Share News

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

ABN , First Publish Date - 2023-11-29T11:38:01+05:30 IST

మజ్లిస్‌ - కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోటీ పడుతున్న నాంపల్లి(Nampally) శాసనసభ నియోజకవర్గంలో

Hyderabad: నాంపల్లిలో బోగస్‌ ఓట్లు.. 32 వేలకు పైగా పంపిణీ కాని స్లిప్‌లు

హైదరాబాద్‌, (ఆంధ్రజ్యోతి): మజ్లిస్‌ - కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్టు హోరా హోరీగా పోటీ పడుతున్న నాంపల్లి(Nampally) శాసనసభ నియోజకవర్గంలో ఓటరు లిస్టులో నమోదైన బోగస్‌ ఓట్లు గెలుపు-ఓటమిలను ప్రభావితం చేయనున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. సుమారు 32 వేలకు పైగా బోగస్‌ ఓటర్లున్నట్టు గుర్తించారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ బాధ్యతలు ఈ సారి ఎన్నికల సంఘం చేపట్టడంతో నాంపల్లి శాసనసభ నియోజకవర్గంలో భారీ ఎత్తున బోగస్‌ ఓటర్లు నమోదైనట్టు స్పష్టమైంది. ఇంటింటికీ వెళ్లి సంబంధిత ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేయగా దాదాపు 32 వేలకు పైగా స్లిప్‌లు మిగిలిపోవడంతో బీఎల్‌ఓలు సంబంధిత అధికారికి అప్పగించడంతో బోగస్‌ ఓటర్ల వివరాలు బహిర్గమైనట్టు నియోజకవర్గంలోని వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. తిరుగులేని ఆధిపత్యంతో ప్రతి సారి ఎన్నికల్లో విజయం సాధించిన మజ్లిస్‌ వివిధ కారణాలతో నాంపల్లిలో బలహీనపడింది. సుమారు దశాబ్ద కాలంగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన శాసనసభ్యుడు జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ స్థానకంగా ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ప్రతిసారి దళితులు, బడుగు, బలహీన వర్గాల ఓటర్లు మజ్లిస్ కు అండగా నిలుస్తున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన దళితబంధు పథకంలో దరఖాస్తు చేసుకున్న అనేక మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం అందక పోవడంతో కొన్ని వర్గాలు మజ్లిస్ కు వ్యతిరేకంగా మారాయి. డబుల్‌బెడ్‌రూం ఇళ్ల పథకంలో స్థానికంగా నివాసముంటున్న నిరుపేద దళితులు, ఇతర బీసీ వర్గాల కుటుంబాలకు ఆశించిన మేరకు ఎమ్మెల్యే కేటాయింపులు చేయకపోవడంతో వివిధ బస్తీల్లోని నిరుపేద కుటుంబాలు మజ్లిస్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కర్నాటక రాష్ట్ర ముస్లిం మైనారిటీల ప్రభావం అధికంగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలోని కొన్ని ముస్లిం వర్గాలు బాహాటంగా మజ్లిస్‌ విధానాలను వ్యతిరేకిస్తున్నాయి. నాంపల్లిలో నెలకొన్న మజ్లిస్‌ వ్యతిరేక వాతావరణాన్ని గుర్తించిన ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఇక్కడినుంచి ప్రాతినిద్యం వహించిన జాఫర్‌ హుస్సేన్‌ మెరాజ్‌ను తప్పించి యాకుత్‌పుర(Yakutpura) నుంచి రంగంలోకి దింపారు.

పార్టీ పట్ల ఏర్పడిన వ్యతిరేకత నుంచి గట్టెక్కడానికి ఇక్కడి నుంచి మాజీ మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌ను పోటీకి దింపారు. సుమారు 20 రోజులు పాటు రోజూ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) స్వయంగా పాదయాత్రలో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మాజిద్‌ హుస్సేన్‌ను గెలిపించాలని అభ్యర్థించారు. అయినప్పటికీ సానుకూల వాతావరణం రాకపోవడంతో పార్టీలోని సీనయర్‌ నేతలను రంగంలోకి దింపి ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. సుమారు దశాబ్ద కాలంగా నాంపల్లిలో మజ్లిస్‏ను మట్టికరిపించే ప్రధాన లక్ష్యంతో స్థానిక కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఫిరోజ్‌ ఖాన్‌ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యకర్తల బలగాన్ని పెంచుకున్నారు. ముస్లిం మైనారిటీలే కాకుండా మైనారిటీయేతర వర్గాలను సైతం ఆకర్షించి తనకు అనుకూలంగా మలుచుకున్నారు. మజ్లిస్‏ను వ్యతిరేకించే ముస్లింల వర్గాలకు దగ్గరయ్యారు. దీనికి తోడు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీకి సానుకూల పరిస్థితులు ఉన్నట్టు సర్వేల్లో స్పష్టం కావడంతో ఆయా వర్గాలకు చెందిన నాయకులు,ముఖ్యంగా యువత ఫిరోజ్‌ఖాన్‌కు అండగా నిలిచారు. జాఫర్‌ హుపస్సేన్‌ పై అసంతృప్తితో ఉన్న మైనారిటీ వర్గాలు ఎన్నికల్లో బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించాయి. కర్నాటక ప్రభావం ఉన్న మైనారిటీలు బాహాటంగా కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపడంతో గత్యంతరం లేక మజ్లిస్‌ నేతలు ఎలాగైనా గెలిచి తీరడానికి నమోదైన బోగస్‌ ఓట్లను వినియోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఓటర్ల జాబితా ఆధారంగా స్థానకంగా అందుబాటులో లేని వారి పేరుతో ఓటు వేయించేందుకు సైతం బోగస్‌ గుర్తింపు కార్డులు రూపొందిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితి మలక్‌పేట నియోజక వర్గంలో ఉన్నట్టు సమాచారం. సుమారు 27వేల మంది ఓటరు స్లిప్‌లు వాపస్‌ వచ్చినట్టు అధికార వర్గాల ద్వారా తెలిసింది. యాకుత్‌పురాలో పంపిణీ కాని సుమారు 35వేలకు పైగా ఓటరు స్లిప్‌లు అధికారుల వద్దకు చేరినట్టు సమాచారం.

Updated Date - 2023-11-29T11:38:03+05:30 IST