Swapnalok incident: కొలువు ఆశలో కొడిగట్టి..
ABN , First Publish Date - 2023-03-18T03:42:55+05:30 IST
ఆ ఆరుగురు మారుమూల ప్రాంతాల్లోని కడు పేద కుటుంబాలకు చెందిన వారు! అంతా పాతికేళ్ల లోపువారే! ఉపాధి కోసం ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు.

స్వప్నలోక్ ఘటనలో మృతులు ఆరుగురూ నిరుపేద కుటుంబాలకు చెందినవారే
గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తి.. అంబులెన్స్‌ల్లో స్వస్థలాలకు తరలింపు
ప్రమాద ఘటనపై సీఎం దిగ్ర్భాంతి
రూ.5లక్షల చొప్పున పరిహారం
(ఆంఽధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): ఆ ఆరుగురు మారుమూల ప్రాంతాల్లోని కడు పేద కుటుంబాలకు చెందిన వారు! అంతా పాతికేళ్ల లోపువారే! ఉపాధి కోసం ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు. కూలీనాలీ చేసే తల్లిదండ్రులు తాహతుకుమించి అప్పు చేసి లక్షలు తెచ్చి చేతుల్లో పోస్తే వారి ఆశలను మోసుకుంటూ హైదరాబాద్‌కొచ్చి ఒక సంస్థలో చేరారు. అయితే విధి మరోలా తలచింది. ఆ ఆరుగురి ప్రాణాలను అగ్నికీలలకు బలి చేసి, కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది!! సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదంలో దుర్మరణం పాలైన ఉప్పల శివ (23), వంగ వెన్నెల (23), బానోతు శ్రావణి (23), జాటోత్ ప్రమీల (23), అమరాజు ప్రశాంత్ (23) కుంచం త్రివేణి (22) కుటుంబసభ్యులది రెక్కాడితే గానీ డొక్కాడని బతుకులు! పిల్లలు వృద్ధిలోకొస్తే తమ బతుకులు మారతాయనుకున్న కన్నవారి ఆశలన్నీ అడియాసలైపోయాయి. బాధిత కుటుంబాల్లో ఎవర్ని కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయి! గాంధీ మార్చురీ వద్ద మృతుల కుటుంబీకులు, బంధు, మిత్రుల రోదనలు మిన్నంటాయి. ఘటనకు కొద్ది ముందే కూతురు ఫోన్ చేసిందంటూ ఓ తల్లి.. తన ఒక్కగానొక్క కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఓ తండ్రి.. కొద్దిసేపటికి క్రితమే వాట్సా్‌పలో మెసేజ్ పెట్డాడంటూ ఓ మృతుడి తోబుట్టువు కంటికీమంటికి ధారగా రోదిస్తున్నారు. మృతుల్లో ఐదుగురు ఇంజనీరింగ్, ఒకరు డిగ్రీ చదివారు.
శిక్షణనిచ్చి తామే ఉద్యోగం ఇస్తామని చెప్పడంతో రూ.1.5 లక్షల నుంచి రూ.2.60 లక్షలు దాకా వెచ్చించి స్వప్నలోక్ కాంప్లెక్‌లోని చైన్ నెట్‌వర్క్ బిజినెస్ సంస్థ అయిన ‘క్యూ నెట్‌వర్క్’లో చేరారు. గురువారం స్వప్నలోక్‌లోని ఎనిమిదో అంతస్తులో మంటలు చెలరేగి.. ఐదో అంతస్తుకూ వ్యాపించాయి. అందులో ఉన్న ఐదుగురూ మంటలకు భయపడి.. ఓ గదిలో దాక్కుండిపోవడమే కొంపముంచింది. దట్టంగా వ్యాపించిన పొగను పీల్చడంతో ఆరుగురూ అపస్మారక స్థితిలోకి వెళ్లగా వారిలో ఐదుగురు, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. మృతుల్లో జాబోత్ ప్రమీల, అమరాజు ప్రశాంత్ మహబూబాబాద్ జిల్లా వాస్తవ్యులు! గూడూరు మండలం ఎర్రకుంటతండా జీపీ పరిధిలోని సురేశ్‌నగర్ తండాకు చెందిన ప్రమీల, భద్రు-బుజ్జి దంపతుల ఒక్కగానొక్క సంతానం. వ్యవసాయ కూలీలైన తల్లిదండ్రులు, ఆమెను కష్టపడి చదివించారు. ఇంటర్‌లో 985 మార్కులు సాధించిన ప్రమీల, కోదాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ పూర్తిచేసింది. నెలక్రితమే రూ.2.6లక్షలు చెల్లించి ‘క్యూ నెట్‌వర్క్’లో చేరింది. ఇదే జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన ప్రశాంత్‌ది వ్యవసాయ కుటుంబం. రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తిచేసి, ఆర్మీ దేహదారుఢ్య పరీక్షలకు ఎంపికయ్యాడు.
