది. భూమి ఉన్నా లేని పరిస్థితిగా దాపురించింది. ధరణి రాకముందే బాగా ఉండేది. పట్టాదారు పాస్‌పుస్తకం వీఆర్‌వో, ఆర్‌ఐ, తహసీల్దార్లు పరిశీలించి జారీ చేసేవారు. ధరణి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. - భారతి బాయి, నల్లగొండ
నా భూమిని ఇతరుల పేర్ల మీద మార్చారు
మాది నిర్మల్ జిల్లా. 14 ఏళ్ల క్రితం నిర్మల్ మండలం రత్నాపూర్ కాండ్లీ శివారు 241/1 సర్వే నెంబర్‌లో ఎకరం 10 గుంటల భూమి కొనుగోలు చేశాను. కొన్ని రోజుల తర్వాత ఈ భూమి నుంచి 39 గుంటలు నిర్మల్‌కు చెందిన మంత్రి శ్రీనివా్‌సకు విక్రయించాను. నా పేరు మీద మిగతా 11 గుంటల భూమి ఉండాలి. కానీ, తహసీల్దార్ చేసిన పొరపాటు కారణంగా మొత్తం ఎకరా 10 గుంటల భూమిని శ్రీనివాస్ పేరిట మార్చారు. ఇప్పుడు నా 11 గుంటల భూమి నాకు కావాలంటే ధరణిలో ఆప్షన్ లేదని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం. కోర్టుకెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలని చెబుతున్నారు. అధికారులు చేసిన తప్పునకు ఇప్పుడు నేను బలి కావాల్సి వస్తోంది.
-బాలక్కగారి కిషన్‌రావు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు, నిర్మల్ జిల్లా
అసైన్డ్ భూమిగా పట్టా భూమి
నేను, నా బంధువులం 1998లో 148/లు సర్వే నెంబర్‌లో 7.20 ఎకరాలు కొని పాస్‌బుక్ తీసుకున్నాం. నా పేరిట రెండెకరాల పాస్ బుక్ కూడా ఉంది. ధరణి వచ్చిన తర్వాత అది అసైన్డు భూమిలో ఉందని చూపిస్తోంది. అసైన్డ కాదని ఆధారాలు చూపినా పట్టించుకోవడం లేదు. మా భూములను ఆనుకుని వేరేచోట అసైన్డ్ భూములున్నాయి. వాటిని కూడా కలిపేసి మా భూమి కూడా అసైన్డు అంటున్నారు.
- దొడ్డా శ్రీనివాసరెడ్డి, వేంసూరు మండలం, వైఎ్‌సబంజర గ్రామం, ఖమ్మం జిల్లా
13 ఎకరాలు నిషేధిత జాబితాలోకి!
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రానికి చెందిన పెరుమాళ్ల చంద్రశేఖర్‌కు కొందుర్గులోని సర్వే నంబర్ 75, 76, 86లలో బంధువులతో కలిపి 13 ఎకరాల భూమి ఉంది. తాతముత్తాతల నుంచీ దానిని సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ధరణి కంటే ముందు జారీ చేసిన పట్టాదార్ పాస్ పుస్తకాల్లో వారి పేర్లే ఉన్నాయి. కానీ, ధరణి పోర్టల్లో ఆ 13 ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇదేమిటని పరిశీలిస్తే వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది తమకు అనువంశికంగా వచ్చిన భూమి అని, ఏళ్ల తరబడి దాన్నే నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని 2019లోనే స్థానిక ఎమ్మార్వోకు బాధితులు ఫిర్యాదు చేశారు. 2020లో ఆర్డీవోకు అర్జీ పెట్టుకున్నా లాభం లేకుండాపోయింది. 2022 డిసెంబరులో జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుని వినతి పత్రం కూడా అందజేశారు. ఇప్పటికీ సమస్య పరిష్కారమవలేదు.