పంట నష్టపరిహారం 230 కోట్లు!
ABN , First Publish Date - 2023-06-07T04:06:27+05:30 IST
వడగండ్లు, అకాల వర్షాలకు గత ఏప్రిల్ నెలలో జరిగిన పంట నష్టానికి రైతులకు రూ. 230 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది.
వ్యవసాయ కమిషనరేట్ తుది నివేదిక
హైదరాబాద్, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): వడగండ్లు, అకాల వర్షాలకు గత ఏప్రిల్ నెలలో జరిగిన పంట నష్టానికి రైతులకు రూ. 230 కోట్ల నష్ట పరిహారం ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 2.30 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు ఎకరానికి రూ. 10 వేల చొప్పున రూ. 230 కోట్లు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ లెక్కలు తేల్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ కమిషనరేట్ నుంచి మంగళవారం తుది నివేదికను పంపించారు. ఈ యాసంగి సీజన్‌లో మార్చి, ఏప్రిల్ నెలల్లో అకాల వర్షాలు పడటంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మార్చి నెలలో కురిసిన వడగళ్లు, అకాలవర్షాలకు 1.51 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి రూ. 10 వేల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రూ. 151 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇంతవరకు ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేయలేదు. తాజాగా మలివిడత నష్టానికి రూ. 230 కోట్లు చెల్లించాల్సి వస్తుందని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ ప్రతిపాదనలు పంపించింది.