దశాబ్ది ‘ఉత్సవం’ ఉద్యోగికి ఉంటుందా?

ABN , First Publish Date - 2023-06-02T02:48:42+05:30 IST

‘‘మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం..’’ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు గొప్పగా చెప్పే మాట. వాస్తవంలో చూస్తే మాత్రం సమస్యల మోత.

దశాబ్ది ‘ఉత్సవం’ ఉద్యోగికి ఉంటుందా?

డిమాండ్లు నెరవేరక వారిలో తీవ్ర అసంతృప్తి

ఆరోగ్య బిల్లులు రూ.లక్షల్లో.. సుదీర్ఘ పెండింగ్‌

6 నెలల తర్వాత.. అదీ లంచాలతో మంజూరు

3 డీఏలు బకాయి.. ఒక్కటిచ్చినా అదే పదివేలు

ఇప్పటికే క్రమంతప్పిన జీతాల విడుదల

ఇక కొత్త పీఆర్సీ నియామకం సంగతేంటో?

విన్నవించినా మోక్షం లేని హెల్త్‌కార్డులు

మరీ ముఖ్యంగా టీచరు వర్గంలో ఆగ్రహం

అవతరణ దినోత్సవాన సీఎం ప్రకటనపై ఆశలు

ఉత్సవాలకు రావాల్సిందే.. లేదంటే చర్యలు

ఒక్కో హెచ్‌వోడీ నుంచి వందల్లో తరలింపు

హైదరాబాద్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): ‘‘మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం..’’ ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు గొప్పగా చెప్పే మాట. వాస్తవంలో చూస్తే మాత్రం సమస్యల మోత. ఒకటో తేదీన జీతం పడదు.. అసలు ఏ తేదీన ఇస్తుందో కచ్చితంగా చెప్పలేం.. ఆరోగ్య కార్డులకు అతీగతీ లేదు.. రోగమొచ్చి చికిత్సకు సొంత జేబు నుంచి ఖర్చు పెడితే.. ఆ బిల్లులేమో అమ్యామ్యా ఇస్తే తప్ప ఆర్నెల్లకు గానీ మంజూరు కావు.. వేతన సవరణ సంఘం గడువు ముగియనున్నా కొత్తది ఏర్పాటు ఊసే లేదు.. కరువు భత్యాలేమో ఒకటికి మూడు బకాయి..! ఇవన్నీ ఇలా ఉంటే ఇదీ తాము సాధించిన ప్రగతి అంటూ రాష్ట్ర ప్రభుత్వం బడాయి పోతోంది. అదే పనిగా ప్రచారం చేసుకుంటూ గొప్పలు చెప్పుకొంటోంది. ఎడాపెడా ప్రకటనలతో ఇతర రాష్ట్రాల్లోనూ ఊదరగొడుతోంది. ఎన్నికల ముం గిట రాజకీయ లబ్ధి కోసం హడావుడి చేస్తోంది. దీన్నిచూసి ఉద్యోగుల కడుపు మండుతోంది. కనీసం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగానైనా సీఎం కేసీఆర్‌ నోటి నుంచి డిమాండ్ల పరిష్కారంపై ఓ మాట కోరుకుంటోంది. దశాబ్ది ఉత్సవాలు తమకూ ఉత్సవంగా మారతాయని ఆశలు పెట్టుకుంది.

ప్రధాన సమస్యల్లో ఒకటైనా తీరుస్తారా?

రాష్ట్రం ఆవిర్భవించి పదో ఏట అడుగుపెడుతున్న వేళ నిర్వహిస్తున్న వేదికపై నుంచి సీఎం కేసీఆర్‌ తమ మూడు ప్రధాన సమస్యల్లో కనీసం ఒకటైనా తీరుస్తారా? అని ఉద్యోగ లోకం ఎదురుచూస్తోంది. వాస్తవానికి ఉద్యోగుల సమస్యలు చాలా పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరి నెలలవుతోంది. ముఖ్యంగా వేతనాల పెంపునకు ఇప్పటివరకు ప్రభుత్వం పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్‌సీ)ను నియమించలేదు. ప్రస్తుతం అమల్లో ఉన్న మొదటి పీఆర్సీ కాలం జూన్‌ 30తో ముగియనుంది. జూలై 1 నుంచి కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్‌ అమల్లోకి రావాల్సి ఉంది. అలా కావాలంటే ముందుగానే పీఆర్సీని నియమించాల్సి ఉంది. కానీ, సమయం దగ్గర పడుతున్నా ఇప్పటివరకు పీఆర్సీ నియామక ప్రస్తావన లేదు. అవతరణ దినోత్సవాన సీఎం కేసీఆర్‌ కొత్త పీఆర్సీ ప్రకటన చేస్తారేమోనని ఉద్యోగులు ఆశపడుతున్నారు. కాగా, పీఆర్సీని ఏర్పాటు చేయాలంటూ ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖ సీఎం కార్యాలయానికి ఫైలును పంపించాయి.

