మోదీ పాలనలో అద్భుత ప్రగతి:కిషన్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-06-07T04:41:54+05:30 IST
ప్రధాని మోదీ నాయకత్వంలో భారదేశం అద్భుత ప్రగతిని సాధిస్తోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు.
ఆమనగల్లు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ నాయకత్వంలో భారదేశం అద్భుత ప్రగతిని సాధిస్తోందని, బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పట్టణంలో బీజేపీ కార్యాలయ నూతన భవనాన్ని మంగళవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ భద్రత విషయంలో మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారని, దేశంలో తీవ్రవాదం, మతకల్లోలాలు తగ్గిపోయాయని చెప్పారు. తెలంగాణలో రూ.1.20 లక్షల కోట్ల నిధులతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి 31 జిల్లాలను అనుసంధానం చేసినట్లు తెలిపారు. కల్వకుంట్ల కుటుంబం నియంతృత్వ విధానాలతో అవినీతి పాలన సాగిస్తూ తెలంగాణను దోచుకుంటోందని ధ్వజమెత్తారు. కుటుంబ పాలన స్థానంలో ప్రజా ప్రభుత్వం రావాలని ఆకాంక్షిస్తున్న ప్రజలు.. వచ్చే ఎన్నికల్లో వారి పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.