గోషామహల్‌లో పోటాపోటీ

ABN , First Publish Date - 2023-09-22T16:00:21+05:30 IST

గోషామహల్‌ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఘన విజయాన్ని సాధించిన రాజాసింగ్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది.

గోషామహల్‌లో పోటాపోటీ

సస్పెన్షన్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

ముమ్మర ప్రయత్నాల్లో విక్రమ్‌ గౌడ్‌, శంకర్‌యాదవ్‌

చాపకింద నీరులా ప్రజల్లోకి వెళ్తున్న నేతలు

అయోమయంలో పార్టీ నేతలు, శ్రేణులు

మంగళ్‌హాట్‌, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి) : గోషామహల్‌ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు ఘన విజయాన్ని సాధించిన రాజాసింగ్‌ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ఇక్కడి నుంచి బీజేపీ టికెట్‌ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగింది. రాజాసింగ్‌కు అత్యంత సన్నిహితులుగా భావించే వారు సైతం టికెట్‌ కోసం దరఖాస్తు సమర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్‌ కొన్ని నెలల క్రితం పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన విషయం తెలిసిందే. అయినా ఆయన బీజేపీ కార్యక్రమాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న బహిరంగ సభలకు సైతం హాజరవుతున్నారు. అయినా పార్టీ పెద్దల నుంచి టికెట్‌ విషయంపై ఎలాంటి హామీ లభించలేదు. కనీసం తనపై ఉన్న సస్షెనన్‌ ఎత్తివేసే విషయంలోనూ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే విషయాన్ని రాజాసింగ్‌ సైతం ఇటీవల పలుమార్లు చెప్పారు. తనకు బీజేపీ అధిష్ఠానం టికెట్‌ కేటాయించని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉంటూ హిందూ ధర్మం కోసం పనిచేస్తానంటూ వ్యాఖ్యానించిన విషయాలను గుర్తు చేస్తున్నారు. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తివేసి పార్టీలోకి ఆహ్వానించకపోవడంతో ఆయన టికెట్‌ కోసం దరఖాస్తు చేసుక్టుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీలో కీలకంగా పనిచేస్తూ కేడర్‌లో పేరున్న పలువురు నేతలు టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో బీజేపీ నుంచి కొత్త వ్యక్తి బరిలో ఉంటారని చర్చ జరుగుతోంది.

పదుల సంఖ్యలో దరఖాస్తులు

ఈ నేపథ్యంలో గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పదుల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. వారిలో ప్రధానంగా దివంగత నేత, మాజీ మంత్రి ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్‌ గౌడ్‌, బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌ యాదవ్‌, జాంబాగ్‌ కార్పొరేటర్‌ రాకేష్‌ జైస్వాల్‌, సీనియర్‌ నేత గోవిందరాఠి, పాండుయాదవ్‌, గోషామహల్‌ కార్పొరేటర్‌ లాల్‌సింగ్‌తోపాటు మరికొంతమంది నేతలు ఉన్నారు. రాజాసింగ్‌కు టికెట్‌ కేటాయించని పక్షంలో గత ఎన్నికల్లో హైదరాబాద్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భగవంతరావుకు టికెట్‌ కేటాయిస్తారని ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన ఈ టికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోలేదని తెలుస్తోంది.

విక్రమ్‌ గౌడ్‌ వర్సెస్‌ శంకర్‌ యాదవ్‌

కాగా, ప్రధానంగా టికెట్‌ ఎవరిని వరిస్తుందనే విషయంలో రెండు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. విక్రమ్‌ గౌడ్‌, శంకర్‌యాదవ్‌లలో ఒకరికి టికెట్‌ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. విక్రమ్‌గౌడ్‌ ఆర్థికంగా బలంగా ఉండడంతోపాటు ఆయన తండ్రి ముఖేష్‌ గౌడ్‌ రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. గోషామహల్‌లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. దశాబ్దాలపాటు వేధిస్తున్న మంచినీటి సమస్య పరిష్కారానికి అల్లాబండా రిజర్వాయర్‌, లోధా క్షత్రియ సమాజ్‌కు సంబంధించిన ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేకమైన ప్యాకేజీతోపాటు వారిని బీసీల్లో చేర్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని ఒప్పించి సఫలీకృతుడయ్యారు. దీంతోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో ఆయనకున్న సత్సంబంధాలు, ఆయా ప్రజల మనసుల్లో ఆయన వేసుకున్న చెరగని ముద్ర నేటికీ పదిలంగా ఉందని చెప్పొచ్చు. ధూల్‌పేట్‌, గోషామహల్‌, దత్తాత్రేయనగర్‌, బేగంబజార్‌, జాంబాగ్‌ డివిజన్‌లో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికీ ప్రజలు, పార్టీ కార్యకర్తలు గుర్తు ేసుకుంటూ ఉండడం విక్రమ్‌గౌడ్‌కు కలిసి వచ్చే అంశాలు. అలాగే గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు అన్ని డివిజన్లలో ఉండడంతో వారి ఓట్లతోపాటు పార్టీ అనుచరుల ఓట్లు, ముఖేష్‌గౌడ్‌ చేపట్టిన అభివృద్ధి కలిసొచ్చే అవకాశం ఉంది. తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తానని ఆయన అంటున్నారు.

పోటీ రసవత్తతరం

బేగంబజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌ విషయంలోనూ సానుకూలతలు అనేకం ఉన్నాయి. కాగా, విక్రమ్‌ గౌడ్‌ కుటుంబంతో శంకర్‌ యాదవ్‌కు స్నేహపూర్వక సంబంధాలున్నాయి. ముఖేష్‌ గౌడ్‌ మంత్రిగా ఉన్న సమయంలోనే శంకర్‌యాదవ్‌ బేగం బజార్‌ డివిజన్‌లో రెండుసార్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం బీజేపీలో చేరి రెండు పర్యాయాలు కార్పొరేటర్‌గా అధిక మెజారిటీతో విజయాన్ని సాఽధించారు. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బేగంబజార్‌ కార్పొరేటర్‌ సీటు విషయంలో శంకర్‌ యాదవ్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్‌ అడ్డు తగిలారని, ఆ విషయంలో ఇరువురి మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే చివరి క్షణంలో సీటు దక్కించుకుని శంకర్‌యాదవ్‌ గెలుపొందారు. అప్పటినుంచి తాను ఎమ్మెల్యే బరిలో ఉంటున్నట్లు ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టికెట్‌ కోసం దరఖాస్తు సమర్పించారు. శంకర్‌ యాదవ్‌కు బేగంబజార్‌, గోషామహల్‌, జాంబాగ్‌, గన్‌ఫౌండ్రీ డివిజన్‌లో మంచి వ్యక్తిగత ఓటు బ్యాంకుతోపాటు పార్టీ ఫాలోవర్స్‌ ఓట్లు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు కూడా ఆయా డివిజన్లలో అత్యధికంగా ఉండడంతో వారి ఓట్లు సైతం శంకర్‌ యాదవ్‌కు పడే అవకాశం ఎక్కువగా ఉంది. పార్టీ తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ అభివృద్ధితోపాటు ధర్మం కోసం పూర్తి జీవితాన్ని అంకితం చేస్తానని ఆయన పేర్కొంటున్నారు. బీజేపీ టికెట్‌ ఎవరికి కేటాయించినా పోటీ రసవత్తరంగా ఉంటుందని పలువురు పార్టీ సీనియర్‌ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, చివరి క్షణంలో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీలోకి తీసుకుని ఒకవేళ టికెట్‌ కేటాయిస్తే పరిణామాలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2023-09-22T16:00:21+05:30 IST