లాక్‌డౌన్లో వాయిదా వేసిన జీతాలకు 6 శాతం వడ్డీ

ABN , First Publish Date - 2023-02-21T03:43:23+05:30 IST

లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఇవ్వకుండా వాయిదా వేసిన జీతాలు, పింఛన్లపై ఆరు శాతం వడ్డీ చెల్లించాలని సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

లాక్‌డౌన్లో వాయిదా వేసిన జీతాలకు 6 శాతం వడ్డీ

చెల్లించాలని రాష్ట్రానికి హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఇవ్వకుండా వాయిదా వేసిన జీతాలు, పింఛన్లపై ఆరు శాతం వడ్డీ చెల్లించాలని సోమవారం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2020 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ప్రభుత్వం 50 శాతం వేతనాల చెల్లింపులను వాయిదా వేసింది. వాయిదా వేసిన వేతనాలను 2020 - 21లో తిరిగి చెల్లించింది. అయితే వేతనాలు, పింఛన్లు వాయిదా వేయడం చట్టవిరుద్ధమని, వాయిదా వేసిన కాలానికి 12 శాతం వడ్డీ చెల్లించాలని కోరుతూ కొందరు ఉద్యోగులు, పింఛనుదారులు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఇదే తరహా వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. వాయిదా వేసిన వేతనాలపై ఆరు శాతం వడ్డీ ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వర్సెస్‌ డి. లక్ష్మి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా 6శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది.

Updated Date - 2023-02-21T03:43:24+05:30 IST