హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు

ABN , First Publish Date - 2023-10-10T03:51:41+05:30 IST

ఎన్నికల వేళ హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు

జోన్లను మార్చాలంటూ పెద్దఎత్తున దరఖాస్తులు

ఎన్నికల దృష్ట్యా ఏకకాలంలో అనుమతులిచ్చిన ప్రభుత్వం

ఓపెన్‌ స్పేస్‌తోపాటు పలు జోన్ల మారుస్తూ నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల వేళ హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రియల్టర్లు, డెవలపర్లు తమ భూములను వివిధ జోన్లకు మార్పు చేయాలంటూ ప్రభుత్వానికి పెట్టుకున్న దరఖాస్తులకు ఏకకాలంలోనే అనుమతులు వచ్చేశాయి. దాంతో హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించిన వివిధ జోన్లను మార్పు చేస్తూ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో ఓపెన్‌ స్పేస్‌ జోన్‌ను కూడా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. స్థానిక ప్రజల అవసరాల అనుగుణంగా నిర్ణయించిన ఓపెన్‌ స్పేస్‌ జోన్‌ను తొలగించడంపై పలువురు స్థానికులు, పర్యావరణ వేత్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన పట్టణాభివృద్ధికి ఓపెన్‌ స్పేస్‌ కూడా అవసరమని, మాస్టర్‌ప్లాన్‌లో కొంత ప్రాంతాన్ని ఈ జోన్‌గా నిర్ణయిస్తే దాన్ని కూడా కాలరాయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలు మెరుగైన అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌-2031 ఏర్పాటు చేసింది. హెచ్‌ఎండీఏ విస్తరించి ఉన్న 7257కిలోమీటర్ల పరిధిలోని ఏడు జిల్లాలు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజిగిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి జిల్లాల్లోని 70 మండలాల్లోని ప్రతీ సర్వే నెంబర్‌ను మాస్టర్‌ప్లాన్‌లో ఓ జోన్‌ కింద నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో వ్యవసాయ(కన్జర్వేషన్‌) జోన్‌, రెసిడెన్షియల్‌ జోన్‌, కమర్షియల్‌ జోన్‌, మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌, బయో కన్జర్వేషన్‌ జోన్‌, ఓపెన్‌ స్పేస్‌ జోన్‌, రీక్రియేషన్‌ జోన్‌.. ఇలా 11 జోన్లలో 21 రకాలుగా విభజించారు. మాస్టర్‌ప్లాన్‌-2031లో ఏ జోన్‌ కింద నిర్ణయించారో ఆ ప్రకారంగానే సంబంధిత సర్వే నెంబర్‌లో గల స్థలాన్ని వినియోగించాల్సి ఉంటుంది. మాస్టర్‌ప్లాన్‌ను స్థానిక ప్రజల అవసరాలకు అనుగుణంగా జోన్‌ మార్పును సంబంధిత శాఖ మంత్రి ఆమోదం ప్రకారం చేసుకోవచ్చనే నిబంధన కూడా ఉంది. ఇందుకోసం ఛేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌ (సీఎల్‌యూ)లో దరఖాస్తు చేస్తే సంబంధిత శాఖ మంత్రి మార్పు చేస్తారు. అయితే ఇటీవల హెచ్‌ఎండీఏకు వచ్చిన సీఎల్‌యూ దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున పరిష్కారం చేసింది. గడిచిన ఆరు నెలల్లో వందకు పైగా సీఎల్‌యూ దరఖాస్తులను పరిష్కారం చేసినట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైతే సంబంధిత దరఖాస్తులను ఆమోదించడానికి అవకాశం లేదు. దాంతో నిర్ణీత గడువులోపే సీఎల్‌యూ దరఖాస్తులు పరిష్కారమైన్నట్లు సమాచారం. ఆ మేరకు హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌లో నిర్ణయించిన వివిధ జోన్లను మార్పు చేస్తూ హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్లు వేసింది. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఎకరం, శేరిలింగంపల్లిలోని ఖాన్‌మెట్‌లో 2500 చ.గ., సరూర్‌నగర్‌ మండలం కర్మన్‌ఘాట్‌లోని 2 వేల చ.గ., జూబ్లీహిల్స్‌లో 1953 చ.గ., ఉప్పల్‌ మండలం బండ్లగూడలో గల 1682చ.గ., సిద్ధిపేట జిల్లా ములుగు మండలం కొక్కొండలోని 32 ఎకరాల భూమిని ఆయఆ జోన్‌ల నుంచి వేరే జోన్‌కు మార్చారు.

Updated Date - 2023-10-10T03:51:41+05:30 IST