Share News

Congress: చీకటి సూర్యులు చెయ్యెత్తి జైకొట్టారు.. కోల్‌బెల్ట్‌లో పది స్థానాలు కాంగ్రెస్‌వే

ABN , First Publish Date - 2023-12-05T09:11:53+05:30 IST

అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గుగనుల కార్మికులు, ఉద్యోగులు కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షమైన సీపీఐకి

Congress: చీకటి సూర్యులు చెయ్యెత్తి జైకొట్టారు.. కోల్‌బెల్ట్‌లో పది స్థానాలు కాంగ్రెస్‌వే

- సీపీఐ ఒకటి, బీఆర్‌ఎస్‌ ఒక చోట గెలుపు

ఇల్లెందు(కొత్తగూడెం): అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి బొగ్గుగనుల కార్మికులు, ఉద్యోగులు కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షమైన సీపీఐకి జైకొట్టారు. సింగరేణి కోల్‌బెల్ట్‌(Singareni Coalbelt) ప్రాంతాలు విస్తరించిన 12 నియోజకవర్గాల్లో గెలుపు, ఓటములను ప్రభావితం చేసే సింగరేణి కార్మికులు 10స్థానాల్లో కాంగ్రెస్‌ ను, సీపీఐని 1స్థానంలో, బీఆర్‌ఎస్‌ను ఒకస్థానంలో గెలిపిం చారు. సింగరేణి సంస్ధలో 42వేలమంది కార్మికులు, అధికారు లు ఉద్యోగుల కుటుంబాలు 25వేలమంది కాంట్రాక్టు కార్మికు ల కుటుంబాలు ఉన్నాయి. జయశంకర్‌భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల(Pedpadalli, Mancharyala), కొమరంభీం ఆసీఫాబాద్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని సింగరేణి పారిశ్రామిక ప్రాంతాల్లో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 6, బీఆర్‌ఎస్‌ 4, టీడీపీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్క స్థానాల్లో గెలుపొందారు. తదనంతరం సింగరేణి కోల్‌బెల్ట్‌లో గెలుపొందిన ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరడంతో బీఆర్‌ఎస్‌కు 11మంది ఎమ్మెల్యేలు, ఒక్కరు మాత్రమే కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సింగరేణి వ్యాప్తంగా సత్తుపల్లి, పినపాక, ఇల్లెందు, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, మంథని నియోజక వర్గాల్లో కార్మిక వర్గం కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించింది. కొత్తగూడెంలో కాంగ్రెస్‌ బలపరిచిన సీపీఐని, ఆసీఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌ను గెలిపించారు. మొత్తం 12అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 11అసెంబ్లీ స్ధానాల్లో సింగరేణి కార్మికవర్గం తీర్పునివ్వడం గమనార్హం.

cccccc.jpg

కార్మికవర్గంలో పెల్లుబుకిన అసంతృప్తి

సింగరేణి కార్మికులు, ఉద్యోగులు కాంట్రాక్టు కార్మికుల్లో అధికార బీఆర్‌ఎస్‌పై పెల్లుబుకిన ఆగ్రహనికి అనేక కారణా లు ఉన్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సింగరేణి కాలరీస్‌ నిధులను ఇష్టారాజ్యంగా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలకు మళ్లించడంతో కార్మికుల ఆగ్రహానికి కారణమైంది. ప్రభుత్వం చేయాల్సిన పనులకు సింగరేణి నిధులను వినియోగించుకోవడం, కోల్‌బెల్ట్‌ ప్రాంతాలకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా స్పెషల్‌డెవలప్‌మెంట్‌ ఫండ్‌ పేరిట రూ. కోట్లు ఇవ్వడం కార్మికుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. కోల్‌ఇండియాలో మాదిరిగా హైపవర్‌ కమిటీ వేతనాలు చెల్లించకపోవడం, కార్మికులు, ఉద్యోగులు రెండు పేర్ల మూలంగా అనేక సమస్యలకు ఎదుర్కొవడం నిత్యం ఆందోళనలు చెందుతున్నా వారి పేర్లను వారు కోరుకున్నట్లు రికార్డుల్లో నమోదు చేయకపోవడం కూడా కార్మికుల్లో వ్యతిరేకతకు కారణమైంది. డిపెండెంట్‌ ఉద్యోగాలు కల్పించకుండా కారుణ్య నియమకాల పేరిట మెడికల్‌బోర్డును ఏర్పాటు చేసి ఆన్‌ఫిట్‌ అయిన కార్మికులు, ఉద్యోగుల పిల్లలకే ఉద్యోగాలు కల్పించడం తీవ్ర విమర్శలకు గురైంది. పైరవీల మూలంగా కార్మికులకు న్యాయం జరగలేదన్న ఆవేదనకార్మికవర్గంలో అధికమైంది. కార్మికుల సొంతింటి కల కార్యరూపం దాల్చకపోవడం చీకటిసూర్యుల కుటుంబాల్లో ఆవేదనను రగిలించాయి. అధికార పార్టీ, అనుబంధ కార్మికసంఘం నాయకులు సంస్థ కార్యకలాపాల్లో మితి మీరిన జోక్యం చేసుకోవడం ప్రతిపని పైరవీలమయంగా మార్చడం బీఆర్‌ఎస్‌ పార్టీ పట్ల కార్మికవర్గం విముఖతకు కారణమైనట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆసీఫాబాద్‌ స్థానానికే పరిమితం చేసి 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ దాని అనుంబంధ సీపీఐ పార్టీల అభ్యర్థుల వైపు సింగరేణి కార్మికవర్గం మొగ్గు చూపినట్లు భావిస్తున్నారు.

Updated Date - 2023-12-05T09:11:54+05:30 IST