Hyderabad: ఓ రూటు ఈజీ.. మరో రూటు బిజీ.. ఖాజాగూడ జంక్షన్‌లో కొత్త ఆంక్షలు
ABN , Publish Date - Dec 22 , 2023 | 11:26 AM
వారం రోజుల క్రితం వరకు ఖాజాగూడ సర్కిల్(Khajaguda Circle) వద్ద చౌరస్తా దాటాలంటే కనీసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు వేచి ఉండాల్సి వచ్చేది.
- ఇతర మార్గాల్లో ఇబ్బందులు
- సరైన పరిష్కారం చూడాలని వినతులు
ట్రాఫిక్ సమస్యల పరిష్కారం పేరిట ఖాజాగూడ సర్కిల్ వద్ద సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఆంక్షలతో కొందరికి లబ్ధి చేకూరినప్పటికీ.. మరి కొందరికి ఇబ్బందికరంగా మారిందని సామాజిక మాధ్యమాల్లో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): వారం రోజుల క్రితం వరకు ఖాజాగూడ సర్కిల్(Khajaguda Circle) వద్ద చౌరస్తా దాటాలంటే కనీసం 15 నిమిషాల నుంచి అరగంట వరకు వేచి ఉండాల్సి వచ్చేది. సమస్య పరిష్కారంలో భాగంగా గత శనివారం నుంచి ఖాజాగూడ జంక్షన్‌ను పూర్తిగా మూసేస్తున్నట్లు ట్రాఫిక్ విభాగం జాయింట్ సీపీ వెల్లడించారు. అప్పటి నుంచి కొత్త నిబంధనలు అమలవుతున్నాయి. ఆయా మళ్లింపులు ఓ రూట్ వారికి సునాయాసంగా మారినప్పటికీ... మరో రూట్ వారికి మరింత సంకటంగా మారాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు కొత్త నిబంధన ప్రకారం తలెత్తుతున్న సమస్యను గుర్తించకుండా చర్యలు చేపట్టారని.. పునరాలోచించి.. వెయిటింగ్ టైం తగ్గించాలని కోరుతున్నారు.
ఏం జరుగుతోంది?
పోలీసులు అమలు చేస్తున్న కొత్త నిబంధన ప్రకారం.. నానక్‌రామ్ గూడ రోటరీ నుంచి విస్పర్ వ్యాలీ జంక్షన్ వైపు వెళ్లేవారు బయో డైవర్సిటీ జంక్షన్ వైపు లెఫ్ట్ టర్న్ తీసుకుని పక్వాన్ యూ టర్న్ వద్ద యూ టర్న్ తీసుకుని విస్పర్‌వ్యాలీ జంక్షన్ వైపు వెళ్లాలి. (గతంలో నేరుగా రోటరీ నుంచి రైట్ టర్న్ తీసుకుని వెళ్లేవారు). ఇప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత పక్వాన్ వద్ద తొలి అడ్డంకి. షేక్‌పేట వైపు నుంచి వచ్చే వాహనాలకు తోడుగా ఇప్పుడు నానక్‌రావ్‌గూడ నుంచి వచ్చే వాహనాలు కూడా తోడయ్యాయి. అక్కడ కనీసం 5 నుంచి 10 నిముషాలు వెచ్చించాల్సిందే. అలాగే షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి ఫిల్మ్‌నగర్ వైపు వెళ్లే వాహనదారులు కూడా నేరుగా (గతంలో రోటరీ వద్ద యూటర్న్ తీసుకునేవారు) పక్వాన్ యూటర్న్ నుంచి టర్న్ తీసుకుని విస్పర్ వ్యాలీ వైపు వెళ్లాలి. అంటే వాహనాల సంఖ్య పక్వాన్ రోటరీ వద్ద విపరీతంగా పెరుగుతోంది.
మరో సమస్య
బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి మణికొండ వైపు వెళ్లే వారు పోచమ్మ టెంపుల్ వరకు నేరుగా వెళ్లి షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకుని మణికొండ వైపు వెళ్లాలనేది కొత్త నిబంధన. దాంతో గచ్చిబౌలి(Gachibowli) వైపు నుంచి వచ్చే వాహనాలకు తోడుగా మణికొండ వైపు వెళ్లే వాహనాలు తోడవుతున్నాయి. దీంతో షేక్‌పేట్ ఫ్లై ఓవర్ వద్ద పైకి వెళ్లే వాహనాలు.. పక్క నుంచి యూటర్న్ తీసుకోవాల్సిన వాహనాలు కిక్కిరిసి పోతున్నాయి. అంతకు ముందు పెద్ద రోడ్డుపై వస్తున్న వాహనదారులకు బాటిల్ నెక్‌గా మారుతున్న రోడ్డు మింగుడు పడడం లేదు. ఫలితంగా అక్కడా సమయాన్ని వృథా చేయక తప్పడం లేదని ఆరోపిస్తున్నారు. కేవలం షేక్‌పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులతో పాటు నానక్‌రామ్‌గూడ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే వారికి.., షేక్‌పేట్ నుంచి నానక్‌రామ్‌గూడ వైపు వెళ్లే వారికి మాత్రం కొత్త రూట్ కాస్త వెసులుబాటు కల్పించింది.