బిక్కుబిక్కుమంటూ...!

ABN , First Publish Date - 2023-05-07T03:06:11+05:30 IST

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో మూడు రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తెలుగు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

బిక్కుబిక్కుమంటూ...!

మణిపూర్‌లో తెలుగు విద్యార్థుల పరిస్థితి.. యూనివర్సిటీ క్యాంప్‌సలలోనే గజగజ

దగ్గర పడుతున్న రేషన్‌ సరుకులు.. పనిచేయని ఇంటర్‌నెట్‌

కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి విలపిస్తున్న విద్యార్థినులు

బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు

తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఇళ్లకు చేర్చాలని విజ్ఞప్తి

హైదరాబాద్‌ సిటీ/ బర్కత్‌పుర, మే 6 (ఆంధ్రజ్యోతి) : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ లో మూడు రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తెలుగు విద్యార్థులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపించి తమను ఇంటికి చేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మణిపూర్‌ రాజధాని ఇంపాల్‌లోని సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో 33 మంది తెలుగు విద్యార్థులు అగ్రికల్చర్‌ బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ చేస్తున్నారు. అలాగే అక్కడే ఉన్న నిట్‌లో 150 మంది ఇంజనీరింగ్‌ కోర్సులను అభ్యసిస్తున్నారు. అల్లర్లలో ఐటీశాఖ అధికారిని, సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను దుండగులు కాల్చి చంపారు. దీంతో మణిపూర్‌ ప్రభుత్వం ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులు జారీ చేయడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇంపాల్‌ సెంట్రల్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, నిట్‌ క్యాంపస్‌ సమీపంలో ఉండే గిరిజన గూడెంల నుంచి రాత్రివేళల్లో బాంబుల మోతలు, కాల్పుల శబ్దాలు వినిపిస్తుండడంతో విద్యార్థులు వణికిపోతున్నారు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీకి అనుకుని ఉన్న గేమ్‌ అనే గ్రామంలో ఈ ఘర్షణలు ఎక్కువగా ఉండడంతో అక్కడి విద్యార్థులు హడలిపోతున్నారు. గృహ దహనాలు జరుగుతుండడంతో కంటి మీద కునుకు లేకుండా జీవిస్తున్నారు. ఇంపాల్‌లోని నిట్‌లో తెలంగాణ నుంచి 50 మంది ఉండగా, ఏపీ నుంచి 100 మంది విద్యార్థులున్నారు. ఏపీ వారిలో 60 మంది వరకు బాలికలు ఉన్నారు.

క్యాంప్‌సలలో నానా అవస్థలు..

అల్లర్ల నేపథ్యంలో ఇటు అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, అటు నిట్‌ క్యాంప్‌సలో చదువుతున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి తీసుకెళ్తుండడంతో తాము ఒంటరి అవుతున్నామని తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజులుగా బయటకు వెళ్లలేక యూనివర్సిటీలోనే భయంగా గడుపుతున్నామని, అప్పులు చేసి విమాన టికెట్లను బుక్‌ చేసుకున్నా.. సెక్యూరిటీ లేనిదే విమానాశ్రయానికి వెళ్లే పరిస్థితి లేదని వాపోతున్నారు. నిట్‌ క్యాంప్‌సలోని వాటర్‌ ట్యాంకులో విషం కలిపారని వదంతులు వ్యాపించడంతో తాగునీటి సరఫరాను నిలిపివేశారని, పేర్లు నమోదు చేసుకుని హాస్టల్‌ అధికారులు రోజుకు ఒక వాటర్‌ బాటిల్‌ మాత్రమే ఇస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఇప్పటి వరకు భోజనం బాగానే పెడుతున్నారని, మరో రెండు, మూడు రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని చెబుతున్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని హనుమకొండకు చెందిన శ్రీరామ్‌ అనే విద్యార్థి కోరారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. అసోం, సిక్కిం, త్రిపుర ప్రభుత్వాలు ఇప్పటికే వారి విద్యార్థులను స్వస్థలాలకు తీసుకెళ్లాయి. ఇంటర్‌ నెట్‌ పనిచేయకపోవడంతో భారత ప్రభుత్వానికి మెయిల్‌ కూడా చేయలేకపోతున్నామని లెక్చరర్లు చెబుతున్నారు. రేషన్‌ సరుకులూ దగ్గర పడుతున్నాయని చెప్పారని విద్యార్థులు వాపోతున్నారు. తల్లిదండ్రులతో కేవలం వాయిస్‌ కాల్స్‌ మాత్రమే మాట్లాడుతున్నామని కొందరు చెప్పారు. నిట్‌ విద్యార్థులు భోజనం చేసేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం విమాన ఛార్జీలు రూ.20 నుంచి 30 వేలు ఉన్నాయని, సాధారణ రోజుల్లో 7 వేలు మాత్రమే ఉండేవని వాపోయారు.

Updated Date - 2023-05-07T03:06:11+05:30 IST