బీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2023-03-26T00:39:01+05:30 IST

ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.

బీఆర్‌ఎస్‌లో వర్గ విభేదాలు
మాజీ కార్పొరేటర్‌ను తీసుకెళ్తున్న పోలీసులు

మాజీ కార్పొరేటర్‌ పై దాడి..

ఎమ్మెల్యే ప్రమేయంతోనే : సామ

సంబంధం లేదు : సుధీర్‌రెడ్డి

వనస్థలిపురం, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం సందర్భంగా నియోజకవర్గ బీఆర్‌ఎ్‌సలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తుండగానే ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిపై మాజీ కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఎమ్మెల్యే అనుచరులుగా భావిస్తున్న కొందరు మాజీ కార్పొరేటర్‌పై దాడి చేసే వరకు వెళ్లింది. శనివారం సాయంత్రం ఎల్‌బీనగర్‌లో ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవానికి కేటీఆర్‌ హాజరయ్యారు. మంత్రి ప్రసంగిస్తున్న క్రమంలో హస్తినాపురం కార్పొరేటర్‌ సుజాతానాయక్‌ వచ్చారు. అప్పటికే సామ రమణారెడ్డి వేదిక వెనక సీట్లలో కూర్చొని ఉన్నారు. కార్పొరేటర్‌ రావడంతో లేచి సీటు ఇచ్చారు. కార్పొరేటర్‌ ముందే ఆయన నిలబడడంతో సుజాతనా యక్‌ పక్కకు జరగమని చెప్పారు. ఈ మాట విన్న సుధీర్‌రెడ్డి కూడా పక్కకు జరగమని రమణారెడ్డికి చెప్పారు. ఈ క్రమంలో ఆగ్రహించిన రమణారెడ్డి.. ఎమ్మెల్యేను దూషించడం మొదలుపెట్టారు. అక్కడే ఉన్న మాజీ కార్పొరేటర్లు వారిస్తున్న క్రమంలోనే కేటీఆర్‌ కూడా రమణారెడ్డిని పక్కన కూర్చోమంటూ చెప్పారు. కార్యక్రమం జరుగుతుండగానే వెనుక వైపు నుంచి కిందకు దిగిన రమణారెడ్డిపై కొందరు దాడి చేశారు. పోలీసులు దాడి చేస్తున్న వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని రమణారెడ్డి ఆరోపించారు. విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. రమణారెడ్డిని పోలీసులు వారించి.. బీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్‌ కారులో ఎక్కించి పంపించారు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దాడితో తనకు సంబంధం లేదని తెలిపారు. అంతటా ఉన్నట్లే ఎల్‌బీనగర్‌లో కూడా తమ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Updated Date - 2023-03-26T00:39:01+05:30 IST