తెలుగు జాతి ఉన్నంతకాలం ఘంటసాల కీర్తి
ABN , First Publish Date - 2023-01-15T01:54:20+05:30 IST
ప్రజా శ్రేయస్సుకు కళను వినియోగించినప్పుడే కళాకారుడి జీవితం ధన్యమవుతుందని నిరూపించిన గొప్ప కళాకారుడు ఘంటసాల అని సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ.రమణ అభివర్ణించారు.
శతజయంతి ఉత్సవాల్లో మాజీ సీజే ఎన్వీ రమణ
రవీంద్రభారతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): ప్రజా శ్రేయస్సుకు కళను వినియోగించినప్పుడే కళాకారుడి జీవితం ధన్యమవుతుందని నిరూపించిన గొప్ప కళాకారుడు ఘంటసాల అని సుప్రీంకోర్టు మాజీ సీజే ఎన్వీ.రమణ అభివర్ణించారు. తెలుగు జాతి ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటారని, తన గాత్రంతో దాదాపు నాలుగు తరాల ప్రజలకు సరైన తెలుగు ఉచ్ఛారణ నేర్పిన ఆయనకు తెలుగు జాతి రుణపడి ఉంటుందని అన్నారు. రవీంద్రభారతిలో ఘంటసాల కుటుంబసభ్యులు, కళా ప్రదర్శిని సంయుక్త ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసురావు సాలూరికి ఘంటసాల జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్వీ రమణ పురస్కారగ్రహీతను సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, అంతులేని పేదరికం, కష్టనష్టాల నడుమ అకుంఠిత దీక్షతో ఘంటసాల చేసిన సంగీత సాధన ఇతరుల ఊహకు అందనిది అన్నారు. కష్టకాలంలో తనను ఆదుకున్న వారిని ఆయన ఎప్పుడూ మర్చిపోలేదని, ఆఖరికి తొలిభిక్ష వేసిన మహిళ ఎవరో తెలియకున్నా తన పాటలో గుర్తుచేసుకున్నారని తెలిపారు. ఆయన కళాకారుడు, గాయకుడే కాదు గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడని తెలియజేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 18 నెలల జైలుశిక్ష అనుభవించారని గుర్తుచేశారు. ఆధునిక సమాజానికి బాటలు వేసిన కందుకూరి, గురజాడల స్ఫూర్తితో తెలుగు సాహిత్యం, చలన చిత్ర రంగంలో సామాజిక బాధ్యత నెరవేర్చారని అన్నారు. ఘంటసాల కళాకారుడే కాదు గొప్ప సమాజసేవకుడని ఎన్టీఆర్ అన్నారని గుర్తుచేశారు. నాటి రోజులు తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం వంటివని అన్నారు. నేటి సినీ సాహిత్యం ఒక కాలుష్యం బారిన పడిందని, అది వాయు కాలుష్యంకంటే ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాన్ని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత సినిమా రంగంపై ఉందని అన్నారు. దీని కోసం దర్శక, నిర్మాతలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.