మాకెదురు లేదు

ABN , First Publish Date - 2023-06-02T02:51:22+05:30 IST

తెలంగాణలో తమకెవరూ పోటీ లేరని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు మరుగుజ్జు పార్టీలని ఎద్దేవా చేశారు.

మాకెదురు లేదు

90-100 సీట్లు మావే.. సీఎంగా కేసీఆరే

కాంగ్రెస్‌, బీజేపీ మరుగుజ్జు పార్టీలు

బీజేపీకి మూడో స్థానమూ దక్కదు

ఉన్న ఆ మూడు సీట్లూ కోల్పోతుంది

మోదీ.. అత్యంత అసమర్థ ప్రధాని

మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి కేటీఆర్‌

స్థలాలు అమ్మితే వచ్చేది సర్కారుకే కదా?

ట్విన్‌టవర్లపై ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తమకెవరూ పోటీ లేరని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు మరుగుజ్జు పార్టీలని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పోటీ సమ ఉజ్జీలతో ఉంటుందని.. రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు పోటీయే లేదని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ 90 నుంచి 100 స్థానాలు గెలుచుకుంటుందన్నారు. కేసీఆర్‌ మూడోసారి సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక ‘ఆ భూములను అమ్మేందుకే’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై స్పందిస్తూ.. భూమి రూపంలో ఉన్నా, డబ్బుల రూపంలో ఉన్నా ఏదైనా ప్రభుత్వానిదే కదా? అమ్మితే తప్పేంటి? అని కేటీఆర్‌ అన్నారు. హెచ్‌వోడీ కార్యాలయాల భూముల అమ్మకాలకు సిద్ధమైనట్లు చెప్పకనే చెప్పారు! 25 రోజుల బ్రిటన్‌, అమెరికా పర్యటన ముగించుకుని నగరానికి వచ్చిన ఆయన గురువారం మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. దక్షిణాదిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్నీ కోల్పోయిన బీజేపీ.. తెలంగాణలో అధికారంలోకి వస్తామని పగటికలలు కంటోందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ‘‘రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుంది? కేవలం సోషల్‌ మీడియాలోనే ఉంది. గత ఎన్నికల్లో రాష్ట్రంలో 119 స్థానాల్లో పోటీ చేస్తే 108 చోట్ల డిపాజిట్లు దక్కలేదు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని అంటున్నారు. నా అంచనా ప్రకారం.. అది కూడా దక్కదు. ప్రస్తుతం ఉన్న గోషామహల్‌, దుబ్బాక, హుజూరాబాద్‌ సీట్లనూ వచ్చే ఎన్నికల్లో కోల్పోతుంది. స్వతంత్ర భారతంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీయే. సిలిండర్‌కు దండం పెట్టి మన్మోహన్‌ను సాగనంపాలని మోదీ 2014 ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇప్పుడు మేం కూడా సిలిండర్‌కు దండం పెట్టి బీజేపీని ఓడించాలని కోరతాం. 2024 ఎన్నికల తర్వాత మోదీ కనిపించరు’’ అని కేటీఆర్‌ అన్నారు.

ప్రతిపక్షాలకు పనిలేదు..

‘‘రాష్ట్రంలో మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది. ఏదో ఒక ఆరోపణ చేయాన్నట్లుగా కాంగ్రెస్‌, బీజేపీ వ్యవహరిస్తున్నాయి. భట్టి విక్రమార్క ఎర్రటి ఎండలో 750 కి.మీ. నడిచారు. పనిలేదు కాబట్టే ప్రతిపక్ష నేతలు తొమ్మిదేళ్లుగా వాగుతూనే ఉన్నారు. ఒక్కసారి కూడా రుజువులతో మాట్లాడలేకపోయారు. ఆధారాలుంటే నిఘా సంస్థలకు అందించవచ్చు’’ అన్నారు. ‘‘గతంలో దశాబ్దాలుగా చేయని అభివృద్ధిని నేడు బీఆర్‌ఎస్‌ పార్టీ చేసింది. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. చేతిలో ఉన్న రూపాయిని పారేసి చిల్లర ఏరుకోవద్దు. తెలంగాణ కాదని చిల్లర రాజకీయాలు చేసే నాయకులను ప్రజలు పట్టించుకోవద్దు. కాంగ్రెస్‌, బీజేపీల పరిపాలన కొత్త సీసాలో పాత సారా మాదిరి ఉంటుంది. కేంద్రమంత్రులు టాయిలెట్స్‌, రైల్వే స్టేషన్లలోని లి్‌ఫ్ట్‌లు ప్రారంభిస్తున్నారు. మేము ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టులు కడుతున్నాం’’ అని కేటీఆర్‌ చెప్పారు.

మత ప్రాతిపదికన ఓట్లు వేయరు..

