Fact Check: బైరి నరేష్, బండి సంజయ్ నిజంగానే భేటీ అయ్యారా..? క్లారిటీ వచ్చేసింది..!
ABN , First Publish Date - 2023-01-04T20:15:35+05:30 IST
అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ (Bairi Naresh) అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అయ్యప్ప స్వామి భక్తులతో..
అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ (Bairi Naresh) అనే వ్యక్తి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలకు కారణమయ్యాయి. అయ్యప్ప స్వామి భక్తులతో (Ayyappa Devotees) పాటు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా నరేష్ మాట్లాడటంతో అయ్యప్ప మాల ధరించిన భక్తులు భగ్గుమన్నారు. బైరి నరేష్‌ను (Bairi Naresh Arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. బైరి నరేష్‌కు మద్దతుగా పోస్టులు పెట్టిన భైరి అగ్నితేజ్‌పై (నరేష్‌కు వరుసకు సోదరుడు) కూడా పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. హిందువుల మనోభావాలను ఈ స్థాయిలో దెబ్బతీసిన భారత నాస్తిక సంఘం తెలంగాణ అధ్యక్షుడు నరేష్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) భేటీ అయ్యారనే వార్త రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
హిందూ మతాన్ని, దేవతలను ఇంతలా కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తితో హిందూ మత విశ్వాసాలను పాటిస్తూ, ‘జై శ్రీరామ్’ నినాదంతో ముందుకెళ్లే బండి సంజయ్ భేటీ కావడం ఏంటని రాజకీయ వర్గాలు విస్తుపోయాయి. కరీంనగర్ పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో బండి సంజయ్‌తో బైరి నరేష్ రహస్యంగా భేటీ అయ్యాడని.. ఆ భేటీ జరిగిన గంటల వ్యవధిలోనే అయ్యప్ప స్వామిపై నరేష్ ఈ వ్యాఖ్యల చేశాడని ఒక వెబ్‌సైట్ రాసుకొచ్చింది. ఈ వార్త వైరల్ కావడంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో బండి సంజయ్‌ను బైరి నరేష్ నిజంగానే కలిశాడా అనే సందేహాత్మక చర్చ జోరుగా జరిగింది. ఈ ప్రచారంపై తెలంగాణ బీజేపీ స్పందించింది. ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. సదరు వెబ్‌సైట్‌లో వచ్చిన ఆ వార్తను స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ‘ఫేక్ న్యూస్’ అని పేర్కొంది.
బైరి నరేష్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కలిశారనడం పూర్తి అవాస్తవమని, ఇది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చింది. ఇలాంటి తప్పుడు వార్తలతో బండి సంజయ్ కుమార్, బీజేపీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ బీజేపీ హెచ్చరించింది. అయినప్పటికీ ఈ బండి సంజయ్, బైరి నరేష్ భేటీ వార్తలకు తెరపడలేదు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్‌ఎస్ ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ బీజేపీని రాజకీయంగా ఇరకాటంలోకి నెట్టేసే ప్రయత్నం చేశాయి. ఈ భేటీ అబద్ధమని అయ్యప్ప స్వామి మీద ప్రమాణం చేసి బండి సంజయ్ చెప్పాలని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బండి సంజయ్ గతంలో యాదగిరిగుట్ట వెళ్లి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ సందర్భంలో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరిపిందనే టీఆర్‌ఎస్ నేతల ఆరోపణలపై స్పందించిన సందర్భంలో బండి సంజయ్ నెత్తిన నీళ్లు గుమ్మరించుకుని మరీ యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేశారు.
ఇదిలా ఉండగా.. అయ్యప్ప స్వామిపై దూషణలు చేసిన బైరి నరేష్‌తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భేటీ కావడం వెనుక ఉన్న రహస్యం ఏంటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్ పేరును కూడా అద్దంకి దయాకర్ ప్రస్తావించడం కొసమెరుపు. బైరి నరేష్‌తో బండి సంజయ్ భేటీ అవాస్తవమని తెలంగాణ బీజేపీ చెబుతున్నప్పటికీ ప్రత్యర్థి పార్టీలు మాత్రం రాజకీయ అస్త్రంగా బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఒక మంచి అవకాశంగా వినియోగించుకునే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.