బీఆర్‌ఎస్‌, ఆప్‌లు.. బీజేపీ బీ టీమ్‌లు

ABN , First Publish Date - 2023-01-18T03:50:20+05:30 IST

బీఆర్‌ఎస్‌, ఆప్‌లకు మధ్య తేడా ఏమీ లేదని, ఆ రెండు పార్టీలూ బీజేపీ బీ-టీమ్‌లేనని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌, ఆప్‌లు.. బీజేపీ బీ టీమ్‌లు

ఖమ్మం సభ ఖర్చు బీఆర్‌ఎస్‌ భరించాలి: ఉత్తమ్‌

22న నాగర్‌కర్నూలులో ఆత్మగౌరవ సభ: నాగం

హైదరాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌, ఆప్‌లకు మధ్య తేడా ఏమీ లేదని, ఆ రెండు పార్టీలూ బీజేపీ బీ-టీమ్‌లేనని కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. పంటకు గిట్టుబాటు ధర అడిగినందుకు ఖమ్మం జిల్లాకు చెందిన మిర్చి రైతులను కేసుల్లో ఇరికించిన సీఎం కేసీఆర్‌.. అదే ఖమ్మంలో బుధవారం తలపెట్టిన భారీ బహిరంగ సభలో ఆ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులపై పెట్టిన కేసులనూ ఉపసంహరించుకుంటామని ప్రకటించాలన్నారు. ఖమ్మం బహిరంగ సభకు సంబంధించి రవాణా, భద్రతతో సహా మొత్తం ఖర్చును బీఆర్‌ఎస్‌ పార్టీనే భరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఖర్చుపై గవర్నర్‌కు నివేదిక ఇస్తామని, అవసరమైతే ప్రజాధనం రికవరీ కోసం కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఈ నెల 22న నాగర్‌ కర్నూలులో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. మార్కండేయ ప్రాజక్టు సందర్శనకు వెళ్లిన తమపైన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ నేతలను చంపేసే ప్రయత్నమూ చేశారని ఆరోపించారు. తిరిగి తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారన్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టును జోనల్‌ పోస్టుగా మార్చాలని, ఆ తర్వాతనే ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను చేపట్టాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ నేత, టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎంకు లేఖ రాశారు.

Updated Date - 2023-01-18T03:50:22+05:30 IST