పాలిసెట్‌లో 82% ఉత్తీర్ణత
ABN , First Publish Date - 2023-05-27T04:10:08+05:30 IST
పాలిసెట్‌లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురుతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం కొంత ఎక్కువ నమోదయింది.

● ఎంపీసీలో శరణ్యకు, ఎంబైపీసీలో ఆకాష్‌కు ఫస్ట్ ర్యాంకులు
● బాలురు 78.62%, బాలికలు 86.63% ఉత్తీర్ణత
హైదరాబాద్, మే 26 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్‌లో 82 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలురుతో పోలిస్తే బాలికల ఉత్తీర్ణత శాతం కొంత ఎక్కువ నమోదయింది. ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ శుక్రవారం విడుదల చేశారు. ఈ ఏడాది 1,05,742 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 98,274 మంది పరీక్ష రాశారు. వీరిలో 80,752 అభ్యర్థులు (82.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 43,006 (78.62 శాతం), బాలికలు 37,746 (86.63 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు కంటే బాలికల ఉత్తీర్ణత సుమారు 8 శాతం ఎక్కువ. మొత్తం 120 మార్కులకు పాలిసెట్ నిర్వహించారు. ఇందులో 30 శాతం అంటే 36 మార్కులు సాధించిన వారిని ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులైతే 1 మార్కు సాధిస్తే చాలు. 17,093 మంది ఎస్సీ విద్యార్థులు పాలిసెట్ రాయగా 17,091 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించలేకపోయారు. పాలిసెట్ రాసిన 7861మంది ఎస్టీ విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. కాగా, పాలిసెట్ ఎంపీసీ విభాగంలో మొదటి మూడు ర్యాంకులు సూర్యాపేట జిల్లా విద్యార్థులకే రావడం విశేషం. మునగాల మండలం కలకోవకు చెందిన సురభి శరణ్య, సూర్యాపేట జమ్మిగడ్డకు చెందిన షేక్ అబూబకర్ సిద్ధిఖీ, సూర్యాపేట ప్రియాంక కాలనీకి చెందిన కైరోజు శశివదన్ వరుసగా రాష్ఠ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ర్యాంకులు సాధించారు.
జూన్ 14 నుంచి కౌన్సెలింగ్
జూన్ 14 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆ రోజు మొదటి దశ కౌన్సెలింగ్ చేపట్టి, జూన్ 25న మొదటి దశ సీట్లు కేటాయించనున్నారు. జులై 1 నుంచి రెండో దశ కౌన్సెలింగ్ చేపడతారు. జులై 7న రెండవ దశ సీట్లు కేటాయిస్తారు. జులై 14న స్పాట్ అడ్మిషన్లను చేపట్టనున్నారు. జులై 17 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
Plant Banana Peels All Over Your Garden, Look What Happens A Week LaterTips and Tricks|Sponsored
New Small Electric Cars For Seniors - The Price May Surprise YouElectric Cars | Search Ads|Sponsored