కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఉరేస్తా

ABN , First Publish Date - 2023-06-02T03:03:10+05:30 IST

‘‘బీఆర్‌ఎస్‌ నాయకులెవరైనా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ముందుగా వరంగల్‌ సీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలకు ఫిర్యాదు చేస్తాం.

కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడులు చేస్తే ఉరేస్తా

ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం

వారిపై చర్య తీసుకోకుంటే నేనే స్పందిస్తా

బీఆర్‌ఎస్‌ దాడులు చేస్తే సహించం

పాత ‘కొండా’లా మారేలా చేయొద్దు

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వ్యాఖ్యలు

వరంగల్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ‘‘బీఆర్‌ఎస్‌ నాయకులెవరైనా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడితే ముందుగా వరంగల్‌ సీపీ, ఏసీపీ, సీఐ, ఎస్సైలకు ఫిర్యాదు చేస్తాం. పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోనిపక్షంలో.. దాడులు చేసిన వారిని క్రేన్‌కు ఉరి తీస్తాం’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి గ్రేటర్‌ వరంగల్‌ 18వ డివిజన్‌ గాంధీనగర్‌లో అయిత అరుణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో కొండా మురళీధర్‌ రావు సమక్షంలో పలువురు బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రె్‌సలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై బీఆర్‌ఎస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనకు ప్రస్తుతం పనేమీ లేదని, ఇంటిదగ్గరే ఉంటున్నానని, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలపై ఎలాంటి దాడులు జరిగినా తనకు చెప్పాలన్నారు. తాను పాత కొండా మురళిగా మారేలా వ్యవహరించవద్దని బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరించారు. ఎవరెవరో వచ్చి తాము మున్నూరు కాపులం అంటూ చుట్టరికం కలుపుకొంటున్నారని, అసలైన మున్నూరు కాపు పటేల్‌ను తానేనని పేర్కొన్నారు. కొండా సురేఖ వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని, ఇదే విషయమై మూడు నెలల క్రితం టీపీసీసీ చీఫ్‌ కూడా హామీ ఇచ్చారని తెలిపారు. తాము వరంగల్‌ విడిచి ఎక్కడికి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. .

హాట్‌టాపిక్‌గా కొండా వ్యాఖ్యలు

కొండా మురళీ చేసిన వ్యాఖ్యలు వరంగల్‌ జిల్లా కాంగ్రె్‌సలో హాట్‌ టాపిక్‌గా మారాయి. పార్టీకి చెందిన ఒకరిద్దరు నేతలు తాము పలానా నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటామంటూ ప్రచారం చేసుకుంటుండటం.. వారిపై మరో వర్గం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రె్‌సలో నెలకొన్న కుమ్ములాటలు బయటపడుతున్నాయి. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే టికెట్‌ కోసం వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ మంత్రి కొండా సురేఖ.. ఇరువురూ ప్రయత్నాలు చేసుకుంటుండగా, తాజాగా కొండా మురళి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Updated Date - 2023-06-02T03:03:10+05:30 IST