ప్రకటనలు సరే... పరిహారమెప్పుడు?

ABN , First Publish Date - 2023-05-02T04:17:30+05:30 IST

సరిగ్గా పంటచేతికొచ్చే సమయంలో.. అకాల వర్షాల రూపంలో వచ్చి పడిన ప్రకృతి విపత్తుతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది.

ప్రకటనలు సరే... పరిహారమెప్పుడు?

వారాల తరబడి రైతుల ఎదురుచూపులు

ఈ సీజన్‌లో ఒక్కరికీ అందని పరిహారం

హైదరాబాద్‌, మే 1 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా పంటచేతికొచ్చే సమయంలో.. అకాల వర్షాల రూపంలో వచ్చి పడిన ప్రకృతి విపత్తుతో రైతాంగం కన్నీరుమున్నీరవుతోంది. కనీసం ప్రభుత్వం పరిహారంతో తమ ఆరుగాలం కష్టాన్ని వృథా కాకుండా ఆదుకుంటుందని భావించిన అన్నదాతలకు అది కూడా అందని ద్రాక్షగానే కనిపిస్తోంది. పంటల బీమా పథకాలు అమలులో లేకపోవటం, విపత్తు సాయం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకపోవటంతో... ప్రభుత్వ సాయం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు రాష్ట్రంలోని రైతన్నలు. వడగండ్ల వాన విరుచుకుపడటంతో చేతికిరావాల్సిన పంట కాస్తా నీటిపాలు అవుతోందని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటనల వరకేనా.. పరిహారం ఏమైనా ఇస్తుందా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు.. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వనంత పరిహారం ఇస్తామని, ఎకరానికి రూ. 10 వేలు పంపిణీ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఏ రైతు ఖాతాలోనూ పంట నష్టపరిహారం నయాపైసా జమకాలేదు. ఇక గత నెలలో కురిసిన వానల కారణంగా జరిగిన పంట నష్టంపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవరిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్‌లో పంటచేతికి వచ్చే సమయంలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి 17 నుంచి మొదలైన అకాల వర్షాల దాడి ఇంకా కొనసాగుతోంది.

కేవలం గత నెలలో కురిసిన వర్షాల కారణంగానే ఏకంగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాలో కలిపి ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వ్యవసాయశాఖ అధికారులు ఇప్పటికే సేకరించారు. అయితే ఈ పంటలకు నష్టపరిహారం ఇచ్చే అంశంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. మార్చిలో ప్రకటించిన రూ. 10 వేల పరిహారం బట్టి అంచనా వేస్తే.. రూ. 500 కోట్ల నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాల్సి వస్తుంది. కానీ ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. ఆ చెల్లింపుల్ని సర్కారు ఎలా సర్దుబాటు చేస్తుందన్నదానిపైనా స్పష్టత లేదు. మార్చి 17 నుంచి 22 మధ్యకాలంలో జరిగిన పంటనష్టానికి సంబంధించిన పరిహారం తాలూకు బిల్లులన్నీ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆర్థికశాఖ నుంచి సంబంధిత ట్రెజరీలకు నిధులు సర్దుబాటు చేయకపోవటంతో.. బిల్లులు పాస్‌ కావటంలేదు. ఇటు రైతులు మాత్రం మూడు వారాలుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టం సర్వేను శాస్త్రీయంగా నిర్వహించటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏఈవోలు క్షేత్రస్థాయికి వెళ్లి 33 శాతం కంటే ఎక్కువ పంటనష్టం జరిగితేనే రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. అంతకంటే తక్కువైతే పట్టించుకోవడం లేదు. ఎన్యుమరేషన్‌ పేరుతో విస్తీర్ణంలో కోత పెడుతున్నారు. దీంతో పంటనష్టం సర్వేపై అంతా అయోమ యం నెలకొంది.

Updated Date - 2023-05-02T04:17:30+05:30 IST