కరువు భత్యాలు.. బకాయిలు

ఉద్యోగులకు ప్రస్తుతం మూడు కరువు భత్యాలు (డీఏ) పెండింగ్‌లో ఉన్నాయి. 01.01.2022, 01.07.2022, 01.01.2023కు సంబంధించిన డీఏలు రావాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్నాయి. అన్నిటికి మించి హెల్త్‌ కార్డుల జారీ సమస్య పరిష్కారానికి నోచడం లేదు. ఆస్పత్రుల్లో చికిత్సలకు ‘ఉద్యోగ ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎ్‌స)’ అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మూల వేతనాల నుంచి ఒక శాతం సొమ్మును కార్పస్‌ ఫండ్‌కు జమ చేస్తామని గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం, రెండు శాతాన్ని జమ చేస్తామని నాన్‌-గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ప్రకటించాయి. ఉద్యోగ సంఘాల నేతలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును రెండు, మూడుసార్లు కలిసి ఈహెచ్‌ఎ్‌స అమలుకు విజ్ఞప్తి చేశాయి. మంత్రి సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు పురోగతి లేదు. అవతరణ దినోత్సవంలోనైనా సీఎం ఈహెచ్‌ఎ్‌సను ప్రకటిస్తారా? అని ఉద్యోగ సంఘాలు ఆశ పడుతున్నాయి. కాగా, ఉద్యోగుల వైద్య చికిత్స బిల్లులు ఆరేడు నెలలుగా రూ.లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని డబ్బులిస్తేనే మంజూరు చేసే పరిస్థితి. ఈ దుస్థితి మారాలని ఉద్యోగ వర్గాలు కోరుకుంటున్నాయి.

ఇకనైనా ఠంచనుగా జీతాలిస్తారా..?

ఒకటనే కాదు.. పలు విషయాల్లో ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగుల్లో తీవ్ర అంశాతి, అసహనం నెలకొన్నాయి. అసలే మూడేసి డీఏలను పెండింగ్‌లో ఉంచిందంటే.. జీతాలు ఆలస్యంగా ఇస్తూ సహనాన్ని పరీక్షిస్తోంది. 31న మంజూరు చేయాల్సిన జీతాలను.. దశలవారీగా ఐదారు తేదీల దాకా ఇస్తూ పోతోంది. ఈ ఆలస్యంపై ఉద్యోగులు కోపంతో ఉన్నారు. ‘‘ఇప్పటివరకు సరే.. ఇకపై ఎప్పటినుంచి 1వ తేదీన చెల్లిస్తారు...?’’ అనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. సమస్యలపై ముఖ్యంగా ఉపాధ్యాయ వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. వారికి వేతనాలు, డీఏలే కాదు. కనీసం బదిలీలూ లేవు. ప్రమోషన్లు అసలే లేవు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఉద్యోగులను సంతృప్తి పర్చాలంటే ప్రభుత్వం ఏదో ఒక సమస్యను పరిష్కరిస్తుందన్న చర్చ జరుగుతోంది. పైగా త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలను మచ్చిక చేసుకోవాలన్న ఆలోచన అధికార పార్టీకి ఉంది. అందుకే డీఏలపైనైనా స్పష్టతనిస్తుందని భావిస్తున్నారు.

సచివాలయంలో ఉత్సవాలకు రాకుంటే కష్టాలే

సచివాలయంలో దశాబ్ది ఉత్సవాలు.. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లలోని పభుత్వ ఉద్యోగులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఉత్సవాలకు తప్పనిసరిగా రావాలంటూ ఉన్నతాధికారులు హుకుం జారీ చేయంతో వారిలో ఆందోళన నెలకొంది. పొరపాటున రాకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని హడలిపోతున్నారు. జంట నగరాల్లో ఉన్న అన్ని శాఖల విభాగాధిపతుల (హెచ్‌వోడీ) కార్యాలయాల సిబ్బంది హాజరు కావాలని ఆదేశించింది. ఒక్కో హెచ్‌వోడీ కింద ఎంతమంది ఉంటే అంతమంది రావాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదాహరణకు వైద్య ఆరోగ్య శాఖ హెచ్‌వోడీ కింద 650 మంది ఉన్నారు. వీరందరూ సచివాలయానికి రావాల్సిందేనంటూ ఆదేశించారు. అన్ని శాఖల హెచ్‌వోడీలదీ ఇదే దారి. ఒక హెచ్‌వోడీ కింద 500 మంది, మరొకరి కింద 100 మంది.. ఇలా ప్రతి హెచ్‌వోడీ కింద ఎంతో కొంతమంది పనిచేస్తున్నారు. వీరు తమ కార్యాలయంలో ఉదయం 7.30కు పతాకావిష్కరణకు తప్పకుండా హాజరు కావాలి. అనంతరం హుటాహుటిన సచివాలయానికి ఉదయం 9 గంటల కల్లా చేరుకోవాలి. కేటాయించిన సీట్లలో 9.30 గంటలకల్లా కూర్చోవాలంటూ హెచ్‌వోడీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలిచ్చారు. ఐడీ, ఇన్విటేషన్‌ కార్డులు కచ్చితం చేశారు. లేదంటే లోనికి అనుమతించరు. హెచ్‌వోడీల నుంచి సచివాలయానికి ఉద్యోగులను తరలించడానికి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. చిత్రమేమంటే.. రెండు కార్యక్రమాలకు హాజరైన తర్వాత మళ్లీ యథావిధిగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.. అంటే.. అవతరణ దినోత్సవాన సెలవు లేదన్నమాట. ఇది ఇబ్బందికరమని ఉద్యోగులు వాపోతున్నారు.

Updated Date - 2023-06-02T02:48:42+05:30 IST