ఖమ్మం ‘మున్నేరు’పై కేబుల్ బ్రిడ్జి
ABN , First Publish Date - 2023-01-20T03:06:36+05:30 IST
ఖమ్మం వద్ద మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌లోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలోనే ఈ బ్రిడ్జి కూడా ఉండనుంది.
రూ.180 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి అజయ్
హైదరాబాద్, ఖమ్మం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : ఖమ్మం వద్ద మున్నేరుపై కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. హైదరాబాద్‌లోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి తరహాలోనే ఈ బ్రిడ్జి కూడా ఉండనుంది. మొత్తం 420 మీటర్ల పొడవైన బ్రిడ్జిలో 300 మీటర్ల తీగల వంతెన ఉండనుంది. ఈ నూతన వంతెన నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.180 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాసరాజు గురువారం జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి సీఎం కేసీఆర్‌ను స్వయంగా కలిసిన మంత్రి పువ్వాడ కృతజ్ఞతలు తెలియజేశారు. హామీ ఇచ్చిన 24గంటల్లోనే సీఎం తన మాట నిలబెట్టుకున్నారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అలాగే ఖమ్మం ఎంపీ, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరారవు కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.