వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

ABN , First Publish Date - 2023-01-26T02:47:02+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు.

వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాశ్‌రెడ్డికి మళ్లీ సీబీఐ నోటీసులు

28న హైదరాబాద్‌లో విచారణకు రావాలని ఆదేశం

కడప, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డికి సీబీఐ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. శనివారం (28వ తేదీ) ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో సీబీఐ అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని అవినాశ్‌రెడ్డి ఇంటికొచ్చారు. అప్పటికి ఆయన ఇంట్లో లేరు. వాహనాలు ఇంటి బయటే ఆపి లోపలకు వెళ్లి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు. అనంతరం వివేకా ఇంటి పరిసరాలను పరిశీలించారు. తర్వాత కడపకు బయలుదేరి వెళ్లారు. గత సోమవారం మధ్యాహ్నం సైతం అవినాశ్‌రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వారు పులివెందుల రావడం.. అప్పుడూ ఆయన ఇంట్లో లేకపోవడం.. దాంతో ఆయన పీఏ రాఘవరెడ్డికి నోటీసులిచ్చి వెళ్లడం.. మంగళవారం 11 గంటలకు హైదరాబాద్‌లో విచారణకు రావాలని సూచించడం.. ముందస్తుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉన్నందున రాలేనని ఆయన జవాబివ్వడం.. ఐదు రోజులు గడువు అడగడం తెలిసిందే. మళ్లీ నోటీసు ఇస్తే విచారణకు వెళ్తానని, సీబీఐ ప్రశ్నలకు సమాధానమిస్తానని గండి పర్యటన సందర్భంగా ఆయన మీడియాకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు బుధవారం పులివెందుల చేరుకుని మళ్లీ నోటీసులిచ్చారు.

Updated Date - 2023-01-26T02:47:02+05:30 IST