క్రికెట్ మ్యాచ్..బందో ‘మస్త్’
ABN , First Publish Date - 2023-01-18T00:35:24+05:30 IST
ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న డే అండ్ నైట్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఉప్పల్ సేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
2,500 మంది పోలీసులతో..
300 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
స్టేడియం చుట్టూ 15 కిలోమీటర్ల మేర ప్రత్యేక నిఘా
మహిళల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్
మధ్యాహ్నం 12 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతి
మీడియా సమావేశంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్
హైదరాబాద్ సిటీ, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం ఇండియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న డే అండ్ నైట్ వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఉప్పల్ సేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. 2,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుందని, ప్రేక్షకులను మధ్యాహ్నం 12 గంటల నుంచే స్టేడియంలోకి అనుమతిస్తారన్నారు. కార్లు, ద్విచక్రవాహనదారులకు పార్కింగ్ ఇక్కట్లు లేకుండా ట్రాఫిక్ సిబ్బంది ఏర్పాట్లు చేశారని వివరించారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ
స్టేడియం నుంచి చుట్టుపక్కల 15 కిలోమీటర్ల మేర సీసీటీవీ కెమెరాల నిఘాలో ఉంటుందన్నారు. 300 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీటీవీ కెమెరాలను స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌తోపాటు.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లో ఉన్న తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తారని చెప్పారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక షీటీమ్స్ బందోబస్తులో ఉంటాయన్నారు. ప్రేక్షకులు స్టేడియంలోకి వెళ్లి కూర్చునే సీటు వరకు జూమ్ చేసి పర్యవేక్షించేందుకు అత్యాధునిక కెమెరాలు వినియోగిస్తున్నామని వెల్లడించారు. స్టేడియం వద్ద ఇబ్బందులు కలిగినా, హెచ్‌సీఏ నిబంధనలు పాటించకుండా ఎవరైనా వస్తువులు విక్రయిస్తే అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు, లేదా డయల్ 100, రాచకొండ వాట్సాప్ నెంబర్ 9490617111 సమాచారం ఇవ్వాలని సీపీ సూచించారు.
వీటికి అనుమతి లేదు
ల్యాప్‌టాప్స్, కెమెరాలు, మ్యాచ్‌బాక్స్‌లు, బైనాక్యులర్స్, బ్యాటరీలు, బ్యాగులు, బ్యానర్స్, సిగరెట్లు, లైటర్స్, కాయిన్స్, హెల్మెట్స్, బయటి నుంచి తినుబండారాలు, వాటర్ బాటిల్స్, ఎలకా్ట్రనిక్ వస్తువులు, షార్ప్ మెటల్ వస్తువులు, వైరింగ్ పెన్స్, పెర్ఫ్యూమ్స్‌ను స్టేడియంలోకి అనుమతించరు. సెల్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్స్, పర్సులను మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారన్నారు. ఏడు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచామన్నారు.
బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న 17 మంది అరెస్ట్
బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారం అందడంతో రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు 11 చోట్ల దాడులు నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 59 టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్ ఎస్‌వోటీ పోలీసులు ఉప్పల్ పీఎస్ పరిధిలో ఆరుచోట్ల దాడులు నిర్వహించి 10మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 39 టికెట్లు స్వాధీనం చేసుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు ఐదుచోట్ల దాడులు నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 20 టికెట్లు స్వాధీనం చేసుకొని మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు.
ట్రాఫిక్ ఆంక్షలు
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఎల్‌బీనగర్, ఉప్పల్, రామంతాపూర్, సికింద్రాబాద్, తార్నాక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయన్నారు. నగరంలోకి వచ్చే వాహనాలను ఓఆర్‌ఆర్ ద్వారా మళ్లిస్తామని తెలిపారు. సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సిన గూడ్స్ వాహనాలను ఎల్‌బీనగర్, అంబర్‌పేట ద్వారా వెళ్లేలా ఏర్పాట్లు చేశామన్నారు.
హెచ్‌సీఏలో భగ్గుమన్న విభేదాలు
మరోసారి అజారుద్దీన్‌పై ఆరోపణలు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్, అతడి అనుచరులు ఎవరినీ సంప్రదించకుండా, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ప్రధాన కార్యదర్శి ఆర్.విజయానంద్ మండిపడ్డాడు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ గడువు ముగిసినా కొత్త కార్యవర్గం కొలువు దీరేవరకు అధ్యక్ష, కార్యదర్శులిద్దరినీ సమన్వయంతో పనిచేయమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే.. అజర్ న్యాయస్థానం ఆదేశాలను తుంగలో తొక్కి నియంతలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. చెక్కులపై అజర్, అతడి అనుచరులు తనను బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారని.. దళితుణ్ణి అని చిన్నచూపు చూస్తున్నారని విజయానంద్ వాపోయాడు. తనతోపాటు మిగిలిన కార్యవర్గ సభ్యులు ఎవరిని కూడా అజర్ మ్యాచ్ నిర్వహణ ఏర్పాట్లలో జోక్యం చేసుకోనీయడం లేదన్నారు.