పిల్లలకు విషమిచ్చి చంపి.. దంపతుల బలవన్మరణం!

ABN , First Publish Date - 2023-03-26T02:36:36+05:30 IST

ఇద్దరు పిల్లల అనారోగ్యం.. చూపించినా నయమవడం లేదన్న ఆవేదనతో ఆ దంపతులు తీవ్ర నిర్ణయమే తీసుకున్నారు. చిన్నారులకు విషమిచ్చి చంపి..

పిల్లలకు విషమిచ్చి చంపి.. దంపతుల బలవన్మరణం!

కుమారులకు అనారోగ్య సమస్యలు.. ఆ ఆవేదనతోనే ఆత్మహత్య.. కుషాయిగూడలో విషాదం

ఏఎ్‌సరావునగర్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఇద్దరు పిల్లల అనారోగ్యం.. చూపించినా నయమవడం లేదన్న ఆవేదనతో ఆ దంపతులు తీవ్ర నిర్ణయమే తీసుకున్నారు. చిన్నారులకు విషమిచ్చి చంపి.. అనంతరం భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌ కుషాయిగూడలో జరిగింది. ‘మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ప్రశాంతంగా చావనివ్వండి.. మమ్మల్ని ఎవరూ బతికించే ప్రయత్నం చేయొద్దు’ అని రాసివున్న నోట్‌ బంధువులు, స్థానికులను కన్నీళ్లు పెట్టిస్తోంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన గాదే సతీశ్‌ (39)కు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన వేద(35)తో పదకొండేళ్ల క్రితం పెళ్లయింది. సతీశ్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. వేద గృహిణి. ఈ దంపతులకు కుమారులు నిషికేత్‌((9), నిహాల్‌(5) ఉన్నారు. ఈ కుటుంబం, కందిగూడ చౌరస్తాలోని క్రాంతి పార్క్‌ రాయల్‌ అపార్టుమెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. నిషికేత్‌ సైనిక్‌పురిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు. చిన్న కుమారుడు నిహాల్‌ పుట్టుకతో ఆర్టిజం (బుద్ధి మాంద్యం)తో బాధపడుతున్నాడు. అదే ప్రాంతంలోని ఆర్టిజం స్కూల్‌కు వెళుతున్నాడు.

నిషికేత్‌కు కూడా రెండు నెలల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించారు. మెదడు సంబంధిత వ్యాధితో నిషికేత్‌కు చెముడు వచ్చినట్లు వైద్యులు తేల్చారు. పిల్లల పరిస్థితి రానురానూ సతీశ్‌, వేదను కృంగదీసింది. వీరి స్థితిని గమనించి బంధువులు ఎంతో దైర్యం చెప్పారు. అయితే కన్న బిడ్డలు పడుతున్న కష్టాన్ని చూడలేక కలిసికట్టుగా చనిపోవాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం పిల్లలకు పోటాషియం సైనెడ్‌ ద్రావణం కలిపిన పాలు తాగించి, అనంతరం వారూ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శనివారం ఫోన్‌ చేసినా తీయకపోవడంతో అనుమానమొచ్చిన బంధువులు, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారిని అప్రమత్తం చేశారు. వారు ఫ్లాట్‌కు వెళ్లి కిటికీలోంచి చూసే సరికి నలుగురూ బెడ్‌రూంలో విగతజీవులుగా పడివున్నారు. కాగా, పిల్లల అనారోగ్యంతో అల్లుడు సతీశ్‌, కుమార్తె తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని వేద తండ్రి శ్రీశైలం చెప్పారు. వారికి అండగా ఉంటామని, ఖర్చు గురించి ఆలోచించవద్దని చెప్పినా ఇంతటి తీవ్ర నిర్ణయం తీసుకున్నారని వాపోయారు.

Updated Date - 2023-03-26T02:36:36+05:30 IST