ఆర్మీ ఈవెంట్స్ పోటీల్లో కీలకమైన రన్నింగ్‌లో టాప్‌టెన్ ర్యాంకు సాధించాడు. అయితే ఆ పరీక్షలు రద్దవడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయుంది. 24 రోజుల క్రితమే ఓ వ్యక్తి చొరవతో రూ.2.60 లక్షలు వెచ్చించి ‘క్యూ నెట్‌వర్క్’లో చేరాడు. ఇక మృతుల్లో ముగ్గురు శివ, శ్రావణి, వెన్నెల వరంగల్ జిల్లా వాస్తవ్యులు. నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పుల రాజు-రజిత దంపతుల కుమారుడైన శివ, బీటెక్ చదివాడు. తండ్రి తాపీ మేస్త్రి. రెండేళ్ల క్రితం క్యూ నెట్‌వర్క్‌లో చే రి మార్కెటింగ్ చేస్తున్నాడు. దుగ్గొండి మండలం మర్రిపల్లికి చెందిన లక్ష్మి-రవి కుమార్తె వెన్నెల, ఇంజనీరింగ్ చదివింది. సికింద్రాబాద్‌లోని ఓ హాస్టల్లో ఉంటూ మూడేళ్లుగా క్యూనెట్‌వర్క్‌లో పనిచేస్తోంది. శిక్షణ కోసం రూ.1.5లక్షలు వెచ్చించింది. ఖానాపురం మండల కేంద్రానికి చెందిన నర్సింహా-రాంబాయి దంపతుల పెద్ద కూతురు శ్రావణి నెల క్రితమే నగరానికొచ్చింది. రూ.2.60 లక్షలు వెచ్చించి మౌలాలీలో ఉంటూ క్యూనెట్‌వర్క్‌లో శిక్షణ పొందుతోంది.
మృతుల కుటుంబాలను ఆదుకుంటాం: సీఎం
సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రులు మహమూద్‌అలీ, తలసానిని సీఎం ఆదేశించారు. కాగా ఇద్దరు మంత్రులూ గాంధీ మార్చురీకి వచ్చి పరిస్థితిని పర్యవేక్షించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను గ్రామాలకు తరలించేందుకు అంబులెన్స్‌లు ఏర్పాటు చేయించారు.
అక్క బలి.. చెల్లికి తప్పిన ప్రమాదం
ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు తోబుట్టువులూ క్యూ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్నారు. ఇద్దరిలో ఒకరు బలవగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లికి చెందిన రమణమ్మ-రామారావుకు త్రివేణి, మమత సంతానం. ఇద్దరూ బీటెక్ చేశారు. రూ.2లక్షల పైచిలుకు చెల్లించి క్యూ నెట్‌వర్క్‌లో శిక్షణకు చేరారు. అగ్ని ప్రమాదం సంభవించకముందే మమత భవనం నుంచి బయటకు రావడంతో ప్రమాదం తప్పింది. లోపలే ఉన్న త్రివేణి ప్రాణాలు విడిచింది. ‘నేను ఆ రోజు తొందరగా హాస్టల్‌కు వచ్చేశాను. రాత్రి ఏడు గంటల తర్వాత అక్క ఏడుస్తూ ఫోన్ చేసింది. ఆఫీసులో పొగలు వస్తున్నాయని, ఓ ఆరుగురం కలిసి వాష్‌రూంలో దాక్కున్నామని చెప్పింది. వెంటనే మేమంతా స్వప్నలోక్‌కు వెళ్లాం. అక్కడ ఉన్న ఫైర్ సిబ్బందికి ఐదో అంతస్తులోని వాష్‌రూంలో ఆరుగురు ఉన్నారని చెప్పాం. అప్పుడు వారంతా కాపాడేందుకు పైకి వెళ్లారు. కానీ వారిని కాపాడలేకపోయారు’ అని త్రివేణి చెల్లెలు మమత వాపోయింది.
పొగకన్నా భయంతోనే
అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో చుట్టుముట్టే దట్టమైన పొగ కన్నా నెలకొన్న భయాందోళనల (షాక్)తోనే ఆరుగురూ ప్రాణాలు విడిచారా? వైద్య నిపుణులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆక్సిజన్ ఆందుబాటులో ఉన్నట్లయితే స్వప్నలోక్ ఘటనలో ప్రాణ నష్టం జరిగేది కాదని చెబుతున్నారు. ప్రమాద సమయంలో ఆ ఆరుగురు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే సురక్షితంగా బయటపడేవారని అంటున్నారు. దట్టమైన పొగలో చిక్కుకుంటే గనక 5-10నిమిషాల కంటే మించి బతకలేరు. అదే.. సాధారణ స్థాయిలో పొగ అలుముకున్నప్పుడు 5నుంచి 6గంటల పాటు జీవించి ఉండే అవకాశం ఉంటుంది. పొగ తక్కువగా ఉనపుఉన్పడు వీలైనంత త్వరగా బాధితులున్న గదిలోకి ఆక్సిజన్‌ను పంపినట్లయితే, వారంతా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉండేది. ఆరుగరు ఉన్న గదిలోకి పైప్ ద్వారా నిమిషానికి 2లీటర్ల చొప్పున ఆక్సిజన్‌ను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రూ.14,400 ఖర్చవుతుంది. ఫైర్ సిబ్బంది ఈ తరహా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది.