Bandi Sanjay: తెలంగాణలో ఒంటరిగానే పోటీ

ABN , First Publish Date - 2023-04-03T02:01:38+05:30 IST

తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు.

Bandi Sanjay: తెలంగాణలో   ఒంటరిగానే పోటీ

బీజేపీని అడ్డుకునేందుకు

బీఆర్‌ఎస్‌, హస్తం, లెఫ్ట్‌ జట్టు

నిజాం షుగర్స్‌ను తెరిపిస్తాం

గిరిజనులకు కేసీఆర్‌ ద్రోహం

ముర్మును ఓడించాలని

రూ.కోట్లు ఖర్చు పెట్టారు

బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి

ములుగు/చిక్కడపల్లి, ఏప్రిల్‌ 2: తెలంగాణలో సర్వేలన్నీ బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయని, వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. కమల దళాన్ని అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు ఏకమవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పొత్తుపై హస్తం పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. ములుగు జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బూత్‌ కమిటీ సభ్యుల సమ్మేళనంలో సంజయ్‌ మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే బిల్ట్‌, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ గిరిజన ద్రోహి అని సంజయ్‌ విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్‌తో ముడిపెడుతూ గిరిజన రిజర్వేషన్లపై జాప్యం చేస్తున్నారని.. దమ్ముంటే ప్రత్యేక ఆర్డినెన్స్‌ తెచ్చి రిజర్వేషన్లు పెంచాలని సవాల్‌ చేశారు. ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా గెలవకుండా కేసీఆర్‌ రూ.కోట్లు ఖర్చుచేశారని ఆరోపించారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో గిరిజనుల కోసం ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

దొంగసారా కేసులో బిడ్డను కాపాడేందుకు మంత్రులు, అధికారులను ఢిల్లీలో మోహరించిన ముఖ్యమంత్రి.. టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీక్‌పై ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీక్‌కు బాధ్యుడైన కేటీఆర్‌ను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. హిందూ పండగల సమయంలో పాత బస్తీలో ఆంక్షలు విధించే పోలీసులు.. రంజాన్‌ వేళ ఎందుకు సడలించారని ప్రశ్నించారు. అధికారంలో ఉండే పార్టీకి కొమ్ము కాసే ఒవైసీ.. పాతబస్తీని ఎందుకు మురికి కూపంగా మార్చారని ప్రశ్నించారు. బీజేపీ అధికారం చేపట్టగానే ఓల్డ్‌ సిటీని న్యూ సిటీగా అభివృద్ధి చేస్తామని సంజయ్‌ చెప్పారు. బలిదానాలు, త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేస్తోందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ సునీల్‌ బన్సల్‌ విమర్శించారు. బిల్ట్‌ ఫ్యాక్టరీ తెరిపించే విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానన్నారు.

అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీ: లక్ష్మణ్‌

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఎంపీ లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. టీఎ్‌సపీఎస్సీ కార్యాలయ ముట్టడి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన యువమోర్చా కార్యకర్తలతో ఆదివారం అశోక్‌నగర్‌లోని తన ఇంట్లో లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రశ్నపత్రాల లీక్‌తో 30 లక్షల మంది నిరుద్యోగులను నట్టేట ముంచారని మండిపడ్డారు. ప్రశ్నించిన 11 మంది యువ మోర్చా కార్యకర్తలను జైలుకు పంపడం అన్యాయమన్నారు.

Updated Date - 2023-04-03T02:01:38+05:30 IST