పాత మంచానికి రంగువేసి ఇస్తారా? పెళ్లి రద్దు చేసిన వరుడిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2023-02-21T01:33:01+05:30 IST

పాత మంచానికి రంగు వేసి కానుకగా ఇస్తారా అంటూ ఓ వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వధువు తరఫువారు ఎంత బతిమలాడినా ససేమిరా అన్నాడు. చివరికి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించినా వినకపోవడంతో అతనిపై కేసు నమోదైంది.

పాత మంచానికి రంగువేసి ఇస్తారా?    పెళ్లి రద్దు చేసిన వరుడిపై కేసు నమోదు

మదీన, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : పాత మంచానికి రంగు వేసి కానుకగా ఇస్తారా అంటూ ఓ వరుడు తన పెళ్లిని రద్దు చేసుకున్నాడు. వధువు తరఫువారు ఎంత బతిమలాడినా ససేమిరా అన్నాడు. చివరికి పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కి పోలీసులతో కౌన్సెలింగ్‌ ఇప్పించినా వినకపోవడంతో అతనిపై కేసు నమోదైంది. చాంద్రాయణగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్‌ఐ శేఖర్‌ తెలిపిన వివరాలిలా ప్రకారం.. పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అలీమ్‌ చిన్న కుమార్తె కు రెండో వివాహం కోసం సంబంధాలు వెతికారు. మౌలాలీకి చెందిన బస్‌ డ్రైవర్‌ జకరియా(29)తో సంబంధం కుదురి వివాహం నిశ్చయమైంది. ఈనెల 13న నిశ్చితార్థం జరిగింది. అతనికి కూడా ఇది రెండో వివాహమే. 19వ తేదీ (ఆదివారం) పెళ్లి. అమ్మాయికి మొదటి పెళ్లి సమయంలో ఇచ్చిన గృహోపకరణ వస్తువులనే ఇస్తామని వధువు తండ్రి చెప్పారు. అయితే, మంచం మాత్రం కొత్తది ఇవ్వాలని వరుడు షరతు పెట్టాడు. ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఒకరోజు ముందుగా అల్మారా, మంచం, పరుపు, డ్రెస్సింగ్‌ టేబుల్‌ ఇతర గృహోపకరణ వస్తువులను వరుడి ఇంటికి పంపించారు. మంచం ఫిట్‌ చేస్తుండగా విరిగిపోయింది. దీంతో వరుడి తరఫున బంధువులు కోపంతో వధువు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకున్నారు. కొత్త మంచం ఇవ్వమంటే పాత మంచానికి రంగులు వేసి పంపిస్తారా... ఈ పెళ్లి జరగదని వరుడు అలకబూనాడు. అప్పటికే, బంధుమిత్రులందరు చేరుకున్నారు. ‘ఈ సమయంలో పెళ్లి రద్దు అంటే ఎలా’ అని బతిమాలినా వరుడు వినలేదు. దీంతో వధువు తండ్రి చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇరు పక్షాలను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోవడంతో వరుడిపై 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-02-21T01:33:03+05:30 IST