Group-1 Prelims : సులువే.. కానీ!

ABN , First Publish Date - 2023-06-12T03:26:30+05:30 IST

గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం సాఫీగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది.

Group-1 Prelims : సులువే.. కానీ!

తెలంగాణ అంశాలకు ప్రాధాన్యం లేదు

కరెంట్‌ అఫైర్స్‌లో ప్రశ్నలు పాత డేటాపైనే

సబ్జెక్టులవారీగా లోపించిన సమతుల్యత

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంపై అభ్యర్థులు

గత ప్రశ్నపత్రంతో పోల్చి చూస్తున్న వైనం

సాఫీగా ముగిసిన పరీక్ష.. 61ు హాజరు

ఈ సారి కటాఫ్‌ 75-85 మధ్యలో?

గ్రూప్‌-1 అభ్యర్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

ఓఎంఆర్‌ షీట్‌పై హాల్‌టికెట్‌ నంబర్‌

తప్పుగా వేయడంతో మనస్తాపం..

ప్రశ్నపత్రం ఇవ్వకముందే 10:15కే

పరీక్ష కేంద్రం నుంచి బయటకు

అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌\ హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఆదివారం సాఫీగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. టీఎ్‌సపీఎస్సీలో లీకేజీ వ్యవహారం కారణంగా ప్రిలిమ్స్‌ పరీక్షను మళ్లీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. నిబంధలను కఠినంగా అమలు చేశారు. షూ, బెల్టులను కూడా బయటే విప్పేయించారు. ఆభరణాలు ధరించిన మహిళా అభ్యర్థులను అనుమతించలేదు. అయితే, గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు. ఇదిలా ఉండగా, ఈసారి ప్రిలిమ్స్‌ ప్రశ్నలు ఇంతకుముందుతో పోలిస్తే కొంత సులభంగా, చిన్నగానే ఉన్నప్పటికీ, సబ్జెక్టుల వారీగా ప్రశ్నల కూర్పు సరిగ్గా లేదని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు. స్థానిక అంశాలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. సబ్జెక్టుల మధ్య సమతుల్యత లోపించిందన్నారు. కరెంట్‌ అఫైర్స్‌ సెక్షన్‌ అత్యధికంగా 22 ప్రశ్నలు వచ్చాయి. అయితే ఇందులో చాలావరకు పాత అంశాలపైనే అడిగారు. దీంతో చాలా మంది సరైన సమాధానాలు గుర్తించలేకపోయారు. ఫలితంగా ఈ సారి కూడా కటాఫ్‌ గతంలో మాదిరే ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, కొన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులకు ముందర బల్లలను ఏర్పాటు చేయలేదు. దీంతో వారు కుర్చీలపైనే చిన్న ప్యాడ్‌లను ఉపయోగించి పరీక్ష రాయాల్సి వచ్చింది.

Untitled-7.jpg

ప్రామాణికత లేని ప్రశ్నపత్రం

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రంలో సబ్జెక్టుల వారీగా ప్రశ్నల కూర్పు సమతులంగా లేదని పోటీ పరీక్షల నిపుణుడు రియాజ్‌ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా తెలంగాణ ఆర్థిక, సామాజిక అంశాలు, రాజ్యాంగ అంశాలను విస్మరించారని ఆయన తెలిపారు. కరెంట్‌ అఫైర్స్‌లో పాత డేటా నుంచి ప్రశ్నలు రావడంతో అభ్యర్థులు అస్పష్టతకు గురయ్యారని చెప్పారు. కటాఫ్‌ 80-85 మార్కుల మధ్య ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ప్రశ్నపత్రం కన్నా గత ప్రశ్నపత్రమే మెరుగ్గా తయారు చేశారని రియాజ్‌ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు పరీక్షల్లోనైనా సిలబస్‌ ప్రాతిపదికగా ప్రశ్నలు రూపొందించాలని ఆయన కోరారు.

‘గ్రూప్‌-1’ అభ్యర్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు

సిద్దిపేట క్రైం: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థిపై మాల్‌ ప్రాక్టీస్‌ కేసు నమోదు చేసినట్టు సిద్దిపేట కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తెలిపారు. సిద్దిపేట అర్బన్‌ మండలం బక్రిచెప్యాల గ్రామానికి చెందిన ప్రశాంత్‌ ప్రశ్నపత్రం ఇవ్వకముందే ఉదయం 10.15 గంటలకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు రావడంతో అరెస్టు చేశామని చెప్పారు. సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసిన ప్రశాంత్‌.. ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌ టికెట్‌ నంబరును తప్పుగా నమోదు చేశాడు. దీంతో తాను పరీక్ష రాసినా మార్కులు పడవనే ఉద్దేశంతో ఒంటి గంట వరకు పరీక్ష కేంద్రలో ఉండకుండా బయటకు వచ్చాడు. గమనించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Updated Date - 2023-06-12T03:37:29+05:30 IST