ఢిల్లీ మద్యం కేసులో.. 76 కోట్ల ఆస్తుల అటాచ్‌

ABN , First Publish Date - 2023-01-26T03:16:22+05:30 IST

ల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు మరింత పెంచింది. ఈ కేసులోని నిందితులు, వారి సంస్థలకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది.

ఢిల్లీ మద్యం కేసులో.. 76 కోట్ల ఆస్తుల అటాచ్‌

హైదరాబాద్‌లోని అరుణ్‌ పిళ్లై స్థలం కూడా

అధికారికంగా వివరాలు వెల్లడించిన ఈడీ

నిందితుల బెయిల్‌ పిటిషన్లపై.. కోర్టు విచారణ ఫిబ్రవరి 9కి వాయిదా

న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు మరింత పెంచింది. ఈ కేసులోని నిందితులు, వారి సంస్థలకు చెందిన రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. ఈ వివరాలను బుధవారం ఈడీ అధికారికంగా వెల్లడించింది. నిందితుల్లో.. సమీర్‌ మహేంద్రుకు చెందిన ఢిల్లీలోని రూ.35 కోట్ల విలువైన నివాసం, అమిత్‌ అరోరాకు చెందిన గురుగ్రామ్‌లోని రూ.7.68 కోట్ల విలువైన నివాసం, విజయ్‌ నాయర్‌కు చెందిన ముంబైలోని రూ.1.77 కోట్ల విలువైన నివాసాన్ని అటాచ్‌ చేసినట్లు తెలిపింది. వీటితోపాటు దినేశ్‌ అరోరాకు చెందిన చికా, లా రోకా, అన్‌ప్లగ్డ్‌ కోర్ట్‌యార్డ్‌ రెస్టారెంట్‌లకు సంబంధించిన రూ.3.18 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు పేర్కొంది. దీంతోపాటు అరుణ్‌ రామచంద్ర పిళ్లైకి హైదరాబాద్‌ శివారులోని వట్టినాగులపల్లిలో ఉన్న రూ.2.25 కోట్ల విలువైన స్థలాన్ని జప్తు చేశామని తెలిపింది.

ఇవేకాకుండా, ఇండో స్పిరిట్స్‌ సంస్థకు చెందిన రూ.10.23 కోట్ల విలువైన 50 వాహనాలు, రూ.14.39 కోట్ల మేర బ్యాంకు బ్యాలెన్సు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను అటాచ్‌ చేశామని వెల్లడించింది. కాగా, ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అవినీతి, కుట్ర జరిగినట్లు తమ దర్యాప్తులో తేలిందని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.2873 కోట్ల మేర నష్టం జరిగిందని ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు హైదరాబాద్‌, ఢిల్లీ, చెన్నై, ముంబైతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు గుర్తు చేసింది. తాము సీజ్‌ చేసిన రికార్డులను అధ్యయనం చేసిన తర్వాత ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్‌ నాయర్‌, అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్‌ బోయినపల్లి, వ్యాపారవేత్తలు సమీర్‌ మహేంద్రు, అమిత్‌ అరోరా, బినయ్‌ బాబును అరెస్టు చేశామని, వారు ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని తెలిపింది. రెండు చార్జిషీట్లు దాఖలు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ వివరించింది.

బెయిల్‌ పిటిషన్‌పై విచారణ 9కి వాయిదా..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన నిందితులు అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రా రెడ్డి, బినయ్‌ బాబు, విజయ్‌ నాయర్‌ దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. విచారణను రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఫిబ్రవరి 9కి వాయిదా వేసింది. అదే రోజు తీర్పు ఇచ్చే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు.

Updated Date - 2023-01-26T03:16:38+05:30 IST