రాష్ట్రంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మైనారిటీలకు ఏమీ చేయడం లేదని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఇటీవలే చేస్తున్న ఆరోపణలపై మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ రాష్ట్రం మైనారిటీలకు చేసిన కార్యక్రమాల గురించి ఇతర రాష్ట్రాల్లో గొప్పగా చెప్పిన విషయం మర్చిపోవద్దన్నారు. యూపీ ఎన్నికల ప్రచారంలోనూ ఒవైసీ చేసిన ప్రసంగాల వీడియోలు ఉన్నాయని.. అక్కడ మాట్లాడింది నిజమా? ఇక్కడ మాట్లాడుతున్నది నిజమా? అన్నది ఆయనే తేల్చుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నది ఆ పార్టీ ఇష్టమని చెప్పారు. అయితే ప్రజలు మత ప్రాతిపదికన ఓట్లు వేస్తారంటే తాను నమ్మనన్నారు. పార్లమెంటు స్థానాలు పెంచాలని కేంద్రప్రభుత్వం భావిస్తోందని, జనాభా ప్రాతిపదికన సీట్లను పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్‌ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం జనాభాను విపరీతంగా పెంచాయని గుర్తుచేశారు. జనాభా నియంత్రణ చేపట్టిన రాష్ట్రాలు నష్టపోకూడదన్నదే తన వాదన అని చెప్పారు.

దమ్ముంటే సీఎం అభ్యర్థిని ప్రకటించండి

కర్ణాటకలో అధికారంలోకి రావడంతో రాష్ట్ర కాంగ్రె్‌సలో ఉత్తేజం వచ్చిందని, ఆ పార్టీని ఎలా ఎదుర్కొంటారన్న ప్రశ్నకు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తమతో పోటీ పడే పరిస్థితి లేదని కేటీఆర్‌ బదులిచ్చారు. అధికారంలోకి వస్తామన్న భ్రమలో కాంగ్రెస్‌ పార్టీ ఉందన్నారు. షర్మిల, కేఏ పాల్‌ లాంటి వాళ్లు కూడా అధికారంలోకి వస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు 90-100 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆర్‌ సీఎం అవుతారని చెప్పారు. దమ్ముంటే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని సవాలు చేశారు.

భూముల అమ్మకం నిజమే!?

‘ఆ భూములను అమ్మేందుకే’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీల కార్యాలయాలున్న స్థలాలు అమ్మేందుకే సర్కారు ట్విన్‌ టవర్స్‌ నిర్మించనుందని.. దాదాపు 250 ఎకరాలు అమ్మాలని యోచిస్తోందని కథనంలో ప్రస్తావించాం. దీనిపై కేటీఆర్‌ స్పందిస్తూ.. ప్రభుత్వ భూములను అమ్మినా ఆ డబ్బులు ప్రభుత్వానికే వస్తాయి కదా? నేతల జేబుల్లోకి వెళ్లవు కదా..? అన్నారు. భూమి రూపంలో ఉన్నా, డబ్బుల రూపంలో ఉన్నా ఏదైనా ప్రభుత్వానిదే కదా? అమ్మితే తప్పేంటి? అన్నారు. మంత్రి వ్యాఖ్యలనుబట్టి చూస్తే.. భూముల అమ్మకానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు స్పష్టమవుతోంది.

ఎమ్మెల్యేలు మరింత మెరుగవ్వాలి..

పనితీరు బాగున్న ఎమ్మెల్యేలందరికీ వచ్చే ఎన్నికల్లో సీట్లు దక్కుతాయని కేటీఆర్‌ అన్నారు. వెనకబడిన ఎమ్మెల్యేలు పనితీరును మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం చెబుతున్నారన్నారు. ఇంకా ఆర్నెల్ల సమయం ఉన్నందున, ఇప్పుడే ఈ విషయంలో ఏం చెప్పలేమని వ్యాఖ్యానించారు.

ఓఆర్‌ఆర్‌పై విచారణకు సిద్ధం

ఔటర్‌ రింగ్‌ రోడ్‌ టెండర్‌ ప్రక్రియలో ఎలాంటి కుంభకోణం జరగలేదని కేటీఆర్‌ చెప్పారు. ఈ విషయంపై అనుమానాలు నివృత్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను తానే కోరానన్నారు. ఇప్పటికే మున్సిపల్‌ శాఖ ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించిందని, దీనిపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రతిపక్షాల వద్ద రుజువులు ఉంటే కోర్టుకు సమర్పించాలన్నారు. నోట్ల రద్దు తెలివితక్కువ నిర్ణయమని.. గతంలో కేంద్రప్రభుత్వానికి మద్దతిచ్చినందుకు చింతిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2023-06-02T02:51:22+05:30 IST