అవతరణ దినోత్సవం గిఫ్ట్‌.. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది 400 మంది ఔట్‌

ABN , First Publish Date - 2023-06-02T03:02:12+05:30 IST

ఓ వైపు రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటుండగా.. మహిళాశిశు సంక్షేమ శాఖలో 1098-చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలందించే 400 మంది ఉద్యోగుల మెడపై కత్తి వేళాడింది.

అవతరణ దినోత్సవం గిఫ్ట్‌.. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ సిబ్బంది 400 మంది ఔట్‌

మహిళాశిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆదేశాలు

ఔట్‌సోర్సింగ్‌లో భర్తీ చేయాలని సూచన

ఆందోళనలో చైల్డ్‌ లైన్‌ సిబ్బంది

2న నోటిఫికేషన్‌.. జూలై 4న నియామకాలు

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు రాష్ట్రమంతా తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరుపుకొంటుండగా.. మహిళాశిశు సంక్షేమ శాఖలో 1098-చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా సేవలందించే 400 మంది ఉద్యోగుల మెడపై కత్తి వేళాడింది. వారి కొలువులను సామూహికంగా ఊడగొట్టేందుకు రంగం సిద్ధమైంది. వారం రోజులుగా.. వారిని తొలగిస్తాం.. లేదు లేదు.. వారినే కొనసాగిస్తాం అంటూ మీనమేషాలు లెక్కించిన మహిళాశిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ భారతి హోలికేరీ.. తాజాగా బుధవారం ఆ పోస్టులన్నింటినీ ఔట్‌సోర్సింగ్‌తో సర్దేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకానికి షెడ్యూల్‌ విడుదల చేశారు. దీంతో.. ఇంతకాలం 1098-చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు సేవలందించిన ఉద్యోగుల భవిత ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో ముందే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి తక్కువ వేతనాలకు పనిచేస్తున్న తమను.. దశాబ్ది ఉత్సవాల వేళ ఉద్యోగాల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసమంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి ‘కొలువులు ఉంటాయా..? ఊడతాయా?’ శీర్షికన మే 30న ‘ఆంధ్రజ్యోతి’లో ఓ కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని పరిగణలోకి తీసుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌.. ప్రస్తుత సిబ్బందినే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. దీంతో కమిషనర్‌ మే 31న ప్రస్తుత సిబ్బందిని కొనసాగించేలా.. కలెక్టర్ల ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలంటూ జిల్లా అధికారులకు సందేశాలు పంపారు. అంతలోనే ఏమైందో కానీ.. ‘‘కొత్త సిబ్బందిని నియమించండి’’ అంటూ జిల్లా అధికారులకు మరో ఉత్తర్వును పంపించారు. తాజా ఉత్తర్వులో మాత్రం ప్రస్తుత సిబ్బంది అంశాన్నే ప్రస్తావించలేదు. దీంతో అసలు 1098 సిబ్బంది విషయంలో ఎపుడు ఏం జరుగుతుందో తెలియక జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొత్త సిబ్బందిని నియమించుకోవాలంటూ నియామక షెడ్యూల్‌తో మే 31 తేదీతో పంపిన మరో ఉత్తర్వును గురువారం సాయంత్రం పంపారు. గురువారం పంపిన ఈ ఉత్తర్వులో బుధవారం నాటి తేదీని ప్రస్తావించడంపై జిల్లా అధికారులు తికమకపడుతున్నారు.

అసలేం జరిగింది??

కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ వాత్సల్య’లో భాగమైన చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌-1098లో ఇటీవల పలు మార్పులు చేసింది. ‘చైల్డ్‌ లైన్‌ ఫౌండేషన్‌’తో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇకపై రాష్ట్రాలే చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ను పర్యవేక్షిస్తూ, కొనసాగించాలని ఆదేశించింది. ఇందుకు గాను.. రాష్ట్రాలకు ప్రత్యేక బడ్జెట్‌ను కూడా కేటాయించినట్లు తెలిపింది. అవసరమైన సిబ్బందిని రాష్ట్రాలే నియమించుకోవాలని సూచించింది. ఇప్పటికే పనిచేస్తున్న వారిని కొనసాగించవచ్చని తెలిపింది. కానీ, రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగించాలంటూ స్వయంగా మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పినా.. బేఖాతరు చేస్తూ కొత్త సిబ్బంది నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడులో ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొనసాగించాలంటూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిందని, ఇక్కడ కూడా అలాంటి చర్యలు తీసుకుని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిబ్బంది కోరుతున్నారు.

నెల రోజుల్లో నియామకాలు

కమిషనర్‌ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. నెల రోజుల్లో కొత్త సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ఈ నెల 2న నోటిఫికేషన్‌ విడుదల చేయాలని.. 3వ తేదీన చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌ పొజిషన్స్‌ తెలపడంతో పాటు దరఖాస్తుల స్వీకరణకు 13ను చివరి తేదీగా ఆ ఉత్తర్వుల్లో నిర్ణయించారు. దరఖాస్తుల పరీశీలనను 18లోపు పూర్తిచేసి, 23వ తేదీ నాటికి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించాలి. 30 వరకు అభ్యర్ధుల పోలీస్‌ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తిచేయాలి. ఎంపికైన అభ్యర్థులకు వచ్చేనెల 4న నియామక పత్రాలను అందించాలని కమిషనర్‌ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి. సంబంధిత ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీని కలెక్టర్లు నియమిస్తారని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. దీన్ని బట్టి.. ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల కోసమే కొత్త సిబ్బందిని నియమించుకుంటున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టుల్లో ఇప్పటికే సిబ్బంది ఉండగా, ఇవే పోస్టులను భర్తీ చేయాలని పేర్కొనడంతో జిల్లా సంక్షేమాధికారులు కూడా ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

Updated Date - 2023-06-02T03:02:12+05:30 IST