HYD: హెచ్‌సీఏ తెలంగాణ సొత్తు.. ఎల్లప్పుడు ఇద్దరు.. ముగ్గురే శాసిస్తామంటే కుదరదు
ABN , First Publish Date - 2023-10-19T08:44:26+05:30 IST
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రైవేట్ ఆస్తి కాదు, తెలంగాణ సొత్తు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి దానిపైన
- యునైటెడ్ ప్యానెల్ అధ్యక్ష అభ్యర్థి జగన్‌మోహన్‌రావు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ప్రైవేట్ ఆస్తి కాదు, తెలంగాణ సొత్తు, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి దానిపైన హక్కు ఉందని ఆ సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎ.జగన్‌మోహన్‌రావు(A. Jaganmohan Rao) అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఒక హోటల్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానెల్ తరఫున పోటీ పడుతున్న జగన్ మాట్లాడుతూ శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో తమ ప్యానెల్ 120 ప్లస్ ఓట్లతో గెలవనుందని ధీమా వ్యక్తం చేశారు. ‘నేను హెచ్‌సీఏకి బయట వ్యక్తిని అంటున్నారు. హెచ్‌సీఏ అనేది తెలంగాణలోనే ఉంది. రాష్ట్రానికి చెందినది. అలాంటప్పుడు నేను ఎలా బయట వ్యక్తిని అవుతా’ అని తనపై విమర్శలు చేస్తున్న వారిని నిలదీశారు. 2017లో నిర్వహించిన తెలంగాణ టీ20 లీగ్‌లో ఆడిన జట్లలో మెదక్ మేవరిక్స్ ఒకటి. నేను ఆ టీమ్ యజమానిని. నా జట్టు తరఫున ఎందరో యువ క్రికెటర్లకు ఆడేందుకు అవకాశమిచ్చా’ అని చెప్పారు. ‘మూడేళ్లుగా నేను శ్రీచక్ర క్లబ్‌లో సభ్యుడిని. ప్రస్తుతం క్లబ్ కోశాధికారిగా ఉన్నాను. అలాంటి నన్ను అసలు హెచ్‌సీఏ ఓటర్ లిస్ట్‌లో పేరు లేని వ్యక్తులు బయటవాడని విమర్శించడం హాస్యాస్పదం’ అని అన్నారు. హెచ్‌సీఏను ఎల్లప్పుడు ఇద్దరు.. ముగ్గురే శాసిస్తామంటే కుదరదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసి గెలువచ్చునని చెప్పారు. గ్రామీణ క్రికెటర్లను రంజీ ట్రోఫీ మొదలు జాతీయ జట్టు వరకు ఆడించాలనేది తమ ఆకాంక్ష అని అందుకోసం కష్టపడి పనిచేస్తామన్నారు. తాము గెలిచాక ఉప్పల్ స్టేడియాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మరో నాలుగైదు స్టేడియాల నిర్మాణానికి ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని చెప్పారు.
