3 parties 'Social' War!: 3 పార్టీల ‘సోషల్‌’ వార్‌!

ABN , First Publish Date - 2023-03-31T02:55:56+05:30 IST

రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య సోషల్‌ మీడియాలో యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కేటీఆర్‌, బండి సంజయ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటే.. ఆ రెండు పార్టీలు తోడు దొంగలంటూ కాంగ్రెస్‌ విమర్శించింది.

3 parties  'Social' War!: 3 పార్టీల ‘సోషల్‌’ వార్‌!

బీజేపీ దిక్కుమాలిన పార్టీ

తెలంగాణలో ఎందుకు?: కేటీఆర్‌

దళితుణ్ని సీఎం చేయని

కేసీఆర్‌ ఎందుకుండాలి?

ప్రకటనలు మాత్రమే చేసే

పార్టీనెందుకు భరించాలి: బండి

ఆ 2 పార్టీలు తోడుదొంగలే: కాంగ్రెస్‌

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రధాన పార్టీల మధ్య సోషల్‌ మీడియాలో యుద్ధం నడుస్తోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు కేటీఆర్‌, బండి సంజయ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటుంటే.. ఆ రెండు పార్టీలు తోడు దొంగలంటూ కాంగ్రెస్‌ విమర్శించింది. గురువారం ట్విటర్‌ వేదికగా ఈ మాటల యుద్ధం నడిచింది. ప్రధాని మోదీ ప్రాధాన్యాల్లో తెలంగాణ లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్య క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దిక్కుమాలిన పార్టీ బీజేపీ తెలంగాణలో ఎందుకుండాలని ట్విటర్‌లో ప్రశ్నించారు. రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, పసుపు బోర్డు, ఐటీఐఆర్‌ ప్రాజెక్టు, మెట్రో రెండో దశ, గిరిజన వర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వనప్పుడు.. ప్రజలు ఆ పార్టీకి ఎందుకు ప్రాధాన్యమివ్వాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో నలుగురు వెన్నెముకలేని బీజేపీ ఎంపీలు ఉన్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టానికి కేంద్రం తూట్లు పొడిచినా, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించి, అక్కడి లోకోమోటివ్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు ప్రకటించినా.. ఇక్కడి బీజేపీ ఎంపీలు మాట్లాడడం లేదని ఆరోపించారు.

గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితమే ఇదని వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ విమర్శలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బదులిస్తూ.. దళితుణ్ని సీఎం చేయని, మూడెకరాల భూమి ఇవ్వని, నిరుద్యోగ భృతి, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లివ్వని, స్థానిక సంస్థలకు నిధులివ్వని సీఎం కేసీఆర్‌ను ప్రజలు ఎందుకు భరించాలని ప్రశ్నించారు. ప్రకటనలే తప్ప ఆలయాలకు నిధులివ్వని, అర్హులకు దళితబందు ఇవ్వని, ఉద్యోగాలు భర్తీ చెయ్యని పార్టీని ఎందుకు భరించాలని నిలదీశారు. పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే.. కేసీఆర్‌ను రాష్ట్రం నుంచి ఎందుకు తొలగించకూడదని సంజయ్‌ ప్రశ్నించారు. వీరిద్దరి ట్వీట్‌లపై కాంగ్రెస్‌ స్పందించింది. విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణను పట్టించుకోని బీజేపీ; కాంగ్రెస్‌ చట్టబద్ధత కల్పించిన హామీలను నెరవేర్చుకోలేని చవట పార్టీ బీఆర్‌ఎస్‌.. అంటూ విమర్శించింది. దొంగలు దొంగలు తన్నుకుంటే చోరీ బయటపడినట్లు ఉందని.. టీపీసీసీ వ్యాఖ్యానించింది.

Updated Date - 2023-03-31T02:55:56+05:30 IST