Telangana New CS Shanti Kumari: శాంతికుమారినే సీఎస్‌గా ఎంచుకోవడం వెనుక సీఎం కేసీఆర్ లెక్కలివే..!

ABN , First Publish Date - 2023-01-11T19:56:36+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శాంతికుమారి (Telangana New CS Shanti Kumari) బాధ్యతలు స్వీకరించారు. సోమేష్ కుమార్ (Somesh Kumar) ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు (Andhra Pradesh Cadre) వెళ్లాల్సిందేనని..

Telangana New CS Shanti Kumari: శాంతికుమారినే సీఎస్‌గా ఎంచుకోవడం వెనుక సీఎం కేసీఆర్ లెక్కలివే..!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ శాంతికుమారి (Telangana New CS Shanti Kumari) బాధ్యతలు స్వీకరించారు. సోమేష్ కుమార్ (Somesh Kumar) ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు (Andhra Pradesh Cadre) వెళ్లాల్సిందేనని మంగళవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంతో బుధవారం నాడు కొత్త సీఎస్ నియామకం చకచకా జరిగిపోయింది. కొత్త సీఎస్‌గా శాంతికుమారి పేరు మీడియాకు తెలియడం, ఆమె కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలవడం, ఆ వెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించడం గంటల వ్యవధిలోనే జరిగిపోయాయి. అయితే.. శాంతికుమారి నియామకం వెనుక జరిగిన ఆసక్తికర పరిణామం ఏంటంటే.. తెలంగాణ సీఎస్‌ రేసులో ఆమె పేరు పెద్దగా వినిపించలేదు. స్పెషల్ చీఫ్ సెక్రటరీలు కె.రామకృష్ణ రావు, అర్వింద్ కుమార్ పేర్లు కొత్త సీఎస్ రేసులో ప్రధానంగా వినిపించాయి. రామకృష్ణారావుకు కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉందని, అర్వింద్‌కుమార్‌కు కేటీఆర్ అండదండలు ఉన్నాయని.. ఇలా ఈ ఇద్దరి చుట్టే కొత్త సీఎస్ ఎవరనే చర్చ జరిగింది.

Telangana-New-CS.jpg

రజత్‌కుమార్‌, కె.రామకృష్ణారావు, అర్వింద్‌కుమార్‌, సునీల్‌ శర్మ, రాణి కుముదిని పేర్లు సీఎస్ రేసులో వినిపించినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్యంగా శాంతికుమారిని కొత్త సీఎస్‌ ఎంపిక చేశారు. రాష్ట్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శాంతికుమారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించారు. రాణి కుముదిని, శాంతి కుమారి.. ఈ ఇద్దరిలో శాంతి కుమారినే కేసీఆర్ సీఎస్‌గా ఎంచుకోవడం వెనుక ప్రధానంగా ఒక కారణం ఉంది. 1988 బ్యాచ్‌కు చెందిన రాణి కుముదిని రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఆవిడ 2023 జులైలో రిటైర్ కానున్నారు. ఈ క్రమంలో ఆవిడ పట్ల ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. సీఎస్‌గా ఆమెను నియమించినా ఆరు నెలలు మాత్రమే కొనసాగే పరిస్థితి ఉండటంతో సీనియర్ అయినప్పటికీ ఆవిడను ప్రభుత్వం లైట్ తీసుకుంది.

IAS-Shanti-Kumari.jpg

1987 బ్యాచ్‌కు చెందిన వసుధా మిశ్రా అందరి కన్నా సీనియర్‌.. ప్రస్తుతం ఆమె కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఆవిడ వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. అందువల్ల.. సీఎస్‌గా ఈ మహిళా ఐఏఎస్‌ను నియమించేందుకు కూడా ప్రభుత్వం మొగ్గుచూపలేదు. రజత్‌కుమార్‌ బిహార్‌కు చెందిన వ్యక్తి. ఇప్పటికే బిహార్‌ అధికారులకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందంటూ కాంగ్రెస్‌ సహా ఇతర ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండడం రజత్‌కుమార్‌కు కొంత మైనస్‌ అయింది. ఇప్పటిదాకా సీఎస్‌గా పనిచేసిన సోమేశ్‌కుమార్‌ కూడా బిహార్‌కు చెందిన వ్యక్తే అయినందున రజత్‌కుమార్‌ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ఆయన కూతురి వివాహానికి పెట్టిన ఖర్చు విషయంలో వివాదం కూడా తలెత్తింది. ఈ నేపథ్యంలో రజత్‌కుమార్‌కు ప్రభుత్వం సీఎస్‌గా ఛాన్స్ ఇవ్వలేదు. ఇలా అనేక లెక్కలు బేరీజు వేసుకున్న తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని ఎంచుకోవడమే మేలనే అభిప్రాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చారు. గతంలో సీఎంవోలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం కూడా శాంతి కుమారికి కలిసొచ్చింది.

FmLwcWbacAYqwY1.jfif

ఎన్నికల సంవత్సరం కావడంతో అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో ముందుకు నడిపించి సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో శాంతి కుమారి సమర్థురాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఒక్కమాటలో చెప్పాలంటే అనుభవమా లేక పదవీ కాలమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పదవీ కాలం ఎక్కువ ఉన్న శాంతి కుమారి వైపే మొగ్గు చూపారు. 2025 ఏప్రిల్ వరకూ కొత్త సీఎస్‌గా శాంతికుమారి కొనసాగే అవకాశం ఉంది. శాంతి కుమారి కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా కావడం రాజకీయంగా కూడా కేసీఆర్‌కు కలిసొచ్చే అంశంగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారి రికార్డుల్లోకెక్కడం గమనార్హం.

Updated Date - 2023-01-11T20:02:57+05:30 IST